(13 ఏప్రిల్ ‘జలియన్‌వావా బాగ్ నరమేధ దుర్ఘటన దినం’ )
మొదటి ప్రపంచ యుద్ధం(1914-18) ముగిసిన వేళలవి. యుద్ధం మిగిల్చిన క్షతగాత్రులు, అధిక ద్రవ్యోల్బణ దుస్థితి అనుభవంలోకి వచ్చిన రోజులవి. అధిక పన్నులు, అంటువ్యాధులతో సామాన్య ప్రజాజీవనం తల్లడిల్లిన సమయమది. ఐక్యకూటమిగా జాతీయోద్యమం తిరిగి పుంజుకున్న సందర్భమది. దాదాపు 13 లక్షల భారతీయ జవాన్లు విదేశాల్లో సేవలందించిన ఘడియలవి. దాదాపు 43,000 మంది భారతీయ సైనికులు అమరత్వం పొందిన కష్టకాలమది. భారతీయ జవాన్లలో బ్రిటీష్ వలస పాలన వ్యతిరేకంగా తిరుగుబాటు భావనలు రగులుతున్న సంధి కాలమది. భారత్‌లో స్వాతంత్య్ర పోరాట జ్వాలలు ఎగిసిన రోజులవి. రౌలట్ చట్టంతో తిరుగుబాట్లను అణచివేయడానికి, నిర్భంధించడానికి, అనుమానితుల్ని అరెస్టు చేయడానికి వైస్రాయ్‌లకు విశేష అధికారాలు కట్టబెట్టిన దుర్మార్గపు పాలన చూసిన వేళలవి.
చరిత్రలో నిలిచిన నరమేధ ఉదంతం
13 ఏప్రిల్ 1919 ఆదివారం రోజు భారత స్వాతంత్య్ర పోరాటంలోనే బ్రిటీష్ అధికారుల అమానవీయ, రాక్షస దుర్ఘటనగా జలియన్‌వాలా బాగ్ నరమేధ ఉదంతం చరిత్రలో నిలిచి పోయింది. అమృత్‌సర్ స్వర్ణదేవాలయ సమీపాన ఉన్న జలియన్‌వాలా బాగ్ పార్కులో జరిగిన సాయంకాల అహింసాయుత సమావేశంలో పాల్గొన్న దేశ పౌరులు, వైశాఖీ వేడుకల్లో నిరాయుధులైన ప్రజలు సంతోష సాగరంలో మునిగి ఉన్నారు. రౌలట్ చట్టానికి విరుద్ధంగా సమావేశం ఏర్పాటు చేశారనే ఆవేశంతో బ్రిగేడియర్-జనరల్ రెగినాల్డ్ డైయ్యర్ అనాలోచిత, అహంకారపూరిత ఆదేశంతో దాదాపు 50 మంది సాయుధ బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ జవాన్లు ముందస్తు హెచ్చరికలు లేకుండా ఘోరమైన ఫైరింగ్ ప్రారంభించారు. ఈ విచక్షణారహిత, భయంకర 10 నిమిషాల కాల్పుల్లో పిల్లలు, స్త్రీలు, పురుషులు 379 మంది అమాయక పౌరులు, దేశభక్తులు ప్రాణాలు కోల్పోగా, 1,200లకు పైగా అమాయక ప్రజలు గాయపడటం జరిగింది. అమృత్‌సర్‌లో సమావేశాలను రద్దు చేశారనే జనరల్ డైయర్ ప్రకటన తెలియని అమాయకులు తమ సన్నిహితులైన దేశభక్తులు సత్యపాల్, సైఫుద్ధీన్‌ల అరెస్టులను వ్యతిరేకిస్తూ జరుపతలపెట్టిన శాంతియుత సమావేశంతో పాటు పౌరులు వైశాఖీ పండుగను కూడా నిర్వహించదలిచారు. అకస్మాత్తుగా, దుర్మార్గంగా జరిగిన 1,650 రౌండ్ల ఆర్మీ ఫైరింగ్ నరమేధంలో వందలాది ప్రాణాలు గాల్లో కలవడం దేశవాసుల్లో ఆవేశాగ్నిని రగిల్చింది. భారత జాతీయ కాంగ్రెస్ వివరాల ప్రకారం ఈ నరమేధంలో 1,000కి పైగా అమరులుకాగా, 1,500 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు.
ఆవేశాన్ని రగిల్చిన దుర్ఘటన
భారతీయ దేశభక్తులు ఈ దురంతానికి వ్యతిరేకంగా బ్రిటీష్ వలసపాలన అంతానికి సహాయ నిరాకరణోద్యమానికి నాంది పలికారు. షహీద్ భగత్ సింగ్‌లో విప్లవాగ్ని రగిల్చిన సంఘటనగా జలియన్‌వాలా బాగ్ నిలిచింది. 1920లో జరిగిన ఈ దుర్ఘటన స్థలంలో స్మారక స్థూపాన్ని నిర్మించాలని భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1961 ఏప్రిల్ 13న ఈ స్మారక స్థూపం అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించబడింది. జనియన్‌వాలా బాగ్‌లో నిరంతరాయంగా మండే అఖంఢ జ్వాలలు, భవన గోడలపై బులెట్ తగిలిన గుర్తులు, తోటలోని బావిలో దూకి మరణించిన జ్ఞాపకాలు నేడు చూపరులలో దేశభక్తిని, కర్తవ్యాన్ని జాగృతం చేస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు. జలియన్‌వాలా బాగ్ మారణకాండకు వందేళ్లు దాటింది. అయినా దేశభక్తి కలిగిన భారతీయులు ఈ దుర్ఘటనను ఇంకా మరిచి పోలేదు. బ్రిటీష్ పాలకుల దుశ్చర్యలో ప్రాణాలర్పించిన అమాయక ప్రజల త్యాగాల పునాదుల మీద స్వర్ణ భారతాన్ని నిర్మించడానికి అందరం కంకణబద్ధులమవుదాం, అఖండ భారతదేశాన్ని అగ్రరాజ్యంగా రూపొందించుకుందాం.
జై హింద్, భారత్ మాతాకీ జై.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి కరీంనగర్ – 9949700037