– జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి, అజాత శత్రువు జైపాల్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. జైపాల్‌రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా అనేక విషయాలపై మాట్లాడారు. ఆయన పాత్ర లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేది కాదని, చర్చ లేకుండానే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించేలా ప్రత్యేక పాత్ర పోషించారని వివరించారు. జైపాల్‌రెడ్డి చొరవతోనే తెలంగాణ ఏర్పాటు చేశామని సోనియా గాంధీ కూడా ఒక సందర్భంలో తనతో చెప్పారన్నారు.ఐడియాలజికల్ పాలిటిక్స్ పోయి ఇవాళ స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయని, దేశ రాజకీయాల్లో సైద్ధాంతిక రాజకీయాలు పోయి మేనేజ్‌మెంట్ పాలిటిక్స్ వచ్చాయని, కార్యకర్తలు పోయి వలంటీర్ వ్యవస్థ వస్తోందని, కానీ కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో జైపాల్‌రెడ్డి పనిచేశారని, కేంద్రంలో పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారన్నారు. సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రసార భారతి చట్టాన్ని దేశానికి అందించారని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఉండాలని ఆయన విశ్వసించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై ఆయన ఎక్కువ ఆలోచించేవారని తెలిపారు. రాజకీయాలలో ధన ప్రవాహం తగ్గించాలని ప్రయత్నించారని సీఎం చెప్పారు. కాంగ్రెస్‌ను వీడినా, తిరిగి కాంగ్రెస్‌లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్ప పదవుల కోసం ఆయన పార్టీలు మారలేదన్నారు. యూనివర్సిటీలలో విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్షాలు సహేతుకమైన సూచన చేస్తే తీసుకోవడానికి తమకు ఇబ్బంది లేదని అన్నారు. అందుకే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు శాసనసభ నుంచి ఎవరినీ సస్పెండ్ చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.




