Take a fresh look at your lifestyle.

జగిత్యాల మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌రాజీనామా

  • బహుజనులు పదవులకు పనికిరారా..? – మీరే గెలిచారు దొర..అంటూ తీవ్ర ఆరోపణలు
  • అవిశ్వాసం ఎమ్మెల్యే ఆడిన డ్రామా – కన్నీరు మున్నీరుగా విలపించిన చైర్‌పర్సన్‌ ‌శ్రావణి
జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 25: జగిత్యాల మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌పదవికి భోగ శ్రావణి గురువారం రాజీనామా చేశారు. బహుజనులమైన మేము పదవులకు పనికిరామా దొర అంటూ.. కన్నీటి పర్యంతమైన శ్రావణి జగిత్యాల్‌ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అడుగడుగునా తనను ఎమ్మెల్యే అవమానిస్తున్నాడని.. బీసీలు రాజకీయాలకు పనికిరారా ..అని కన్నీటి పర్యంతమవుతూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముందు ప్రకటించారు. ప్రశ్నిస్తున్నామన్న కోపంతో ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి.. జాగ్రత్త… అంటూ బెదిరించి డబ్బులు డిమాండ్‌ ‌చేశారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చుకునే పరిస్థితుల్లో తాము లేమని చెప్పినా వినిపించుకోకుండా దొరతనం అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుదలను ఓర్వలేక కక్ష గట్టారని దుయ్యబట్టారు.
అభివృద్ధి పనులకు అడ్డొస్తూ, తనకు చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకుం జారీ చేశారని మండి పడ్డారు. తాను నరక ప్రాయంగా మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌పదవిలో కొనసాగుతున్నానని, నడిరోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎన్ని అవమానాలకు గురిచేసినా అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగానని, అయినప్పటికీ ఎమ్మెల్యే పదవితో పోలిస్తే మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌పదవి చాలా చిన్నదంటూ సంజయ్‌ ఎద్దేవా చేసేవారంటూ ఆమె వివరించారు. తన స్నేహితుడి పెట్రోల్‌ ‌బంకు కోసం జంక్షన్‌ ‌చిన్నగా చేసి కట్టారని. డివైడర్‌ ఎత్తు తగ్గించారని. ఈ విషయంపై తాను మాట్లాడితే నీకు సంబంధం లేని విషయం అంటూ వారి ముందే ఇష్టారీతిన ఎమ్మెల్యే అవమానించారని ఆరోపించారు.
మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నా ప్రజాసేవలో నిమగ్నం అయిన నన్ను నిత్యం వేధింపులకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారని, చివరకు వార్డుల సందర్శన కార్యక్రమం చేపట్టినా తప్పేనంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మునిసిపాలిటీలో ఒక్క పని కూడా తనను ప్రారంభించేందుకు అవకాశం కల్పించడం లేదని, తనకు చెప్పకుండా ట్రాలీలు ఎందుకు కొన్నావంటూ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. ఆర్టీఓ కంటే తక్కువ ప్రొటోకాల్‌ ఉం‌డే మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పదవిలో ఉండి జిల్లాస్థాయి అధికారులను ఎలా కలుస్తున్నావంటూ తిట్టేవారన్నారు. తనకు అనుకూలంగా ఉన్న కొద్ది మంది కౌన్సిలర్లను కూడా టార్గెట్‌ ‌చేసి టార్చర్‌ ‌చూపించారని, బీసీ మహిళననే కక్ష గట్టారని, సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికిరారా? అని ప్రశ్నించారు. మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌తాను పేరుకేనని పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనన్నారు. పార్టీకోసమే పని చేస్తామని పలుమార్లు వేడుకున్నా వినకుండా కక్ష గట్టారని, తమ కుటుంబాన్ని అణచివేసి ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచారని, తప్పు ఎక్కడ జరిగింది చెప్తే సర్దుకుంటామని చెప్పినా కావాలనే తనను కార్నర్‌ ‌చేశారని మండిపడ్డారు.
image.png
అవిశ్వాసం ఎమ్మెల్యే ఆడిన డ్రామా..
ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం సరి కాదని, అవిశ్వాసం కూడా సంజయ్‌ ఆడిన డ్రామానేనని బోగ శ్రావణి ఆరోపించారు. సస్పెండ్‌ ‌చేస్తానని కమిషనరు బెదిరించడంతోనే ఆయన లీవ్‌ ‌పై వెళ్లిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కనీసం తనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని, ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదవాలని శాసించారని, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితను కలవకూడదని ఒత్తిళ్లకు గురి చేశారని ఆరోపించారు. సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత పేర్లు ప్రస్తావించకూడదని హుకుం జారీ చేశారన్నారు. చివరకు కవిత ఇంటికి వచ్చినా వేధింపులకు గురి చేశాడన్నారు.
నా డ్రెస్సింగ్‌ను వదలలేదు..
తను వేసుకునే దుస్తుల గురించి కూడా పలుమార్లు ప్రస్తావించిన ఎమ్మెల్యే.. తాను తిరుగుతున్న కారు కన్నా ఎక్కువ ధర కారులో ఎందుకు తిరుగుతున్నా వంటూ కూడా వేధించారని శ్రావణి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సహకరించి సీఎం కేసీఆర్‌, ‌మంత్రులు కేటీఆర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీలు కవిత, ఎల్‌.‌రమణలకు ధన్యవాదాలు చెప్పిన శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Leave a Reply