- ఫుల్ జోష్‌లో జగ్గారెడ్డి వర్గీయులు
- కాంగ్రెస్‌కు 230 వోట్లు ఉంటే 238 వోట్లు సాధించిన నిర్మల జగ్గారెడ్డి
- ఇరకాటంలో పిసిసి చీఫ్ రేవంత్?
హైదరాబాద్, డిసెంబర్ 14(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) : శపథం ఫలించింది. పంతం నెగ్గింది. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన పంతాన్ని నిలబెట్టుకున్నాడు. తద్వారా ఆయన, ఆయన వర్గీయులు, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు విసిరిన ఛాలెంజ్‌ను సవాల్‌గా తీసుకుని పంతాన్ని నెగ్గించుకవోడంతో తనకు మెదక్ జిల్లాలో తిరుగులేదని నిరూపించుకోవడమే కాకుండా, తన సత్తా ఏమిటో కూడా తనకు సవాల్ విసిరిన అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు చూపించాడు. జగ్గారెడ్డి అంటేనే వివాదాస్పద వ్యాఖ్యలకు, సంచలనాలకు కేరాఫ్.
రాజకీయాలను ఎప్పుడూ తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. అటువంటి జగ్గారెడ్డి తనకు కలిసి వచ్చిన అవకాశాన్ని తనకు మలుచుకుని ‘తగ్గేదేలే’అని చెప్పకనే చెప్పాడు. ఇదిలా జగ్గారెడ్డి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వేళ…అధికార టిఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరి మరీ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇదే రాజకీయాల్లో హాట్ టాపిక్. వివరాల్లోకి వెళ్లితే…ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన సతీమణి, సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మలను పోటీ చేయించారు. నిర్మల ఎన్నికల బరిలో ఉండటంతో అధికార పార్టీ ఏకగ్రీవం ఆశలు అడియాసలు అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1026వోట్లు ఉంటే…వీటిలో అధికార టిఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా 777మంది వోటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 230మాత్రమే వోట్లు ఉన్నాయి.దీంతో వార్ వన్‌సైడ్ అని అనుకున్న అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి వంటి నేతలు..మెజారిటీలేని చోట క్యాండెట్‌ను పెట్టావ్…ఘోరాపరాజయం తప్పదనీ ఎగతాళి చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరపరాజయం తప్పదనీ…అనవసరంగా జగ్గారెడ్డి ఆయన సతీమణి నిర్మలను పోటీ చేయించాడంటూ మాటల దాడిని మొదలుపెట్టింది. అధికార టిఆర్ఎస్ పార్టీ నేతల నుంచి వచ్చిన సవాల్‌పై జగ్గారెడ్డి కూడా తనదైనస్టైల్లో స్పందించారు. కాంగ్రెస్‌కు ఉన్న 230వోట్లలో ఒక్కటంటే ఒక వోటు తగ్గినా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు పదవీకి రాజీనామా చేస్తాననీ సవాల్ విసిరాడు. ఓ వైపు సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతుండగానే…సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మునిసిపల్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సమీర్ దంపతులు పోలింగ్‌కు కొన్ని గంటల ముందు మంత్రి హరీష్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ వోటర్ల సంఖ్య 230నుంచి 229కి తగ్గింది. మరోవైపు టిఆర్ఎస్ పార్టీ తన వోటర్లందరినీ క్యాంపుకు తరలించింది.
దీంతో వార్ వన్‌సైడ్ అని భావించిన టిఆర్ఎస్ పార్టీ జగ్గారెడ్డిపై మరింత వొత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేశారు. జగ్గారెడ్డి కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. ఎవరు ఉన్నా, లేకున్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సతీమణి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మలకు 230వోట్లకు ఒక్క వోటు తక్కువ వచ్చినా తన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు పదవీకి రాజీనామా చేస్తాననీ పదే పదే చెబుతూ వచ్చాడు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి 400వరకు వోట్లు రావచ్చనీ అంచనా వేస్తూ..కాంగ్రెస్‌కు ఉండే 230వోట్లలో ఒక్క వోటు తక్కువ వచ్చినా కూడా నేనే నైతిక బాధ్యత వహిస్తాననీ చెప్పాడు. ఆయన చెబుతూ వచ్చినట్లుగానే మంగళవారం జరిగిన మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మలకు 238వోట్లు వచ్చాయి.
దీంతో జగ్గారెడ్డి తన ఛాలెంజ్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా, మెదక్ జిల్లాపై తన పట్టును, బలాన్ని మరింత సుస్థిరం చేసుకున్నట్లయింది. జగ్గారెడ్డి ఓవైపు తన పంతాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మరోవైపు టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిని మరోసారి ఇబ్బందుల్లోపడేసినట్లేననీ పార్టీలో చర్చ నడుస్తుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిపిసిసి చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదు. ఎవరికైనా ఇష్టముంటే పోటీ చేయొచ్చనే సంకేతాలు ఇచ్చి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. అయితే, టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అంటే ఒకింత ఊగిపోయే జగ్గారెడ్డి మాత్రం మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థి నిర్మలను పోటీకి దింపారు. అధికార టిఆర్ఎస్ పార్టీకి ధీటుగా మెదక్ జిల్లాలో ప్రచారాన్ని సైతం నిర్వహించాడు. ఎన్నికల వేళ… అధికార పార్టీ ఇచ్చే డబ్బులకంటే తాను ఎక్కువగా ఇస్తాననీ, విహారయాత్రలకు తీసుకెళ్తామంటూ లీకులు ఇవ్వడం, తన అనుచరులతో ఫోన్లు చేయించడంతో అప్రమత్తమైన అధికార టిఆర్ఎస్ పార్టీ తన వోటర్లందరినీ ఇతర ప్రాంతాలకు క్యాంపులకు తరలించింది.
దీంతోనే తాను మొదటి విజయం సాధించాననీ చెబుతూ వచ్చిన జగ్గారెడ్డి..కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఉన్న వోట్ల కంటే 8ఎక్కువ వోట్లను సాధించగలిగాడు. కౌంటింగ్ అనంతరం పరోక్షంగా సంధిస్తున్న ప్రశ్నలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సూటిగా టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డికి తగులుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ఎందుకు నిలబెట్టలేదో టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిని అడగాలంటున్నాడు. ఇదీ మరోసారి కాంగ్రెస్ పార్టీలో కాకరేపే అవకాశం లేకపోలేదనీ తెలుస్తుంది. మొత్తంగా తన పంతాన్ని నెగ్గించుకున్న జగ్గారెడ్డి…పరోక్షంగా సంధిస్తున్న ప్రశ్నలు ఎంతలేదన్నా టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డికి ఎంతో కొంత కొత్త చిక్కులు తెచ్చి పెడుతాయనీ, రాజకీయంగా కూడా ఇబ్బందులు కలిగించవచ్చనీ కాంగ్రెస్ నేతలంటున్నారు.