Take a fresh look at your lifestyle.

కలిసి పని చేస్తామంటూనే… రేవంత్‌కు పక్కలో బల్లెంలా మారిన జగ్గారెడ్డి

  • ఆయన ‘లెక్క’లు వేరు?
  • జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో వాడివేడి చర్చ
  • హుజూరాబాద్‌పై పోస్టుమార్టం…అందరి వేళ్లు రేవంత్‌పైనే…
  • పెద్ద పెద్ద స్టార్లు పోతేనే వోట్లు రాలేదు
  • మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి

టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డికి పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటుకు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి తలనొప్పిగా మారారు. వివాదస్పద వ్యాఖ్యలు, సంచనాలకు కేరాఫ్‌ అయిన జగ్గారెడ్డి వరుసగా టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డికి ఒకింత నష్టం వాటిల్లేలా చేస్తుండగా…పార్టీలో మాత్రం చర్చనీయాంశంగా మారాయి. క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నాయి. కలిసి పని చేస్తామంటూనే….రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి కంట్లో నలుసులా…పక్కలో బల్లెంలా తయారయ్యాడనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్‌పైన జగ్గారెడ్డి అవకాశం వొచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రేవంత్‌ ‌రెడ్డితో నేరుగా అందరినీ కలుపుకొని పోవాలంటూ తేల్చి చెప్పారు. టైం దొరికితే చాలు రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి తనదైనశైలిలో మాటల తూటాలు పేలుస్తున్నారు.

తాజాగా..హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై కూడా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లుగానే ఉన్నాయి. అభ్యర్థి ఎంపికను రేవంత్‌, ‌భట్టి నిర్ణయం తీసుకున్నారనీ, సరైన సమయంలో అభ్యర్థిని ప్రకటించలేదనీ, స్థానికేతరుడిని అభ్యర్థిగా పెట్టేది కాదనీ, సభలు, సమావేశాలు నిర్వహించకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి వెంకట్‌ను బలిపశువు చేశారంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్థికి వొచ్చిన వోట్లపై పార్టీలో సమావేశం ఏర్పాటు చేసుకుని తను మాట్లాడి తీరుతాననీ మీడియా ముఖంగానే చెప్పారు. ఇదిలా ఉంటే, రేవంత్‌రెడ్డి టిపిసిసిగా నియామకం అయినప్పటి నుంచి జగ్గారెడ్డి కొంత అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నాడు. అంటీముట్టనట్లుగానే ఉంటున్నాడు. రేవంత్‌రెడ్డి-జగ్గారెడ్డి కలయిక కేవలం ఒక రోజు సంబురంగానే మిగిలిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డి కలిసినట్టే కలిసి..ఆ తర్వాత కనబడకుండా పోయాడు. విభేదాలు మరిచి పని చేస్తారనీ ఆశపడ్డ పార్టీ శ్రేణుల ఆశలు అడియాసలుగా మిగిలే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి చేస్తున్న వరుస వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చాలా హాట్‌గా చర్చ నడుస్తోంది. రేవంత్‌ ‌ప్రమాణ స్వీకారానికి ముందుగా జగ్గారెడ్డితో రేవంత్‌ ‌కలవడం స్వీటు తినిపించుకోవడంతో వారిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ ‌తగ్గిందని అందరూ అనుకున్నారు. కానీ, వారిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ అలాగే కంటిన్యూ అవుతుందనీ చెప్పడానికి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలకు జగ్గారెడ్డి డుమ్మా కొట్టడమే కాకుండా ఆయన పార్లమెంటు ఇంఛార్జిగా ఉన్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ప్రచారానికి కూడా దూరంగా ఉన్నాడు.

రేవంత్‌రెడ్డి-జగ్గారెడ్డి మధ్యన నెలకొన్నవి విభేదాలో, అభిప్రాయబేధాలో, మనస్పర్ధలో, ఇగోనో, పార్టీలో రేవంత్‌రెడ్డికంటే తను సీనియర్‌ననో, తనకు రావల్సిన టిపిసిసి చీఫ్‌ను రేవంత్‌రెడ్డి తన్నుకుపోయారనో, ఇంకేదైనా బలమైన కారణమో మొత్తానికి తెలియదు కానీ, రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డికి ఉన్న గ్యాప్‌ ఏమాత్రం సమసిపోలేదనీ సభలకు జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. పార్టీలో విభేదాలు లేకుండా రానున్న ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి-జగ్గారెడ్డి కలిసికట్టుగా పనిచేసి, కాంగ్రెస్‌ ‌జెండాను ఎగురవేస్తారనీ పార్టీ శ్రేణులు సంబురపడ్డాయి. అయితే, వీరి సంబురాలు ఎన్నో రోజులు లేవు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రవెళ్లిలో చేపట్టిన దళిత, గిరిజన దండోరా సభకు జగ్గారెడ్డి హాజరు కాలేదు. దీనికి జ్వరాన్ని కారణంగా చెప్పుకొచ్చారు. తనకు వారం రోజులుగా జ్వరం ఉందనీ, జ్వరం కారణంగానే కోర్టు పేషీకి కూడా హాజరు కాలేదనీ, దీంతో తనపై వారెంట్‌ ‌కూడా జారీ అయిందనీ గుర్తు చేస్తూ..దీంతో ఇంద్రవెళ్లిలో జరిగే సభకు హాజరు కావడం లేదనీ సభకు కొన్ని గంటలు ముందుగా ఓ స్టేట్‌మెంటు ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్లు కూడా ఆ స్టేట్‌మెంటులో జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే, వాస్తవానికి ఇంద్రవెళ్లి సభకు ముందు, తర్వాత కూడా జగ్గారెడ్డి సంగారెడ్డి, సదాశివపేటలో నిర్వహించిన జాతరలో చాలా హుషారుగా పాల్గొన్నాడు. ఆడిపాడాడు. సభకు మాత్రం జ్వరాన్ని సాకుగా చెప్పి డుమ్మాకొట్టాడు. ఆ తర్వాత నిర్వహించిన రావిలాల సభకు వచ్చినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నా…పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు హోదాలో ఉన్న జగ్గారెడ్డి మాత్రం స్టేజీపైనా ఎక్కడా కూడా ఎవరికీ కనిపించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో కనిపించలేదు.

కానీ, కేసీఆర్‌ ‌సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నిర్వహించిన హాజరైన జగ్గారెడ్డి తనను స్టేజీపైన మాట్లాడించలేదనీ ఆ తర్వాత చెప్పుకొచ్చాడు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారం నడుచుకుంటాననీ పదే పదే చెబుతూనే…పార్టీలో సింగిల్‌ ‌హీరో కుదరదు.. ఒక్కడి ఇమేజ్‌ ‌కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. ఇది పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్‌ ‌కంపెనీనా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో చర్చించకుండా ముందే పోగ్రాంలు ఫిక్స్ ‌చేయడమేంటని రేవంత్‌ ‌రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో అందరూ ఒకటే.. ఒక్కరే స్టార్‌ అనుకుంటే కుదరదని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. సంగారెడ్డికి పీసీసీ వస్తే .. తనకు సమాచారం ఇవ్వరా.. ఈ మాత్రం ప్రోటోకాల్‌ ‌కూడా తెల్వదా అంటూ మండిపడ్డారు. రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ చీఫ్‌ ‌కాకముందు.. తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల వేళ..అందునా సీఎల్పీ సమావేశం సమయంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కాంగ్రెస్‌లో ఎంతగా హాట్‌ ‌టాపిక్‌ అయ్యాయో అందరికీ తెలుసు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం టాగూరు రంగంలోకి దిగడంతో జగ్గారెడ్డి ‘సారీ’ చెప్పడంతో పాటు ఇక మీదట పార్టీకి చెందిన విషయాలను మీడియా ముందు బహిరంగంగా మాట్లాడననీ చెప్పిన కొద్ది రోజుల వ్యవధిలోనే హుజూరాబాద్‌లో వెంకట్‌ను బలిపశువు చేశారంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి మరోసారి పార్టీలో పెను దుమారంలేపారు. అయితే, సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీ క్యాడర్‌ ‌నాడిని తెలిసిన జగ్గారెడ్డి.. సక్సెస్‌ అవుతున్న రేవంత్‌రెడ్డి సభలకు డుమ్మా కొడుతున్నారంటే దానికి బలమైన రాజకీయ కారణం వేరే ఉంటుందనీ, తెర వెనకాల ఏదో జరుగుతుందనీ, ఆయన ‘లెక్క’లు ఆయనకు ఉంటాయనీ అంటున్నవాళ్లూ లేకపోలేదు. అయితే, పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు హోదాలో ఉన్న జగ్గారెడ్డి మాత్రం టిపిసిసి చీప్‌గా ఉన్న రేవంత్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని వరుసగా చేస్తున్న వ్యాఖ్యలను మాత్రం అంత ఆషామాషీగా తీసుకోలేం. ఈ పరిణామాలపై రేవంత్‌రెడ్డి వర్గీయులు ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. అయితే, రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు కదా!

హుజూరాబాద్‌పై కాంగ్రెస్‌ ‌పోస్టుమార్టం… అందరి వేళ్లు రేవంత్‌పైనే…
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ‌పొలిటికల్‌ ఎఫైర్స్ ‌కమిటీ(పిఏసి) సమావేశం బుధవారం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణిక్కం టాగూర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర వోటమిపై సమీక్ష చేశారు. ఈ సమావేశానికి రేవంత్‌ ‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, హనుమంతరావు, దామోదర రాజనర్సింహా, గీతరెడ్డి, సంపత్‌ ‌కుమార్‌, ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌, ‌సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు, హుజూరాబాద్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ‌తదితర నేతలు హాజరైనప్పటికీ..హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంగా కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం హాజరుకాలేదు. జానారెడ్డి ఇలా వొచ్చి అలా వెళ్లిపోయాడు. దామోదర రాజనర్సింహా కూడా మధ్యలోనే వెళ్లిపోయాడు. ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి పూర్తి బాధ్యత తనదేననీ ఇప్పటికే టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటికీ…బుధవారం జరిగిన పిఏసి మీటింగ్‌లో మాత్రం సీనియర్‌ ‌నేతలందరూ రేతవంత్‌రెడ్డి వల్ల హుజూరాబాద్‌లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వొచ్చిందనీ రేవంత్‌రెడ్డిని ప్రశ్నలు, మాటలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తుంది. ఆంధప్రదేశ్‌లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిందనుకుంటే బద్వేల్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి 6వేల పైచిలుకు వోట్లు వొచ్చాయనీ, 2018లో 61వేల పైచిలుకు వోట్లు వచ్చిన హుజూరాబాద్‌లో మాత్రం ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో 3వేల పైచిలుకు వోట్లు మాత్రం రావడం ఏంటనీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. తప్పంత కూడా టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డిపైన వేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్‌ ‌పార్టీ నేతల్లో పెద్ద చిచ్చునే పెట్టినట్లు సమాచారం.

ఉన్నది ఉన్నట్టు చెబితే నిష్ఠూరం అవుతున్నా….: జగ్గారెడ్డి
గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ ‌పొలిటికల్‌ అఫైర్స్ ‌కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఆలస్యంగా వొచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి మళ్లీ సంచలన, వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ…ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నా బలహీనత. వాస్తవాలు మాట్లాడటం చెప్పడం నాకు అలవాటు. వాస్తవాలు చెబితే నిందలు వేస్తున్నారనీ, ఉన్నది ఉన్నట్లు చెప్తే నిష్ఠూరం అవుతున్నానీ, ఇక మీదట పార్టీకి సంబంధించిన లోటుపాట్లను మాట్లాడి నిష్ఠూరం కాదల్చుకోలేదన్నారు. పార్టీ బాగు కోసం మాట్లాడి శత్రువు కావడం నాకు ఇష్టం లేదన్నారు. ఒక్క ఉప ఎన్నికతోనే ఏం కొంపలు మునుగుతాయని పార్టీలో ఓ వర్గం అంటుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి పెద్ద పెద్ద స్టార్స్, ‌సూపర్‌ ‌స్టార్స్ ‌పోతేనే వోట్లు రాలేదనీ, నేను ప్రచారానికి వెళ్లితే వోట్లు ఎవరేస్తారన్నారనీ ఎదురు ప్రశ్న వేశారు. ఎవరు ఎటు పోతే నాకేం•న్నారు. పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణికం టాగూర్‌కు చెప్పాల్సిన విషయాలు చెబుతాననీ అన్నారు. పార్టీ సమావేశంలో అన్ని విషయాలు చర్చిస్తాననీ అన్నారు. ఇక మీదట నేను గాంధీభవన్‌, ‌పార్టీ విషయాలు మాట్లాడను. గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లలో కూడా మాట్లాడననీ అనుకుంటున్నాననీ అన్నారు. తన నియోజకవర్గమైన సంగారెడ్డికి మాత్రమే పరిమితం అవుతాననీ, తన పని నేను చేసుకుంటూ పోతాననీ అన్నారు. తన సంగారెడ్డి సీటు వరకు తనకు ఎవరితో పని లేదని, తన సీటు వరకు తాను గెలుచుకుంటాననీ అన్నారు. 2023లో జరిగే ఎన్నికల వరకు పార్టీ వ్యవహారాలను మాట్లాడననీ అన్నారు. షోకాజ్‌ ‌నోటీస్‌ ఇస్తారా? ఇవ్వరా?అనేది తనకు తెలియదన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్‌, ‌బోసురాజు, శ్రీనివాసన్‌కు ఏం తెలుసుననీ జగ్గారెడ్డి అన్నారు. ఏదైనా ఉంటే మహేష్‌కుమార్‌ను అడుగుతాననీ జగ్గారెడ్డి అన్నారు.

ప్లీజ్‌ ….‌నా మాటలను వదిలేయండి…మెత్తబడ్డ జగ్గారెడ్డి?
హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాలపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్‌ ‌చేసిన విషయం విధితమే. పొలిటికల్‌ ఎఫైర్స్ ‌కమిటీ(పిఏసి) సమావేశంలో నిలదీస్తానని మండిపడ్డారు కూడా. అయితే పొలిటికల్‌ ఎఫైర్స్ ‌సమావేశంలో జగ్గారెడ్డి మెత్తబడ్డారనీ సమాచారం. తాను మాట్లాడిన మాటలను వదిలేయాలని, సమావేశంలో అందరికీ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారనీ తెలుస్తుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తన బలహీనత అని, ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడనని జగ్గారెడ్డి హామీ ఇచ్చారనీ, ఇకపై నియోజకవర్గంలో ఎలా గెలవాలో చూసుకుంటానని, ఎలాంటి వివాదాలకు వెళ్లనని జగ్గారెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఇప్పటికైతే కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం ముగిసినట్లుగానే అందరూ భావిస్తున్నారు.

Leave a Reply