Take a fresh look at your lifestyle.

‘ఈ ‌నిందలు భరించలేను’

  • కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి గుడ్‌ ‌బై..!
  • త్వరలో పదవులన్నింటికీ రాజీనామా
  • సోనియా, రాహుల్‌ ‌గాంధీకి లేఖ
  • పని చేయని బుజ్జగింపులు
  • టిఅర్‌ఎస్‌ ‌పార్టీలో చేరనున్న జగ్గారెడ్డి?
  • అన్నీ కలిస్తే 21న సిఎం కేసీఆర్‌ ‌సమక్షంలో చేరిక

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 19(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సరి కొత్త పరిణామాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ ‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి రాజీనామాపై జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ‌పార్టీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. త్వరలో టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు శనివారం కాంగ్రెస్‌ అ‌గ్ర నాయకులు సోనియా, రాహుల్‌ ‌గాంధీకి రాసిన సుదీర్ఘ లేఖలో వెల్లడించారు. తప్పులు సరిదిద్దుకోమని చెబితే కోవర్ట్ అని ముద్ర వేశారని, తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌ ‌గాంధీకి లేఖ రాశానని, లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్‌లో లేనని పేర్కొన్నారు. తనకు పార్టీలో జరిగిన అవమానాలను వివరిస్తూ లేఖ రాసినట్లు తెలిపారు. సడెన్‌గా వొచ్చి లాబీయింగ్‌ ‌చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని, గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గపోరు ఉన్నా..అది ఎంతో హుందాగా ఉండేదని, ఇప్పుడు అలా లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎప్పుడో వెళ్లేవాడినని స్పష్టం చేశారు. ఒకప్పుడు రాష్ట్రాన్ని విడదీయవద్దని చెప్పానని, పార్టీ నష్టపోతుందని చెప్పానని, ఇప్పుడు అదే జరిగిందన్నారు. ఎవరూ పోటీ చేయడానికి ముందుకు రాకపోతే తన భార్యను ఎమ్మెల్సీగా నిలబెట్టానని, హుజూరాబాద్‌లో పార్టీని నాశనం చేసినవాళ్లు కోవర్టులు అవుతారు కానీ తాను కాదని రేవంత్‌ను ఉద్దేశించి జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.

జగ్గారెడ్డి లేఖ సారాంశం ..
‘తెలంగాణ రాష్ట్రం ఇప్పించిన కాంగ్రెస్‌ ‌నాయకులు ఎంతో మంది పార్టీ నుండి బయటికి పోయారు. కాంగ్రెస్‌లో సడన్‌గా వొచ్చి లాబీయింగ్‌ ‌చేస్తే ఎవరైనా పీసీసీ కావచ్చు..అంతకంటే తప్పు నేను చేయలేదు చెయ్యను కూడా. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌ ‌కోవర్టులని ప్రచారం జరుగుతున్నా..దీనిని ఖండించే వ్యవస్థ కాంగ్రెస్‌ ‌పార్టీలో లేకపోవడం దురదృష్టకరం. ఎవరైనా వేరే రాజకీయ పార్టీ వారు జగ్గారెడ్డిని పిలిస్తే తమ్ముడు పోయాడని ఒక చరిత్ర ఉంటుందని నేను వేరే పార్టీలోకి పోలేదు. ఇంత ఆర్థిక కష్టాల్లో కూడా కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్టు అనే ఒక ప్రచారాన్ని ఇందులో ఉన్న కొందరు నాయకులు కొన్ని యూట్యూబ్‌ ‌ఛానల్స్ ‌ద్వారా ప్రచారం చేయిస్తున్నారు’ అని లేఖలో జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ పుట్టుక, నా తల్లి పెంపకం పదిమందికి మేలు జరిగేలా ఉపయోగపడాలి. మంచి పేరు తెచ్చుకోవాలి అన్నది నా తల్లి కోరిక.

నేను నా వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా అమ్మను..అమ్ముకోను. అందుకే ఆర్థిక ఇబ్బందులు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. నేను నా సొంత కష్టం శక్తి మీదనే నా వయసు 15 సంవత్సరాల ఉన్నప్పటి నుంచి..ఇప్పటివరకు ప్రయాణం చేస్తున్నాను. నా రాజకీయ జీవితాన్ని ముందుకు నడపడానికి ఎవరినైనా అప్పు అడుగుతాను..కానీ డొనేషన్‌ అడగను. హుందాగా బ్రతుకుదాం అనుకున్నాను.. కాంగ్రెస్‌లో నాకు ఇలాంటి కోవర్టు అనే పేరు ప్రచారం జరగడం బాధాకరం. ఇలాంటి ప్రచారం చేస్తున్న మూర్ఖులు ఆలోచన చేయాలి. నేను వేరే పార్టీ లోకి పోవాలి అనుకుంటే నేరుగా పోతాను కదా..ఇక్కడ ఉండి కోవర్టు అని ప్రచారం తెచ్చుకునే కర్మ నాకెందుకు’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు చేసేటప్పుడు కూడా చెప్పినా..రాజకీయంగా కాంగ్రెస్‌ ‌పార్టీకి నష్టం జరుగుతుందని..అప్పుడు నన్ను తెలంగాణ ద్రోహి అన్నారు. కానీ ఇప్పుడు అయ్యో జగ్గారెడ్డి చెప్పింది నిజమే కదా.. రాజకీయంగా మేము దెబ్బ తిన్నాము అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు బాధపడి లాభం లేదు కదా..? అలాగే ఇప్పుడు పార్టీలో కొన్ని లోటుపాట్లు చెప్తూ సమన్వయం చేసుకోండి..గ్రౌండ్‌ ‌లోకి వెళ్లండి అని చెబితే కోవర్టు అనే పనికిమాలిన ఆరోపణలు నాపై వేస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఇక్కడ ఉండి పనికిమాలిన నిందలతో ఆవేదన చెందడం కంటే నా మనస్సాక్షికి కట్టుబడి స్వతంత్రంగా నా రాజకీయ జీవితం గడపటం మేలు అని నిర్ణయించుకోవడం జరిగింది’ అని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో 12 స్థానాలకు జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో నా భార్య నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేయించి ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా కాంగ్రెస్‌ ‌వోట్ల కంటే ఒక వోటు తగ్గినా నా పార్టీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పా..పార్టీ పరువు, మర్యాద నిలబెట్టిన నాకు ఇచ్చే గౌరవం టీఆర్‌ఎస్‌ ‌కోవొర్టు అనే పేరా’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

jagga

కాంగ్రెస్‌ ‌పార్టీలో హేమాహేమీ నాయకులు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో వారి సొంత జిల్లాలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదు. అలాంటి సమయంలో పార్టీ పరువు కోసం ధైర్యం చేసి పోటీ చేయిస్తే నన్ను కోవర్టు అని కొన్ని యూట్యూబ్‌ ‌ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తుంటే పార్టీలోని ఏ ఒక్కరూ దీనిని ఖండించారా..హుజురాబాద్‌ ఉప ఎన్నికలలో పార్టీ పరువు నాశనం చేసినవారు కోవర్టులా లేక ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నేను కోవర్టునా.. ’ అని ప్రశ్నించారు. ‘అలాగే 2017లో రాహుల్‌ ‌గాంధీ సభ పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోతే నేను కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహణ చేశాను. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి ఒక కొత్త జోష్‌ ‌వొచ్చింది. ఇలాంటి నాకు మీరు ఇచ్చే బిరుదు టీఆర్‌ఎస్‌ ‌కోవర్టు… దీనిపై పార్టీలో సీనియర్‌ ‌నాయకులు పార్టీ పెద్దలు ఎవరు కూడా స్పందించరా…ఈ బిరుదు కోసం నేను ఇందులో పని చేయాలా ఎవరైనా రాంగ్‌రూట్‌లో పోతుంటే నేను మాట్లాడొద్దా.. ఒకప్పుడు కాంగ్రెస్‌లో రాజకీయ వర్గ పోరు ఉండేది..అది కొంత హుందాగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదు. దీనిపై సమయం వొచ్చినప్పుడు ఇంకా చాలా క్లుప్తంగా చెప్తాను’ అని లేఖలో వివరించారు. రాజకీయాల్లో ఉందాతనం ఎలా ఉంటుంది అనేదానికి ఒక ఒక ఉదాహరణ చెప్తున్నా..అది చరిత్రలో ఉంది మహాభారతంలో పాండవులకు కౌరవులకు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరఫున యుద్ధానికి భీష్ముడు నాయకత్వం వహించాడు..అలాగే కౌరవుల తరఫున అర్జునుడు నాయకత్వం వహించాడు. అయితే ఈ యుద్ధం ప్రారంభం కంటే ముందు అర్జునుడు భీష్మునికి బాణాల ద్వారా పాదాలకు నమస్కారం తెలియజేసినాడు. దాని అర్థం అర్జునుడు భీష్ముడికి కోవర్టు కాదు కదా..శత్రువైనా సరే నమస్కరించడం ఒక సంస్కారం. తర్వాత యుద్ధం యుద్ధమే. కొన్ని యూట్యూబ్‌ ‌ఛానల్స్ ఇలాంటి చరిత్ర చదివి తెలుసుకోవాలని సూచిస్తున్నాను’ అని జగ్గారెడ్డి తెలిపారు.

ఇక భీష్ముడు పాండవుల పక్షపాతి అనేది చరిత్ర అయినా భీష్ముడు కౌరవుల పక్షాన యుద్ధం చేయడం జరిగింది. ఇది చరిత్ర. కానీ భీష్ముడు చనిపోయేటప్పుడు కర్ణుడికి భీష్ముడు మీద కోపం ఉన్నప్పటికీ కర్ణుడు భీష్ముడి దగ్గరికి వొచ్చి కన్నీటి బొట్లు కార్చి తన బాధని వ్యక్తపరిచాడు. దాని అర్థం పాండవులకు లొంగిపోయినట్లు కాదు కదా, ఇలాంటి చరిత్రలను కూడా తెలుసుకుని గ్రహించి రాజకీయాల్లో ఎట్లా పావులు కదపాలో నేర్చుకోండి. రాహుల్‌ ‌గాంధీని అస్సాం సీఎం హేమంత విశ్వ శర్మ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఒక్క రోజు వరకు స్పందించని వారు కోవర్టులా? లేదా స్పందించిన నేను కోవర్ట్ ‌నా? అని జగ్గారెడ్డి నిలదీశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నాపై వొస్తున్న ఆరోపణలు నన్ను ఎంతగానో కలచి వేస్తున్నాయి. ఇలాంటి నిందలు భరించడం కంటే స్వేచ్ఛగా పేద ప్రజలకు సేవ చేస్తూ రాజకీయం చేయాలనుకుంటున్నా. ఇలా ఈ స్వతంత్ర రాజకీయ జీవితంలో నేను ఏది మాట్లాడినా, ఎవరిని ప్రశ్నించినా ఎవరికి రాజకీయం నష్టం, బాధ కలిగే అవకాశం ఉండదు. ఇప్పుడున్న నా పరిస్థితి చూస్తుంటే అలాంటి ప్రయాణం చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ త్వరలో ప్రకటించడం జరుగుతుంది. జీవితంలో కాంగ్రెస్‌ ‌పార్టీని విడిచి పోవాలని లేకుండే, కానీ పరిస్థితులు నన్ను అటువైపుగా ఆలోచన చేసే విధంగా చేస్తున్నాయి. దీంతో నేను నాకున్న పదవులకు రాజీనామా చేసి స్వతంత్రంగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను. దయచేసి ఇక నన్ను ఎవరూ కలవండి…నా పార్టీకి, వ్యక్తిగత రాజకీయ జీవితానికి కష్టమవుతుందని ఫీలింగ్‌లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇక నుండి రాజకీయంగా మీరందరూ మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని జగ్గారెడ్డి చెప్పారు.

పనిచేయని బుజ్జగింపులు….టిఆర్‌ఎస్‌ ‌వైపు మొగ్గు?
తాను కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎందుకు దూరం అవుతున్నదీ వివరిస్తూ..జగ్గారెడ్డి తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపారు. కాంగ్రెస్‌ను వీడాక తాను రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనీ, తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబంపైన మొదటి నుంచీ తన విధేయతను ప్రకటిస్తూ వొస్తున్న జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో రాష్ట్ర నాయకులు ఎన్ని బుజ్జగింపులు చేసినా ఫలితం లేకుండా పోయింది. అన్నీ కలిస్తే ఈ నెల 21 ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో జగ్గారెడ్డి టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరనున్నారని సమాచారం.

Leave a Reply