Take a fresh look at your lifestyle.

జగ్గారెడ్డి సెంటర్‌ ఆఫ్‌ అ‌ట్రాక్షన్‌ వరుస కార్యక్రమాలతో హడల్‌..

‌మంజీర డ్యాం  ప్రోగ్రాంతో కాంగ్రెస్‌కు మైలేజీ, జగ్గారెడ్డికి పేరు… కాంగ్రెస్‌లో ఒకే ఒక్కడు

తూటాల్లాంటి మాటలు, చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే విలక్షణమైన రాజకీయ నాయకుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి. సంగారెడ్డి శాసనసభ్యుడుగా, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడుగా అందరికీ సుపరిచుతడైన జగ్గారెడ్డి తరుచూ సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద ప్రకటనలు చేస్తూ…రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. ప్రత్యర్ధులైనా, సొంత పార్టీ నేతలైనా ఎవరినైనా సరే తన మాటల తూటాలతో చెడుగుడు ఆడుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఒక మాటలో చెప్పాలంటే.. తెలంగాణ రాజకీయ నేతల్లో యమ దూకుడు లీడర్‌ ‌జగ్గారెడ్డి. ఇష్యూ ఏదైనా ఇంతెత్తున లేచే జగ్గారెడ్డి తన దూకుడు రాజకీయాలతో కాంగ్రెస్‌ ‌పార్టీలో సెంటర్‌ ఆఫ్‌ అ‌ట్రాక్షన్‌గా నిలిచాడు. అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీని ఇబ్బందులకు గురి చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతుండటంతో అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్‌ ‌పార్టీకి బూస్టు ఇచ్చే కార్యక్రమాలు తీసుకుంటుండటమే. జగ్గారెడ్డి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ..బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు, కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో నూతనొత్తేజం నింపేందుకు తెగించి ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటాలు చేస్తుండటంతో కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి ఒకే ఒక్కడు అని చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా వరుస కార్యక్రమాలతో అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న మాటల దాడులతో హడలెత్తిస్తున్నారు. ఎన్నికలకు ముందు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి తరలింపుపై ఉద్యమం చేసిన జగ్గారెడ్డి తాజాగా..మంజీరా డ్యాం ఎండిపోవడంపై దూకుడును ప్రదర్శిస్తున్నాడు. మంజీర డ్యాం ఎండిపోవడానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన మంత్రి తన్నీరు హరీష్‌రావే ప్రధాన కారకుడంటూ పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌నేతల బృందంతో చేపట్టిన కార్యక్రమంతో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో కీలకంగా మారాడు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన మంజీర డ్యాం సందర్శనకు వెళ్లకుండా పోలీసులు మధ్యలోనే బ్రేక్‌లు వేసినప్పటికీ…ఒక రోజంతా జగ్గారెడ్డికి అనుకూలంగా ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలో ప్రచారం వచ్చింది.

సోషల్‌ ‌మీడియాలో మారుమోగింది. తద్వారా జగ్గారెడ్డికి వ్యక్తిగతంగా పేరు రావడమే కాకుండా కాంగ్రెస్‌ ‌పార్టీకి కూడా ఎంతో కొంత మైలేజీ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంజీర డ్యాం కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా జగ్గారెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సంగారెడ్డిలో తాగు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఇక సాగు నీటి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, ‌సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయి. సూరీడు నిప్పులు చెరుగుతుండగా…చెరువులు, కుంటలన్నీ కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని మంజీర డ్యాం మాత్రం ఎండిపోయింది. దీనిని అదనుగా చేసుకుని జగ్గారెడ్డి…మంజీర డ్యాంను ఎండబెట్టి…గజ్వేల్‌, ‌సిద్ధిపేట ప్రాంతాలకు కేసీఆర్‌, ‌హరీష్‌రావు నీళ్లను తీసుకెళ్లారంటూ…ఎండిపోయిన మంజీరను నింపాలంటూ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేలా కార్యక్రమాలు చేపట్టారు. దీంట్లో జగ్గారెడ్డి కొంత వరకు సక్సెస్‌ అయ్యారనీ చెప్పాలి. ముత్తంగి వద్ద అడ్డుకుని భానూర్‌ ‌పోలీస్‌స్టేషన్‌కు తరలించినప్పటికీ..మీడియాలో మాత్రం రోజంతా బాగానే ఫోకస్‌ అయ్యారు. మీడియా ఇచ్చిన ప్రచారంతో యావత్‌ ‌ప్రపంచానికి మంజీర డ్యాం ఎండిందని తెలిసింది. ఈ రకంగా జగ్గారెడ్డి అనుకున్న లక్ష్యాన్ని చేరినట్లేననీ కాంగ్రెస్‌ ‌నేతలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించడమే కాకుండా. వార్నింగ్‌ ‌కూడా ఇచ్చాడు. అంతటితో ఆగకుండా సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావును మరోసారి టార్గెట్‌ ‌చేశాడు. తె•రమరుగు అయిందనుకున్న పాస్‌పోర్ట్ ‌కేసు గురించి మాట్లాడటం.. సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావుపైనా పాస్‌పోర్ట్ ‌కేసులున్నాయనీ, వారిని కూడా అరెస్టు చేయాలంటూ డిమాండు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిఎం కేసీఆర్‌ ‌గురించి తాను వ్యతిరేకంగా మాట్లాడననీ ఇది వరకే ప్రకటించిన జగ్గారెడ్డి…ఏమైందో ఏమో కానీ, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు, మంత్రులు, సిఎం కేసీఆర్‌పై ఒంటికాలుపై లేస్తున్నాడు. అధికార టిఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతున్నాడు. తలసాని పహిల్వాన్‌ ‌గిరి చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదనీ, హైదరాబాద్‌లో తిరగనీయకపోతే దాచుకుంటానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తలసాని నోరు అదుపులో పెట్టుకో.. ఎవరి ఊరికి వాడే పటేల్‌ అం‌టూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. తలసానిపై జగ్గారెడ్డికి కోపం రావడానికి కారణం…పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, మూసివేసిందనుకున్న పాస్‌పోర్ట్ ‌కేసును మళ్లీ జగ్గారెడ్డి తవ్వే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతున్నది. అయితే, జగ్గారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పెద్దలు చాలా సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, జగ్గారెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎండిన మంజీర డ్యాం గురించి యావత్‌ ‌ప్రజానీకానికి తెలిసేలా చేశారనీ చెప్పొచ్చు. ఏదయితే అది అయింది.. భవిష్యత్‌లోనూ మరింత దూకుడుగానే ముందుకెళ్లే ఆలోచనలో ఆ దిశగా ముందస్తు పక్కా ప్రణాళికల్ని రూపొందించుకునే పనిలో జగ్గారెడ్డి ఉన్నట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. చూడాలి మరి!

Leave a Reply