నాన్న జ్ఞాపకాలను మదినిండా నింపుకున్నానని భావోద్వేగ ట్వీట్
పులివెందుల,సెప్టెంబర్ 2 : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. పూలమాలు సమర్పించి దివంగత నేతకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కటుఉంబ సభ్యులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. ఇదిలావుంటే తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లో సభ్యునిగా నేటికి జన హృదయాల్లో కొలువై ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
గురువారం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలో అలానే నిలిచి ఉన్నాయన్నారు. ’నేను వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది‘ అని సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో పేర్కొన్నారు.