రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. కొరోనా వ్యాప్తితో ఆలయాల నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. అందరికీ వెంకన్నను చేరువ చేయడమే దీని వెనకున్న ఉద్దేశమని ఆయన చెప్పారు. టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని తాము పునరుద్ధరిస్తున్నామని, పేద కుటుంబాలకు చెందిన జంటలకు తాళి, వివాహ దుస్తులు అందజేసి పెళ్లిళ్లు జరిపిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. విజయవాడ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన గుడికో గోమాత కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. గాయత్రీ సొసైటీ బహూకరించిన కపిల గోవును ఆలయానికి అందజేరు.గుడికో గోమాత కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ టీటీడీ చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు.
గోమాతలను దానం ఇచ్చేందుకు భక్తులు ముందుకొస్తున్నారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలు, తల్లిదండ్రులను పూజించినట్టేనని ఆయన తెలిపారు. గోమాత విశిష్టతను తెలియచేసేందుకు గుడికో గోమాత కార్యక్రమం చేపట్టామని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో ’గుడికో గో మాత’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఆలయ నిర్వాహకులు ముందుకొస్తే ఆవును,దూడను టీటీడీ అందచేస్తుందన్నారు. టీటీడీ ఖర్చులతోనే ఆలయాలకు గోవులను చేరుస్తామని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిలిపివేసిందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఆర్థిక స్థోమత లేని పేద జంటలకు తాళిబొట్టు, బట్టలు అందచేసి వివాహాలు జరిపిస్తామని చెప్పారు. అందరికీ వెంకన్నను చేరువ చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో 500 దేవాలయలను నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారని తెలిపారు. త్వరలోనే ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. కరోనా కారణంగా ఆలయాల నిర్మాణం ఆలస్యమయిందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.