Take a fresh look at your lifestyle.

జగన్‌ది తెలంగాణ వ్యతిరేక ధోరణి

  • రాయలసీమ లిఫ్ట్ ‌పనులు ఆపాలి
  • జీవో ఉపసంహరించుకుంటే జగన్‌తో చర్చలకు సిద్ధం మంత్రి జగదీష్‌ ‌రెడ్డి

‘‘‌రాయలసీమ లిఫ్ట్ ‌పథకాన్ని మేము మొదట్నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాం. రోజూ మూడు టిఎంసిల నీళ్లను తరలించే ఈ ప్రాజెక్టుతో ఐదు జిల్లాలు నష్టపోతాయని మా ఫిర్యాదుల్లో పేర్కొన్నాం. గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌ ‌వెళ్లి స్టే కూడా తెచ్చాము. ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడితే దాన్ని కూడా ట్రిబ్యునల్‌కు నివేదించాం’ అని రాష్ట్ర మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ….కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ ప్రాజెక్టుపై దఫదఫాలుగా సీఎం కెసిఆర్‌ ‌లేఖలు రాశారు. కేంద్ర జలశక్తి మంత్రికి ఘాటైన లేఖ కూడా రాశాం. తెలంగాణను ఎండబెట్టడం మొదట్నుంచి ఆంధ్రా పాలకులకు అలవాటే. తెలంగాణకు ఎత్తి పోతల పథకాలే శరణ్యమని తెలిసినా సమైక్య పాలకులు ఉద్దేశ్య పూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేశారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాజెక్టులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి..అన్నారు. తెలంగాణ దోపిడీకి చంద్రబాబు ఒక్క అడుగు ముందుకేస్తే వైఎస్‌ ‌వంద అడుగులు వేశారు. కొందరు కెసిఆర్‌ ‌చిత్తశుద్ధిపై పిల్ల కాకుల్లాగా మాట్లాడుతున్నారు. వైఎస్‌ ‌జలదోపిడీకి వంత పాడిన వారే ఈ రోజు కెసిఆర్‌ను విమర్శిస్తున్నారు.

తెలంగాణ రాకుండా చేయడానికి వైఎస్‌ ‌చేయని ప్రయత్నమంటూ లేదు. ఆనాడు కాంగ్రెస్‌లో ఉన్న తెలంగాణ నేతలు ఎవ్వరూ వైఎస్‌ ‌జల దోపిడీని, తెలంగాణ వ్యతిరేకతను అడ్డుకోలేక పోయారు. తెలంగాణ కోసం కెసిఆర్‌ ‌శాఖ లేని మంత్రిగా కూడా కొనసాగారు. కెసిఆర్‌ ‌కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఏపీ అక్రమ ప్రాజెక్టులను వైఎస్‌ ఎదుటే గట్టిగా వ్యతిరేకించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాల నుంచి టీఆర్‌ఎస్‌ ‌బయటకు రావడానికి తెలంగాణకు జరుగుతున్న సాగు నీటి అన్యాయమే ప్రధాన కారణం. అపుడు వైఎస్‌కు మద్దతుగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచిన వారే ఇపుడు కెసిఆర్‌ ‌మీద ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ సమాజానికి అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వ వైఖరికి వంతపాడుతున్నాయి. ఆనాడు ఏపీకి అక్రమంగా నీళ్ల తరలింపునకు హారతులు పట్టిన వారు ఈ రోజు విమర్శిస్తారా ? వైఎస్‌ ‌నీళ్ల దొంగ జగన్‌ అం‌తకు మించిన గజ దొంగ అనడానికి ప్రతి పక్షాలకు నోళ్లు ఎందుకు రావడం లేదు ? వైఎస్‌ ఇపుడు లేకున్నా కాంగ్రెస్‌ ‌నేతలు ఏపీ తీరుపై ఎందుకు మాట్లాడం లేదు ? ఇంకా బానిస బతుకులు మానుకోరా కాంగ్రెస్‌ ‌నేతలు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి.

- Advertisement -

కాంగ్రెస్‌, ‌బీజేపీలు ద్రోహం చేసినా టీఆర్‌ఎస్‌ ‌తెలంగాణ నీటి వాటా కోసం పోరాడుతుంది. ఒక్క చుక్కను కూడా అన్యాయంగా ఏపీకి తరలించడాన్ని ఒప్పుకోము. టీఆర్‌ఎస్‌ ‌పుట్టకుంటే తెలంగాణ పరిస్థితి ఏమయ్యేది ? కెసిఆర్‌ ‌కట్టిన ప్రాజెక్టుల వల్ల ఉపయోగం లేదని కాంగ్రెస్‌ ‌నేతలు బుద్ది లేకుండా మాట్లాడుతున్నారు. కోటి ఎకరాలు ఎలా సాగులోకి వొచ్చాయో ప్రజలకు తెలుసు. ధాన్యం రికార్డు ఉత్పత్తి మాటలతో సాధ్యమా ? పాలమూరుకు వలసలు వాపస్‌ ‌సంగతి గమనించడం లేదా ? ప్రతిపక్షాలకు ఇంకా జ్ఞానోదయం కావడం లేదు. కాంగ్రెస్‌ ‌హయాంలో సాగర్‌ ‌కింద పదేళ్లలో మూడు పంటలు కూడా పండలేదు. టీఆర్‌ఎస్‌ ‌పాలనలో సాగర్‌ ‌కింద ఎనిమిది పంటలు పండాయి. వైఎస్‌ ‌కట్టెతో తెలంగాణ ప్రజలను కొట్టిన కాంగ్రెస్‌ ‌నేతల బుద్ది ఇంకా పోవడం లేదు, బీజేపీ వాళ్లకు తెలంగాణ సోయి లేదు. ఎవరు కలిసి వొచ్చినా..రాకున్నా మేము వెయ్యింతల బలంతో ఏపీ జల దోపిడీని అడ్డుకుంటాం. మా నైతిక స్థైర్యాన్ని ఎవ్వరూ దెబ్బ తీయలేరు. షర్మిల తెస్తానంటున్న రాజన్న రాజ్యం అంటే తన తండ్రికి మించిన దోపిడీని కొనసాగిస్తామనడమే.

జగన్‌కు మంచి పాలన అందించే ఉద్దేశ్యం, ఏపీ ప్రజలకు నీళ్లిచ్చే యోచన లేనట్టుంది. కెసిఆర్‌ ‌చేసిన సూచనలు పాటించి ఉంటే ఏ వివాదాలు లేకుండా కృష్ణా జలాలు రెండు రాష్ట్రాలు వాడుకునే వీలుండేది. వైఎస్‌ ‌తరహాలోనే జగన్‌కు తెలంగాణ వ్యతిరేక ధోరణి ఉంది. రాయల సీమ లిఫ్ట్ ‌పనులు ఆపి, జీవో పసంహరించుకుంటే జగన్‌తో చర్చలకు మేము సిద్ధం. జల వివాదం అంశాన్ని ట్రిబ్యునల్‌కే కాదు ప్రజల్లోకి తీసుకెళతాం. కేంద్రం మీద కూడా ఒత్తిడి పెంచుతాం. కేంద్రం ఈ వివాదంలో ప్రేక్షక పాత్ర వహించకూడదు. మళ్ళీ ట్రిబ్యునల్‌కు వాస్తవాలు తెలియజేస్తాం. మేము మౌనంగా ఉన్నామని కొందరు బుద్ధి హీనంగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడే వాళ్లలో కెసిఆర్‌కు మించిన వారు ఎవరున్నారు..అని మంత్రి జగదీష్‌ ‌రెడ్డి ప్రశ్నించారు.

Leave a Reply