Take a fresh look at your lifestyle.

మందుబాబులకు జగన్‌ ‌సర్కార్‌ ‌మరో భారీ షాక్‌

  • 25‌శాతం పెంపునకు అదనంగా మరో 50శాతం ధరల వడ్డింపు
  • అయినా కొనుగోళ్లకు వెనకాడని మద్యం ప్రియులు
  • తాజా ఉత్తర్వులతో ఆలస్యంగా తెరుచుకున్న వైన్‌ ‌షాపులు

అమరావతి,మే 5: మందుబాబులకు ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికే 25 శాతం మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. తాజాగా మరో 50 శాతం పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్‌ ‌శాఖ నుంచి మంగళవారం నాడు ఉత్వర్వులు వెలువడ్డాయి. సోమవారం 25శాతం పెంగా తాజాగా పెంచిన ధరలతో మొత్తం 75 శాతం పెంపుతో మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చారు. సోమవారం తొలిరోజు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో మద్యం షాపులను మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంబించాయి. మరోవైపు ఈ నెలాఖరులోగా 15శాతం మద్యం దుకాణాలను మూసేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న షాపుల సంఖ్య 3,468. మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకే ఇలా ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం జే ట్యాక్స్ అం‌టూ దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మంగళవారం ఉదయం మద్యం షాపులు తెరుచుకోలేదు. మద్యం అమ్మకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈ మేరకు ఎక్సైజ్‌ ‌శాఖ ఉదయమే ఓ ప్రకటన విడుదల చేసింది. అమ్మకాలు మళ్లీ ఎప్పట్నుంచి ప్రారంభించాలనే దానిపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలని కమిషనర్‌ ‌తెలిపారు. మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించడం, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం నిర్ణయించింది. రద్దీని తగ్గించేందుకు టోకెన్‌ ‌పద్ధతిని అమలు చేసే అంశంపై పరిశీలించారు. వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో 50 నుంచి 70 శాతం వరకు మద్యం ధరలు పెంచారని పలువురు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిశీలించి మార్గదర్శకాలను ఉదయం 11గంటలకు జారీ చేసింది. రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో భారీగా ధరలు పెంచిన ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌నిబంధనలు, కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ సోమవారం నుంచి విక్రయాలకు అనుమతించ డంతో 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. చాలా రోజుల తరువాత దుకాణాలు తెరవడంతో తొలిరోజు మద్యం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.

కొన్నిచోట్ల మధ్యాహ్నం 2 గంటలకు షాపులు తెరిచారు.మద్యం షాపుల సీల్‌ ‌తెరిచేందుకు కలెక్టర్‌ అనుమతి ఇవ్వాల్సి ఉండటం, కంటైన్‌మెంట్‌ ‌క్లస్టర్ల జాబితాలు అందకపోవడంతో కొంత ఆలస్యమైంది. రాష్ట్రంలో మొత్తం 3,468 మద్యం షాపులుండగా కంటైన్మెంట్‌ ‌క్లస్టర్లను మినహాయించి మిగిలిన చోట్ల 2,345 దుకాణాలు తెరిచారు. మద్యం షాపులను రెడ్‌జోన్‌లో కూడా తెరవవచ్చని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో వీటిని తెరవలేదు. విజయవాడతోపాటు ప్రకాశం జిల్లాలో ఒక్క మద్యం షాపు కూడా తెరవలేదు. ప్రకాశం జిల్లాలోని మద్యం గోడౌన్లు కంటైన్‌మెంట్‌ ‌క్లస్టర్లలో ఉండటంతో ఎక్సైజ్‌ ‌శాఖ షాపులను తెరవలేదు. విజయవాడలో కంటైన్మెంట్‌ ‌క్లస్టర్ల జాబితా అందకపోవడం వల్ల తెరవలేదు. గత 45 రోజుల నుంచి రాష్ట్రంలో మద్యం దొరకపోవడంతో సోమవారం మద్యం ప్రియులు ఒక్కసారిగా షాపుల వద్దకు చేరుకున్నారు. అలాగే మంగళవారం ఉదయం కూడా మద్యం దుకాణాల ముందు భారీ ఎత్తున క్యూ కట్టారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూలలో నిలుచుని తమ వంతు కోసం నిరీక్షించారు. మద్యం ధరలు పెంచినా కొన్ని దుకాణాల్లో మధ్యాహ్నానికల్లా సరుకు ఖాళీ అయింది.

మద్యం షాపుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, వలంటీర్లు విధులు నిర్వహించారు. ఎక్కువ చోట్ల భౌతిక దూరం పాటించినప్పటికీ కొన్నిచోట్ల మొదటిరోజు కావడం మూలాన మాత్రం ఉల్లంఘనలు జరిగాయి. కొందరు తమిళనాడు వాసులు ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని మద్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడంతో షాపుల్ని మూసివేసి వారిని వెనక్కి పంపించారు. నెల్లూరు జిల్లా జీవీ పాలెం, రామాపురం, చిత్తూరు జిల్లా పాలసము ద్రంలో మద్యం దుకాణాల వద్దకు పొరుగు రాష్ట్రం నుంచి ప్రజలు రావడంతో అమ్మకాలు నిలిపివేశారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో కూడా మద్యం దుకాణాల వద్దకు భద్రాచలం వాసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో షాపులను మూసివేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సపంలోని మాచవరం, పిల్లుట్ల ప్రాంతాల్లో మద్యం అమ్మకాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రాంతం వారు మరో ప్రాంతానికి రావడంతో ఘర్షణ నెలకొంది.

Leave a Reply