Take a fresh look at your lifestyle.

పాల రహిత జీవితాన్ని ఊహించడం కష్టం

“ఉదయం లేవగానే  చాయ్‌, ‌కాఫీ, పాలు తాగేవారు అత్యధికంగా ఉన్నారు. రోజుకు చాలా సార్లు టీ తాగేవారు చాలా మంది ఉంటారు. టీ లేనిది మనసు ఊరుకోదు. చేసే పనిలో ఉత్సాహాన్ని అందిస్తుంది. ఉప ఉత్పత్తుల రూపంలోనూ పాలు మనిషికి ఎన్నో రకాలుగా అవసరం అవుతుంటాయి. భోజనంలో పెరుగుగా, దాహం తీర్చే మజ్జిగగా, వెన్న, నెయ్యి, పన్నీరు, పాలకోవా, ఇలా అనేకానేక రకాలుగా పాల అవసరం మనిషికి ఉంటుంది. పాలు లేని ప్రపంచం ఊహించ జాలం.”

నేడు…..ప్రపంచ పాల దినోత్సవం

ప్రపంచ పాల దినోత్సవం ప్రతి ఏట జూన్‌ 1‌న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించ బడుతుంది. పాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ పాల దినోత్సవం ఏర్పాటు చేయబడింది.ఆరోగ్యకర జీవితం గడపడానికి పాలు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఆరోగ్యం బాగుంటేనే ఆనందంగా ఉండగలం. ప్రతి కుటుంబానికి పాలు నిత్యావసరం లాంటివి. పుట్టినప్పుడు మొట్టమొదటిగా గొంతు తడిపేవి తల్లిపాలే. ఎదుగుతున్న కొద్దీ ఆవుపాలు, గేదెపాలు తాగుతాం. శిశువులు ఇతర రకాల ఆహారాన్ని జీర్ణించుకోక ముందే ఇది పోషకాహార ప్రాధమిక వనరుగా సహకరిస్తుంది. పిల్లల ఎదుగుదలకే కాదు, రోగులు త్వరగా కోలుకోవడానికీ, వయోవృద్ధులు సత్తువ కోల్పోకుండా ఉండటానికీ పాలను మించిన పోషక పానీయమేదీ లేదు. శారీరక శక్తికి అవసరమైన అత్యంత కీలకమైన పోషక పదార్థాల్లో చాలా వరకు పాలలోనే ఉంటాయి.

ఉదయం లేవగానే చాయ్‌, ‌కాఫీ, పాలు తాగేవారు అత్యధికంగా ఉన్నారు. రోజుకు చాలా సార్లు టీ తాగేవారు చాలా మంది ఉంటారు. టీ లేనిది మనసు ఊరుకోదు. చేసే పనిలో ఉత్సాహాన్ని అందిస్తుంది. ఉప ఉత్పత్తుల రూపంలోనూ పాలు మనిషికి ఎన్నో రకాలుగా అవసరం అవుతుంటాయి. భోజనంలో పెరుగుగా, దాహం తీర్చే మజ్జిగగా, వెన్న, నెయ్యి, పన్నీరు, పాలకోవా, ఇలా అనేకానేక రకాలుగా పాల అవసరం మనిషికి ఉంటుంది. పాలు లేని ప్రపంచం ఊహించ జాలం. 100 శాతం పోషక విలువలు, విటమిన్‌ ‌బి12 అధికంగా కలిగిన ఆహారమైన పాలు, యువతలో, విద్యార్థుల్లో, మానసిక, శారీక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయి. రానురాను వాతావరణ సమతుల్య లోపం వలన వర్షాలు సరిగ్గా పడక, మేత దొరకక పశుపోషణ కష్టమైంది. దీంతో పాల ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ పాలను లాభసాటి వ్యాపార వస్తువుగా మలచుకొని అనేక డైరీలు నడుస్తున్నాయి. అయితే డైరీల్లో పాలు నిల్వవుండేందుకు అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. వీటి వల్ల పాలల్లో పోషకాల సంఖ్య తగ్గిపోయే అవకాశాలు కలుగుతున్నాయి. పాల ఉత్పత్తులో ప్రపంచంలో మనదేశం అగ్రభాగాన ఉన్నా, వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం. ఈ ప్రమాదాన్ని గుర్తించి 2001 జూన్‌ 1 ‌నుండి ఫుడ్‌, అ‌గ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ‌వారు పాలను సంపూర్ణ ఆహారంగా మార్చారు.

ప్రాచీన కాలం నుండి చాలా మందికి పాలు ప్రధానమైన ఆహారం. పాలు లేదా క్షీరము శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. ఇది మెగ్నీషియం, కాల్షియం, రిబోఫ్లేవిన్‌, ‌విటమిన్‌ ఎ, ‌ఫోలేట్స్, ‌విటమిన్‌ ‌డి, ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఆరోగ్యకరమైన పోషకాల యొక్క అద్భుతమైన మూలం. అవసరమైన అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలతో సహా మంచి నాణ్యమైన ప్రోటీన్‌లను కలిగి ఉన్నందున శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అన్ని వయసులవారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్రెలు. హిందువులు పవిత్రంగా పూజించే ఆవు పాలను అభిషేకాలకు, పూజలకు వినియోగిస్తారు.

పాలలో ఆరోగ్యకరమైన ఎముకలు ఏర్పడటానికి అవసరమైన కాల్షియం శోషణకు శరీరానికి అవసరమైన విటమిన్‌ ‌డి అధికంగా ఉంటుంది. పాలు శరీరాన్ని స్వస్థ పరచడంలో, క్షీణించిన విటమిన్‌ ‌డి కంటెంట్‌ ‌పునరుద్ధరణలో సహాయ పడుతుంది. విటమిన్‌ ‌డి బోలు ఎముకల వ్యాధి వంటి అనేక వ్యాధుల వల్ల సంభవించే హానిని నివారిస్తుంది.

రాత్రి పడుకునే ముందు వెచ్చని పాలు తాగడం మరుసటి రోజును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. నిద్రవేళకు ముందు ఒక కప్పు పాలు పోయడం ఒత్తిడిని తగ్గించడానికి ఉపకరిస్తుంది. పాలలో లభించే లాక్టియం అనే ప్రోటీన్‌ ‌రక్తపోటును తగ్గించడం, కండరాలను సడలించడం, కార్టిసాల్‌ ‌స్థాయిలను తగ్గించడం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనను నియంత్రించడంలో లాక్టియం మెదడు గ్రాహకాలను ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట కొద్దిగా పసుపును కలుపుతూ తయారుచేసిన వెచ్చని పాలను సిప్‌ ‌చేయడం వల్ల జలుబు మరియు దగ్గు లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. రాత్రిపూట చల్లని పాలు తాగడం వల్ల ఆమ్లత్వం నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం, అపానవాయువు వంటి ఇతర సాధారణ కడుపు సమస్యలను ఉంచడంలో సహాయ పడుతుంది.

తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ ‌స్థాయిని తగ్గించవచ్చు. ఆవు పాలు వ్యాయమం చేసేవారికి ఎంతో అవసరం. కార్పోహైడ్రేట్స్, ‌ప్రోటీన్స్ ‌తగిన నిష్పత్తిలో ఉండే పరిపూర్ణమైన ఆహారం. వీటిని తాగడం వల్ల కండరాల పునరుద్దరణ ఉత్తేజ పడుతుంది.

ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రిసెర్చ్ ‌వారి సిఫారసు మేరకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 283 గ్రాముల పాలు తీసుకోవాలి. పాలు మానవ శరీరానికి పోషకాల ఖని. ఆవు, గేదె, మేక పాలతో వేరు వేరు ప్రమాణాల్లో పోషక పదార్థాలు మనం పొందవచ్చు. ప్రతి వంద గ్రాముల పాలల్లో ఆవుపాలు 86.6 శాతం, గేదె పాలు 84.2 శాతం వరకు నీరు కలిగి వుంటుంది. ఆవుపాలల్లో కొవ్వు 4.6 శాతం, మాంసకృతులు 3.4 శాతం,పిండి పదార్థాలు 4.9 శాతం, ఖనిజ లవణాలు 07. శాతం వుంటాయి. గేదె పాలల్లో 6.6 శాతం కొవ్వు, 3.9 శాతం మాంసకృతులు, 5.2 శాతం పిండి పదార్థాలు, 0.8 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి.

భారతదేశ ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త, శ్వేత విప్లవ పితామహుడుగా భావించబడే డాక్టర్‌ ‌వర్ఘీస్‌ ‌కురియన్‌ ‌భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన ‘‘బిలియన్‌ ‌లీటర్‌ ఐడియా’’ ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయాభివృద్ధి కార్యక్రమంగా నిలిచింది. ఈ కార్యాచరణ భారత దేశంలో అత్యల్ప పాల ఉత్పత్తి నుండి అధిక పాల ఉత్పత్తి గల దేశంగా ప్రపంచంలో నిలిపింది..
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply