Take a fresh look at your lifestyle.

అన్నీ అవాస్తవాలు…అసత్యాలే

  • తొమ్మిది సంవత్సరాల విధ్వంసం
  • అందంగా చూపించే ప్రయత్నం…
  • అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగంపై టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 03 : రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన విధ్యంసాన్ని కప్పిపుచ్చుతూ గవర్నర్‌ ‌శుక్రవారం రాష్ట్ర ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశారని టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గవర్నర్‌ ‌తన ప్రసంగంలో గ్రామాల, పట్టణాల అభివృద్ధి అద్భుతమని, మంచి పంచాయతీలకు జాతీయ స్థాయులో ఇచ్చే అవార్డులు మనకే వొస్తున్నాయని తెలిపారని, కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే అభివృద్ధి చేసిన సర్పంచులు అప్పుల పాలయ్యారని, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాలకు పాల్పడుతున్నారని, కేంద్రం ఇచ్చిన పైసలు కూడా రాష్ట్రం దారి మళ్లించిందని కోదండరామ్‌ ‌మండిపడ్డారు. నాణ్యమైన రెసిడెన్సియల్‌ ‌విద్య అందిస్తున్నామని పేర్కొన్నారని కానీ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలే లేవని, నాణ్యమైన భోజన వసతి లేక ప్రతిరోజు పిల్లలు అనారోగ్యంతో హాస్పిటళ్ల పాలవుతన్నారని అన్నారు.

ఇక ఉద్యోగాల భర్తీ అంశాన్ని ప్రస్తావిస్తూ 221774 ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాలీల  భర్తీ చేశామని చెప్పారని కానీ 2022 నాటికి భర్తీ చేసినవి కేవలం 79393 ఉద్యోగాలేనని అన్నారు. ఇక మూడు సంవత్సరాలలో కాళేశ్వరం పూర్తి చేశామని గొప్పగా గవర్నర్‌ ‌చేత చెప్పించారని కానీ వాస్తవానికి బారేజీలు మాత్రమే పూర్తయ్యాయని, రిజర్వాయర్లు, కాలువలు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. సంవత్సరానికి 165 టీఎంసీలు తోడవలసి ఉండగా నాలుగు సంవత్సరాలలో తోడింది వంద టీఎంసీలేనని కోదండరామ్‌ ‌తెలిపారు. గవర్నర్‌ ‌ప్రసంగం ప్రాజెక్టు లోపాలను దాచి పెట్టిందని, ప్రతీ సంవత్సరం జరిగే మునక గురించి కానీ, గత జూలై నెలలో వరదలు వొచ్చినప్పుడు గేట్లు ఎత్తి పై బారేజి నీళ్ళు కిందికి వదలగానే వెనుకకు తన్ని విపరీతమైన ముంపును కలిగించిన విషయాన్ని కానీ,  కింద ఉన్న మేడిగడ్డ నుండి వొదిలిన నీళ్ళు పోలవరం డ్యామ్‌ ‌నుండి వెనుకకు తన్నుకొచ్చిన నీళ్ళతో కలిసి భద్రాచలంలో విధ్వంసాన్ని సృష్టించిన విషయాన్ని కానీ ప్రస్తావన లేదని అన్నారు.

ప్రాజెక్టు పూర్తయితే ప్రతి సంవత్సరం 25000 కోట్ల రూపాయల నిర్వహణ ఖర్చు చేయవలసి వొస్తుందని అన్నారు. ఫ్లోరైడ్‌ ‌సమస్య నుండి విముక్తి కలిగినట్టేనని తెలిపారని, కానీ తాగునీరు దొరుకుతున్నందువల్ల ఫ్లోరిన్‌ ‌పోదని, భూగర్భ జలాల ద్వారా ఫ్లోరిన్‌ ‌తిండి గింజలలో చేరి ఫ్లోరైడ్‌ ‌వ్యాధిని కలిగిస్తున్నదని, పొలాలకు సాగు నీరు అందేవరకు ఆ సమస్య పోదని ఆయన అన్నారు. ఇప్పట్లో సాగు నీరు అందే అవకాశం లేదని, పెండింగ్‌ ‌ప్రాజెక్టుల పనులు కేంద్ర గెజిట్‌ ‌వలన నిలిచి పోయాయని, అందువలన 28 లక్షల ఎకరాలకు సాగు నీటి అవకాశమే లేదని అన్నారు. ఇక ప్రైవేట్‌ ‌సెక్టార్లో కంపెనీలు  బాగా పెరిగాయని, బోలెడన్ని ఉద్యోగాలు వొచ్చినట్లు పేర్కొన్నారని, అయితే వాస్తవంగా ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని కంపెనీలో లెక్క చెప్పలేరా అని ప్రశ్నించారు. వొచ్చిన ఉద్యోగాలలో స్థానికులకు ఎన్ని వొచ్చినాయో కూడా చెప్పాలని కోదండరామ్‌ ‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

ఇక కృష్ణా నదీ జలాల్లో వాటా తేలక పోతే తెలంగాణలో కృష్ణా పైన కడుతున్న పెండింగు ప్రాజెక్టులకు కూడా నీళ్ళు రావు.. అనుమతులు దొరకవన్న విషయాన్ని కానీ ప్రస్తావించనే లేదని అన్నారు. ఈ సమస్యపై కేంద్రంతో జరుగుతున్న చర్చల పురోగతి ప్రస్తావన లేదని, ప్రభుత్వ హాస్పిటళ్లలో ఇన్‌ ‌ఫెక్షన్‌ ‌సోకి కుటుంబ నియంత్రణ, డెలివరీలలోనూ చనిపోతున్నా ఏ చర్యలు తీసుకుంటారనే విషయాన్ని కూడా ప్రస్తావించ లేదని అన్నారు. గోదావరి వరదలలో ముంపు వలన నష్ట పోయిన రైతులకు, గృహ యజమానులకు కలిగిన నష్టానికి పరిహారం సర్వే ఎప్పుడు నిర్వహిస్తారో తెలుపాలని, నష్ట పరిహారం ఇస్తారా? అని కోదండరామ్‌ ‌ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, ‌పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర  కార్యనిర్వాహక అధ్యక్షులు సర్దార్‌ ‌వినోద్‌ ‌కుమార్‌, ‌పార్టీ నేతలు శ్రీనివాస్‌ ‌రెడ్డి, హన్మంతురెడ్డి, రామచందర్‌, ‌లక్ష్మన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply