Take a fresh look at your lifestyle.

‘‘ఇట్లెందుకైతాంది’’ ?

[ads-pullquote-left][ads_color_box color_background=”#6cdef5″ color_text=”#444″]”దొరలరాజ్జెం మళ్ళచ్చినట్టే కొడ్తాంది. ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న దొరీర్కం కొట్టచ్చినట్టే కానత్తాంది.  మన ఆకాంక్షల రాజ్యంల శాసనం మీద ఇమానంగ ఓట్లేశినజనాల సంక్షేమం జూడాల్షిన ఏలికలు వాళ్ళసంక్షేమమే జూసుకుంటాండ్లని ఎవలకు సూత అనిపిత్త లేదాయేంది!? బడులు బొంద బెట్టి, సర్కార్‌ ‌సదువులను లేకుంట జేసుడంటె మన సంస్కృతి,సంప్రదాయాల ఎరుక ఇంకో తరం కాడిదాంక పోకుంట అడ్డువడుడు కాదా!?మనిషి ఉనికికే తిప్పలచ్చే కొత్త మోపయితాందని ఎరుకుండి సూత మునుపటి సత్తువ తెచ్చుకునేందుకు ముందుకు రాకుంట యెట్లనో యేమో!”[/ads_color_box][/ads-pullquote-left]

మన రాజ్యం మనం కొట్లాడి తెచ్చుకుంటిమి, కొలువులు ఏదెట్లున్న సూతమాయె సదువులు బాగుపడ్తె సాలు బతుకుల కింక ఢోక లేదని సంబురపడితిమి.కేజీ నుంచి పీజీ సదువులంటె ఇంతాంత సంబురం గాలే!ఊర్లల్ల సర్కార్‌ ‌సదువులిక తోపు పో అనుకుంటివి. బాగ సదువుకున్న పోరల్లు కలిక్టర్లు కాకపోయిన ఎట్టి బతుకులైతె తప్పుతయను కుంటివి. మన నౌకర్లు మన కచ్చుడే కాబట్టి సదువులైపోవుడే ఆలిషెం! ఇంటికో నౌకరన్న సర్కార్‌ ‌నెత్తిన పాలు వోత్తివి. కేజీ నుంచి పీజీ అని ఎగిరెగిరి పడ్తివి.గరీబోని ఆశ గల్మ దాటదన్నట్టు ఉన్నయి లేనియి లెక్కలు ముందటేషి సర్కార్‌ ‌బళ్ళకు పొతంబెట్టి ఐదేండ్లకె సగం మాయం జేషె! లచ్చల మంది గరీబోండ్ల పోరల్లకు సదువు దూరమాయె!ఊర్లర్ల బళ్ళు మూతపడేషిన సర్కార్‌ ఏ ‌కులపోళ్ళను వాళ్ళ,వాళ్ళ కులం పనులు జేసుకమ్మనె! గొర్లు,బర్లు,మేకలు ఇచ్చినంక వాటిని ఎవలు గాయబోవల్నో అన్న రంధి లేకుంట జేషె! ఊర్లె బడి పీకినంక పోరలు ఏం గాయబోవన్నో ఎరుక జేషె!ఊరన్నంక ఎంత మంది పోరల్లు జేరితేంది గని సర్కార్‌ ‌బడైతె వుండాలె గద! పోరల్లు జేరుత లేరని బళ్ళను పీకుడెక్కడి ఇచ్చంత్రం! బడి లేదు గాబట్టి మా పోరల్లను గొర్లను,బర్లను కాషేందుకు తోల్తాంటివని ఊర్లెనబట్టె!గింత దూరానికో సర్కార్‌ ‌బడి అని వుండాలె అని విద్యా హక్కు చట్టం అనో ఖానూన్‌ ‌చేషింది సర్కారే!పోరల్లు జేరుతలేరని వున్న బళ్ళు పీకేది సర్కారే ఆయె!ముందుగాల బళ్ళల్ల వున్న పంతుళ్ళను పీకి వేరేబడికి తోల్తిరి.ఎనుకపొంటి బడిని సూత మాయం జేషి పక్కూర్లే కల్పితిరి. గిట్ల ఊర్లున్న బడిని పీకుతె పక్కూరు బోయి సదువు కోవాల్నంయేంది!

Harvesting water should be used as a savingఉన్నఊర్లెనే బడికి పోయే ఆడిపిలగాండ్లకు రక్షణ లేకుంటాయె! పక్కూరికంటె తోలెటట్టున్నదా! ఇయ్యాల్రేపు కాలం!? ఆమ్దాని మస్తుగచ్చే పర్మిట రూంలున్న మందు దుకాండ్లు బెల్టు దుకాండ్లేమో వూరికి నాలుగున్నంక ఊర్లె ఒక్క బడి సూత యెందుకు లేక పాయె!సీమాంధ్రోళ్ళు ఉన్న కాడికి ఆగం జేషి పోయె నంటిరి ఆరోజులు పొయినయి.మరి గిప్పుడు మనోళ్ళు ఏలికలైనంక సూత సదువులు కుక్కలు జింపిన ఇస్తారవుడేందుల్లా .. ! సీమాంధ్రోళ్ళ కాలంల సాలుకింత బడ్జెట్ల నిధులు పెరిగేయి.సౌలత్‌ ‌లైతె మంచిగనే కానచ్చేయి.మన రాష్ట్రంల సర్కార్‌ ‌బడ్జెట్‌ ‌జూడబోతె సదువులకు యేటేటిచ్చేటి కొత్తలు పల్సబడుడు తోని బళ్ళల్ల సౌలతులన్నీ దింపుడుగల్లాలకాడి కచ్చినయి. ఆ అభియానంటిరి,ఈ అభియానంటిరి,రొండిట్టికి బొంద బెట్టి కొత్తగ ఇంకో అభియానంటిరి.సబ్‌ ‌ప్లాన్ల లెక్కలేషి పోరల్లలెక్కలేషి కిందిమీది జేషి యాడాదికో పాలిచ్చే కొత్తల తోని సుద్దముక్కలు చీపురు కట్టలు జూత రాక పాయె! రాష్ట్రమచ్చినంక యే ఊరిబళ్ళె సూత సిమింటింత కల్పింది లేదు,గోడలేషింది లేదు.ఎక్కడి కట్టుడ్లు గాడనే ఆగినయి,గుత్తేదార్లకు కొత్తలెగ్గొడితే వాళ్ళు ఎక్కడి పనులక్కన్నే ఇషిపెట్టి పాయె! ఇంగిలీషు మీడియంల సదువులు జెప్తమని బళ్ళను బతికిచ్చుకునే పనిల పంతుళ్ళుంటె వున్న బళ్ళెట్ల పీకాల్నో సర్కార్‌ ఇక్కమత్‌ ‌జేయబట్టె.

కులం మతం లెక్కలేషి తీరొక్క పేరు మీద హాస్టల్‌ ‌బడులు పెట్టె!మండలాల పొంటి ఊర్ల పొంటి ఉన్న బళ్ళన్ని పోరల్లేక ఖాళీ కాంగనె,పంతుళ్ళను,ఎనుక పొంటి బళ్ళను మూతేషె! కొత్త రాష్ట్రమైనంక వేల బళ్ళు మూతేషి లచ్చల మంది పోరల్లను సదువుకు దూరం జేషిన సర్కానేమనాలె!ఇప్పుడుమళ్ళోపాలి బళ్ళ సంగతి జూషే పని మీదున్న సర్కార్‌ ఏకంగ వేలల్ల బళ్ళు మాయం జేషే కతలు వడ్తాంది. ఖాళీగున్న పంతుల్ల నౌకర్ల ఖాళీలను వేలనుంచి వందల కాడికి తెచ్చి , గీ తీర్గ సదువులనాగం జేషి సర్కార్‌ ‌బాధ్యతల యాది మర్షి నీళ్ళిడిషిందానే జెప్పాలె! రాష్ట్రం కోసం కొట్లాడి వేల మంది సదువుకునే కాలేజి పోరల్లు జీవిడిషిన త్యాగం సాచ్చిగ బుద్ది జీవులు నోరిప్పాలె! ఊపచ్చిన దాపునుంచి సీమాంధ్రోళ్ళ పెత్తనాన్ని లెక్కలు గట్టి నిలేషిన బుద్దిజీవులందరు యేడబోయిండ్లో యేమయిండ్లో!రాషెటోళ్ళు,పాడెటోళ్ళు,యేషం కట్టినోళ్ళు మర్లవడి దెబ్బలుతిని త్యాగాలు జేషినోళ్ళు గిప్పుడు అవుపడ్తలేరాయే!బిల్కుల్‌ ‌లాపత్తయిండ్లు.బుద్దిజీవుల మెదళ్ళు మొద్దుబారినయా! అన్న అనుమానం రేవయితాంది.ఏలికలేవన్న యెటమటంకతలువడితె నిలేషి,నిలదీషే తెగువ జీవుల మడమెలెందుకు సడ్డమాలినయో సమజైతలేదు.బతుక సడుగుపొడుగున మర్లబడే మాటలెందుకు మూగబోయినయో ఏందో!

జనం కూకోబెడితె గద్దెమీద కూకున్న ఏలికలు తోవదప్పి నడుత్తాంటె వుత్తగనే జూసుకుంట వుండుడేందన్నట్టు? దొరల రాజ్జెం నడిషినప్పుడు వాళ్ళ పోరలు సదువు కోవాలెమన పోరగాండ్లేమో గొర్లు బర్లు కాయబోవాలె!దొరలు బాయె!గాళ్ళ రివాజు మంట్లె గలిశినంక మనూర్లు మనకై బతుకులు జరంత బాగైనయనుకుంటె భూమి గుండ్రంగ తిరుగుడు ఆగుతాదుల్లా! ఎన్కట ఊర్ల మీదబడే దొరోళ్ళు, దొరోళ్ళ చెంచాగాళ్ళు ఊర్లె గత్తర లేపి పోతె,ఊర్లె ఉత్త పీనుగలే ! లేకుంటె పీనుగలాసొంటి ముసలీ ముత్కా మిగిలేటోళ్ళట.కుక్కలు జింపిన ఇస్తార్లోలిగె కూలిన బతుకులల్ల కొసూపిరి తోనున్న ఆశలు బతికేందుకన్న బడితెలు బట్టిండ్లు.ఊరూర్లె జెండెగురుతె తప్ప మనబతుకులు మారదని గుదిపలు బట్టిండ్లు.! మన తెలంగాణ మట్టిపొత్తిళ్ళల్ల బతుకుడంటె మర్లవడుడే! అనేటిఇగురం మరిషిపోతానట్లే కొడుతాంది.దబనున్నకాడల్ల పచ్చవారినట్టు దోపిడి ఆగం జేషిన ఊరూర్లె జెండెగిరి దండు కట్టేది నిప్పుల కొలివై గుప్పున మండిన తెలంగాణ పల్లెలల్ల అడుగువెట్టేందుకు సూత ధైర్నం జేయని దొరలరాజ్యం పట్నం సడుగు బట్టె.గఢీలన్ని గబ్బిలాల పాలాయె!భూములన్ని దున్నుకునెటోళ్ళకాయె! భూమి గుండ్రంగ తిరుగుతదంటరు గద! తిరిగింది! దొరలరాజ్జెం మళ్ళచ్చినట్టే కొడ్తాంది. ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న దొరీర్కం కొట్టచ్చినట్టే కానత్తాంది. మన ఆకాంక్షల రాజ్యంల శాసనం మీద ఇమానంగ ఓట్లేశినజనాల సంక్షేమం జూడాల్షిన ఏలికలు వాళ్ళసంక్షేమమే జూసుకుంటాండ్లని ఎవలకు సూత అనిపిత్త లేదాయేంది!? బడులు బొంద బెట్టి, సర్కార్‌ ‌సదువులను లేకుంట జేసుడంటె మన సంస్కృతి,సంప్రదాయాల ఎరుక ఇంకో తరం కాడిదాంక పోకుంట అడ్డువడుడు కాదా!?మనిషి ఉనికికే తిప్పలచ్చే కొత్త మోపయితాందని ఎరుకుండి సూత మునుపటి సత్తువ తెచ్చుకునేందుకు ముందుకు రాకుంట యెట్లనో యేమో!

సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్
‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా ‘‘ వేలల్ల బడులు మూతబడి,సదువులు సట్టుబండలయితానయి.కదా! ఈ దుర్మార్గాలను ఆపెటానికి… సర్కార్‌ ‌ను ఎవరు నిలెయ్యాలె! నిలేషేటోళ్ళు గట్టిగనే వుంటే గీ ఆరేండ్లల్ల గిన్ని వేల బళ్ళెట్ల ఆగమైనయి!? నా ప్రశ్నలకు జవాబులు జెప్పాలె! ! అని ఇరుకుట్ల పెట్టిన భేతాళ్‌ ‌శవాన్ని ఎప్పటి తీర్గనే భుజానేసుకోని’’ ఇను భేతాళ్‌ ‘‘అన్నాయాలను నిలేషేందుకు నిల్సున్నోళ్ళందరికి ఆ అన్నాయాల తోని మోపయ్యే తిప్పలేందనే ఎరుక వుండాలె! భూజాన కండువేసుకోంగనే పెద్ద మనిషి గాడు,జెండెత్తినోడల్లా నికాలస్‌ ‌కార్యకర్త కాదు. ఉద్యమం అంటే త్యాగమనే సోయి వుంటెనే మర్లబడే మాటలు తుపాకీ తూటాలయితయి’’ అని చెప్పుకుంట,చెప్పుకుంట ఎప్పటి లాగనే…నడ్వబట్టిండు…నడ్వబట్టిండు
– తెలంగాణ ఎలమంద

Tags: telangana elamanda, telangana slang, netiviti

Leave a Reply