- అన్ని పార్టీలకూ అదే ఆయుధం
- బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు
- ఈనెల తొలి వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతున్నది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వోటర్లను ఆకర్శించే ప్రయత్నంలో భాగంగా ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలూ ఐటీఐఆర్ అంశాన్ని ఆయుధంగా మలచుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధప్రదేశ్ విభజన సమయంలో హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను కేటాయిస్తూ కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పార్లమెంటులో చట్టాన్ని సైతం ఆమోదించింది. ఐటీఐఆర్ ఏర్పాటు చేయడంతో నిరుద్యోగులకు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ఈ చట్టం ఉద్దేశ్యం. అయితే, రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఏడేళ్లు గడుస్తున్నప్పటికీ ఐటీఐఆర్‌కు మోక్షం కలగలేదు.
ఈ అంశం అడపాదడపా ప్రస్తావనకు వస్తున్నప్పటికీ తాజాగా రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు గుప్పించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ విడుదల చేయడం తాజాగా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యం లేదనీ, అందుకే ఐటీఐఆర్‌పై ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు.
అయితే, రాష్ట్రానికి ఐటీఐఆర్ రాకపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్న బండి సంజయ్ ఆరోపణలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును పక్కనబెట్టింది బీజేపీ ప్రభుత్వమేననీ, ఇదే విషయం కేంద్ర మంత్రి రవిశంకర్ స్పష్టం చేశారని బండి సంజయ్ ఆరోపణలను తిప్పికొట్టారు. ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ 2014 నుంచి కేంద్రానికి రాసిన లేఖలు సమర్పించిన డీపీఆర్‌లు సంజయ్‌కు పంపిస్తాననీ, ఐటీఐఆర్ తీసుకువచ్చే దమ్ము బండి సంజయ్‌కి ఉందా అని కేటీఆర్ సవాల్ విసిరారు.
అసత్యాలు, అబద్ధాలతో సంజయ్ పట్టభద్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఐటీఐఆర్ ఏర్పాటుపై టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, మధ్యలో కాంగ్రెస్ కూడా తలదూర్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఐటీఐఆర్ ఏర్పాటకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని బీజేపీ తుంగలో తొక్కిందనీ, దీనికి రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రయత్నించడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఐటీఐఆర్ అంశంగా సాగుతున్న మాటల యుద్ధానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వోటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సి ఉంది.