సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్రావు పిలుపు
జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని విపంచి ఆడిటోరియంలో ఈ నెల 13న ఐటిసి కంపెనీ జాబ్ మేలా నిర్వహిస్తుందనీ, ఈ మేళాను నియోజకవర్గం పరిధిలోని ఆయా మండల, గ్రామ ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పిలుపునిచ్చారు. డైరెక్టర్, ఉపాధి శిక్షణ శాఖ వారి ఆధ్వర్యంలో ఐటిసి కంపెనీ నిర్వహించే జాబ్ మేలాలో ఐటిఐ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు 13న సిద్ధిపేట విపంచి కళా నిలయంలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇంటర్వూలు నిర్వహించబడుతాయని మంత్రి పేర్కొన్నారు.
నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని అభ్యర్థులను గుర్తించి వారి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరయ్యేలా చూడాలని కోరారు. ఈ మేరకు ఐటిఐలో ఫిట్టర్, టర్నర్, ఎలాక్ట్రిషియన్, మిషినిస్టు, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ పూర్తి చేసిన 25 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి హరీష్రావు కోరారు. మరిన్ని వివరాలకు సిద్ధిపేట ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్-కన్వీనర్ వి.వి.సుబ్బలక్ష్మిని సంప్రదించాలని మంత్రి హరీష్రావు సూచించారు.