Take a fresh look at your lifestyle.

పివీ తమవాడనడానికి కాంగ్రెస్‌కు పదహారేళ్ళు పట్టింది

భారత మాజీ ప్రధాని దివంగత పాములపర్తి వెంకట నర్సింహారావు(పివీ) తమవాడేనని బాహాటంగా ప్రకటనలు చేయడానికి జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీ అధిష్టాన వర్గానికి పదహారేళ్ళు పట్టింది. ఈ పదహారు సంవత్సరాల్లో వారికేనాడు పివీ చేసినసంస్కరణలు గాని, ఆయన విదేశాంగ విధానంగాని గుర్తుకు రాకపోవడం విచిత్రమేమరి. మరిప్పుడు ఆ పార్టీకి పివీ మీద మమకారం ఎందుకు పుట్టుకువచ్చింది? అంటే.. నెహ్రూ, గాంధీ కుంటుంబ నాయకత్వాల కింద కొనసాగిన కాంగ్రెస్‌ ‌పార్టీలో వారి తర్వాత గొప్పగా చెప్పుకునే నాయకులెవరూ లేకపోవడం ఒకటైతే, ఆ పార్టీలోని లెజెండ్‌లను ఇతర పార్టీలు తన్నుకుపోతుండడం మరో కారణం. వాస్తవంగా భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర పెద్దగా లేని బిజెపి మొదటి నుండీ కొందరు యోధులపై తమ ముద్రవేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వీరసావర్కర్‌, ‌సుభాష్‌చంద్రబోసు మొదలు భారతదేశంలో మరెక్కడాలేనంత పెద్ద ఎత్తున సర్దార్‌ ‌వల్లబాయిపటేల్‌ ‌పంచలోహ విగ్రహా ఆవిష్కరణతో వారిని సొంతం చేసుకునే పక్రియ కొనసాగిస్తోంది. మొదటినుండీ నెహ్రూ ఫ్యామిలీకి లాయల్టీగా ఉంటూ వొస్తున్న కాంగ్రెస్‌ ‌వీరిని పెద్దగా పట్టించుకోకపోవడం ఎదుటి పార్టీకి అవకాశంగా మారింది. అదే విధానాన్ని తెరాస కూడా అనుసరిస్తోంది. పివీ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవున నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే ప్రకటించింది. అప్పటివరకు పివీ శతాబ్ధి ఉత్సవాలను జరుపాలన్న కనీస ఆలోచన కాంగ్రెస్‌ ‌పార్టీకి ఉన్నట్లులేదు. అయితే తెలంగాణ ప్రభుత్వ ప్రకటన వెనుక రాజకీయ ఎత్తుగడ లేదని అనుకోలేము. కాంగ్రెస్‌చే నిర్లక్ష్యం చేయబడిన సర్ధార్‌ ‌పటేల్‌పై బిజెపి ఎలాంటి ప్రేమను కనబరుస్తున్నదో, పివీ విషయంలో కూడా తెరాస ప్రభుత్వం అలానే ఆప్యాయతను చూపిస్తోంది. అయితే పివీ కాంగ్రెస్‌ ‌వ్యక్తికదా అంటే.. తెలంగాణవాడు కదా అన్న సెంటిమెంట్‌ను ఆ పార్టీ ముందుకు తీసుకొస్తున్నది.

దక్షిణాది ప్రాంతం నుండి ప్రధాన మంత్రి హోదాకు ఎదిగిన ఒకే ఒక్కడు, అందునా తెలంగాణ వాడవడంతో ఆయన్ను గౌరవించుకోవాల్సిన కనీస బాధ్యత ఈ ప్రాంతానికుందనడంలో సందేహం లేదు. ఇక్కడే ట్విస్ట్ ఉం‌ది. కాంగ్రెస్‌ ‌పార్టీలో నెహ్రూ కుటుంబం తర్వాత పివీ స్థాయిలో పేరు గడించిన వ్యక్తి లేకపోవడం ఒక విధంగా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడమే. పివీ ప్రధాని పదవి చేపట్టిన కాలం నుండే కాంగ్రెస్‌లో ఆయనకు వ్యతిరేక గ్రూపు రాజకీయాలు ప్రారంభమైనాయి. 1992లో జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీ తిరుపతిలో నిర్వహించిన సమావేశాల నుండి అంతర్గత శత్రువులు సోనియాగాంధీకి ఆయనపై విషం రంగరించి పోయడంతో మొదలైన వ్యతిరేకత ఆయన దహన సంస్కారాలవరకు కొనసాగిందనడానికి చరిత్రే సాక్ష్యం. 2004 డిసెంబర్‌ 23‌న ఆయన మరణించిన నాటి నుండి కాంగ్రెస్‌ ‌పార్టీ కేంద్ర నాయకులుగాని, రాష్ట్ర నాయకులుగాని ఆయన గురించి మాట్లాడితే ఎక్కడ తమను పార్టీనుంచి వెలివేస్తారో లేదా పదవుల నుండి తొలగిస్తారేమోనన్న భయంతో గడిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన గురించిన ప్రస్తావన తీసుకురావాడానికే జంకేవారు. ఇప్పుడు దశాబ్ధకాలంగా కాంగ్రెస్‌ ‌పరాజయాలనే చవిచూస్తోంది. ఈ సందర్భంలోనే ఆ పార్టీలోని మేటి నాయకులొక్కొక్కరికి ఇతర పార్టీలు బ్రహ్మరథం పడుతుండడంతో కాంగ్రెస్‌కు పాలుపోకున్నది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పివి శతజయంతి ఉత్సవాలను ప్రకటించిన తర్వాత, రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ తాము కూడా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

మైనార్టీలోఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని పివీ తన చాణక్యనీతితో అయిదేళ్ళకాలం గుంజుకువచ్చారు. అలాంటి వ్యక్తి మరణిస్తే ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఆలిండియా కాంగ్రెస్‌ ‌కమీటీ కార్యాలయానికి తీసుకురానివ్వకుండా సోనియా కోటరీ అడ్డుతగిలిందన్న విషయం జగత్‌ ‌విధితమే. దివంగత ప్రధానులందరి మాదిరిగా ఢిల్లీలో కాకుండా అంత్యక్రియలను ఆయన స్వరాష్ట్రంలో జరుపాలని అవమానించిన కాంగ్రెస్‌, ‌కనీసం హైదరాబాద్‌లో చితి భస్మం అయ్యేవరకు ఉండే ఓపికలేనంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇప్పుడు పివీ మా వాడు, మనవాడని గొంతెత్తి చాటే ప్రయత్నంచేస్తున్నారు. ఇప్పడు కూడా ఈ ఉత్సవాలను జాతీయ స్థాయిలో కాకుండా తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేస్తున్నారు. ఇదే విషయమై పివీ మనమడు, బిజెపి నాయకుడు ఎన్‌వి సుభాష్‌ ‌కాంగ్రెస్‌ను నిలదీస్తున్నాడు. ఆనాడు అంతగా అవమానించి, ఇవ్వాళ పివీ శత జయంతి ఉత్సవాలు చేసే అర్హత కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎక్కడిదంటూ ఆయన దీన్ని తీవ్రంగా గర్హిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయం ఇందిరాభవన్‌లో శ్రీకారం చుట్టిన ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సోనియా, రాహుల్‌ ‌గాంధీలు దాదాపు ఒకటిన్నర దశాబ్దాల తర్వాత పివీ గొప్పదనంపై బహిరంగ ప్రకటన చేయడం బహుశా ఇదే మొదటిసారి అయిఉంటుంది. ఇది నిజంగా దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకానికి కాస్తా వింతగా కనిపిస్తున్న అంశమే. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ తన అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తోందన్న విమర్శ మాత్రం సర్వత్రా వినిపిస్తోంది.

Leave a Reply