Take a fresh look at your lifestyle.

దేవాలయం, మసీదుకు ఇబ్బంది కలగడం విచారకరం

  • సచివాలయ భవనాల కూల్చివేత సందర్భంగా….
  • ప్రభుత్వ ఖర్చుతో మరింత విశాలంగా మళ్లీ నిర్మిస్తాం: సీఎం కేసీఆర్‌

తెలంగాణ సచివాలయం పాత భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల సీఎం కేసీఆర్‌ ‌విచారం వ్యక్తం చేశారు. ఈ రెండింటిని ప్రస్తుతం ఉన్న స్థలంలోనే అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంలో పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ప్రకటించారు. కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న పాత సచివాలయ భవనాలను ప్రొక్లెయినర్లతో కూల్చివేస్తున్న సమయంలో వాటి శిథిలాలు దేవాలయం, మసీదులపై పడటంతో అవి కొంతమేర ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ ‌స్పందిస్తూ ఇలా జరగడం పట్ల తానెంతగానే బాధపడుతున్నాననీ, ఇలా జరిగి ఉండాల్సింది కాదని విచారం వ్యక్తం చేశారు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప ప్రార్థనా మందిరాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా ఎన్ని కోట్లు ఖర్చయినా వెనకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ వ్యయంతో నిర్మించి వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు. దేవాలయ, మసీదు నిర్వాహకులతో తానే స్వయంగా సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుని కొత్త సచివాలయ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా స్థలాలను నిర్మించి ఇస్తానని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సెక్కులర్‌ ‌రాష్ట్రమనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామనీ, కాకతాళీయంగా జరిగిన ఈ సంఘటనను అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు.

కెసిఆర్‌ ‌నిర్ణయాన్ని స్వాగతించిన ఓవైసీ
సచివాలయం ప్రాంతంలోనే కొత్త ఆలయం, మసీదు కట్టిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేసిన ప్రకటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్వాగతించారు. సచివాలయంలోని పాత భవనాల కూల్చి వేత సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆలయం, మసీదు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో వాటిని కూడా తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పందించారు. ఆలయం, మసీదులకు ఇబ్బంది కలగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రాంతంలోనే ప్రస్తుతం ఉన్న వాటికంటే విశాలంగా, సౌకర్యవంతంగా ఆలయం, మసీదును నిర్మిస్తామని, వాటికోసం అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు. ఈ ప్రకటనపై అసదుద్దీన్‌ ఒవైసీ ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నానని తెలిపారు. యునైటెడ్‌ ‌ముస్లిం ఫోరం తరఫున పూర్తి స్టేట్‌మెంట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఎన్జీవోల హర్షం
కొత్తగా నిర్మించనున్న సచివాలయ ప్రాంగణంలో దేవాలయం, మసీదులను కూడా కొత్తగా నిర్మిస్తామని, అందుకు పూర్తిగా ప్రభుత్వ నిధులనే వినియోగిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ప్రకటించడపట్ట తెలంగాణ నాన్‌ ‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం హర్షం ప్రకటించింది. సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు, రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలనుంచి పనుల నిమిత్తం వచ్చే ఉద్యోగులకు, ప్రజలకు భరోసాను, నమ్మకాన్ని కొత్త మసీదు, దేవాలయాలు కలిగిస్తాయని తెలంగాణ నాన్‌ ‌గెజిటెడ్‌ అధికారుల సంఘం(టీఎన్జీఓఏ) అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కారం రవీందర్‌ ‌రెడ్డి, మామిళ్ళ రాజేందర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply