Take a fresh look at your lifestyle.

మొక్కుబడి చర్య ..!

కొరోనా బారినపడి మంగళ వారం ఒకే రోజు నలుగురు జర్నలిస్టులు మృతి చెందడం దురదృష్టకరం. అందులో ఒకరు సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‘‌ప్రజాతంత్ర’ శ్రేయోభిలాషి కె అమర్‌ ‌నాథ్‌ ‌హైదరాబాద్‌లో గత పది రోజులుగా కొరోనా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వేములవాడలో సీనియర్‌ ‌జర్నలిస్ట్  ‌బుర రమేష్‌, ‌విశాఖ పరవాడ రిపోర్టర్‌ ‌సూర్యప్రకాశ్‌, ‌కరీంనగర్‌ ‌రిపోర్టర్‌ ‌పడకంటి రమేష్‌ ‌కోవిడ్‌ ‌బారినపడి మృతి చెందారు. వీరి కుటుంబాలకు ప్రజాతంత్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. వైరస్‌ ‌వ్యాప్తి తీవ్రతను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం ..హై కోర్టు ఆదేశాలతో నియంత్రణకు చర్యలను చేపట్టింది. అందులో భాగంగా మంగళవారం నుంచి రాత్రి 9 గం ..నుంచి పొద్దున 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తామని పోలీసు అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. రాతి కర్ఫ్యూను వైద్యాధికారులు సమర్థిస్తున్నారు. యువత వల్లనే వైరస్‌ ‌విస్తృతంగా వ్యాపిస్తుంది. అది వారి కుటుంబసభ్యులకు సోకడం వల్ల పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని వైద్య నిపుణుల అభిప్రాయం. రాత్రి సమయంలో యువకులే కోవిడ్‌ ‌నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువగా సంచరించడం కారణంగా వైరస్‌ ‌విస్తరిస్తుందనీ..యువత కదలికలను కట్టడి చేయడానికి రాత్రి కర్ఫ్యూ విధించడం సమంజసమని అధికారులు సమర్థించుకుంటున్నారు.

కానీ సామాన్య ప్రజానీకం మాత్రం రాత్రి కర్ఫ్యూ వైరస్‌ ‌విస్తరణను కట్టడి చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్‌ ‌రావుకు కొరోనా పాజిటివ్‌ ‌నిర్ధారణ అయింది. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి భగత్‌కు, అతని కుటుంబ సభ్యులకు కూడా కొరోనా సోకింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇతర పార్టీ నాయకులకు, కార్యకర్తలు కూడా కొరోనా బారిన పడ్డారు. ఈ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కోవిడ్‌ ‌నిబంధనలను పాటించలేదు. అందరూ ఉల్లంఘించిన వారే ..! కొరోనా బారిన పడిన సిఎం కేసీఆర్‌  అం‌తకుముందు మాస్క్ ‌లేకుండా సమీక్షలు నిర్వహించి, సభల్లో పాల్గొన్న ఫొటోలు మీడియాలోను, సోషల్‌ ‌మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయి. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు వారి అధినేత బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచారు. రాష్ట్రంలో మాస్కులు ధరించనివారికి వేలకు వేలు ఫైన్లు వేస్తున్నారనీ, ఆ ఫైన్‌ ఏదో మాస్కు ధరించని కేసీఆర్‌, ఆ ‌పార్టీ నేతలకు కూడా వేసి ఉంటే పాపం ఆయన జాగ్రత్త పడేవారు కదా అని బిజెపీ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా విమర్శించారు.

ఇక రాత్రివేళ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు కానీ, పగటి పూట ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఈ ప్రభుత్వం సాధించదలుచుకుంది ఏమిటో అర్థం కావడం లేదనీ విజయశాంతి అభిప్రాయం. సామాన్య ప్రజానీకానిది కూడా ఇదే అభిప్రాయం ..! రాష్ట్రంలో కొరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నలతో..దిద్దుబాటు చర్యగా రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించినట్లు స్పష్టమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయి అన్న విమర్శ సర్వత్రా ఉన్నది. వైద్య శాఖ సంబంధిత అధికారులు, అదే శాఖ మంత్రి కొరోనా వైరస్‌ ‌విస్తరణపై పొంతన లేని భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం వారి పరస్పర సమన్వయ లోపానికి నిదర్శనం.

టెస్టుల నిర్వహణ, కోవిడ్‌ ‌నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది..అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించింది..అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదు. విద్యాసంస్థలను మాత్రం మూయించి సభలు, ర్యాలీలు, వైన్‌ ‌షాపులు, పబ్‌లు, క్లబ్‌లు గుంపులు గుంపులుగా తిరుగుతున్న జనాన్ని కట్టడి చేయలేక పోవడం, బెడ్స్ ‌కొరత గురించి..సరైన సమాచారం లేని ప్రభుత్వ నివేదికల్లోని లోపాలపై హైకోర్టు నిలదీసింది. సరిగ్గా కిందటేడాది ఏం తప్పులు జరిగాయో…అవే ఇప్పుడూ పునరావృతం అవుతున్నందువల్లే రాష్ట్రంలో కొరోనా సెకెండ్‌ ‌వేవ్‌ ‌తీవ్ర రూపం దాల్చిందనే విషయాన్ని సర్కారు గ్రహించడం లేదు, గుణపాఠం నేర్చుకోవడం లేదు.

హై కోర్టు ఆదేశాలతో కొరోనా వైరస్‌ ‌విస్తరణ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే కంటే ముందే..పలు గ్రామాలు, మండలాలు, వ్యాపార సంఘాలు స్వీయ లాక్‌ ‌డౌన్‌ను ప్రకటించుకున్నాయి. రేపటి నుంచి రాష్ట్రంలో సినిమా హాళ్లు, మల్టీ ప్లెక్స్‌లు పాక్షికంగా మూసివేయాలని సినీ నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. మరో వైపు..రాష్ట్ర ఎన్నికల సంఘం మునిసిపల్‌ ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తూ..ప్రచార సమయాన్ని మాత్రం కుదించింది. ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌ ‌రావుకు కొరోనా కేవలం నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కారణంగానే అన్నది సుస్పష్టం ..! మంగళవారం కోవిడ్‌ ‌బారిన పడ్డ కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ విస్తరిస్తున్న కొరోనా వైరస్‌ ‌దృష్ట్యా బాధ్యత గల నాయకునిగా  రెండు రోజుల క్రితం బెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికల పార్టీ ప్రచారాన్ని విరమించుకున్నారు. వారం రోజుల క్రితం కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కూడా అన్ని రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరో వైపు దేశ ప్రధాని శనివారం బెంగాల్‌లో జరిగిన ఒక ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ..ఇంత భారీ సంఖ్యలో ప్రజలను ఎన్నడూ చూడలేదని..కొరోనా వైరస్‌ ‌విస్తరిస్తున్న సమయంలో మోడీ ఆనందం వ్యక్తం చేయడం ఆయన విజ్ఞతకే వొదిలేద్దాం ..!.

Leave a Reply