Take a fresh look at your lifestyle.

రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం మన విధి

  • దేశ ఐక్యతకు, పటిష్టతకు అదే పునాది
  • పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ
  • ముంబై దాడుల్లో అమరులకు నివాళి
  • ఒకే కుటుంబం చేతుల్లో జాతీయ పార్టీ ఉంటే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సమస్య
  • కాంగ్రెస్‌ ‌పార్టీ ఫర్‌ ‌ద ఫ్యామిలీ.. పార్టీ బై ద ఫ్యామిలీ అన్నట్లుగా మారిందని విమర్శ
  • ప్రసంగించిన రాష్ట్రపతి తదితరులు
  • కాంగ్రెస్‌ ‌సహా హాజరు కాని 14 ప్రతిపక్ష పార్టీలు

మనం మన రాజ్యాంగాన్ని అక్షరబద్ధంగా, స్ఫూర్తితో పాటిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మనం ఎటువైపు వెళ్తున్నామో, మన ప్రాధాన్యత ఏమిటి, దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని మోడీ అన్నారు. పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్‌, ‌టీఎంసీతో సహా 12 పార్టీలు బహిష్కరించాయి. ఈసందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ..విభిన్నమైన మన దేశాన్ని మన రాజ్యాంగం ఏకీకృతం చేస్తుందని అన్నారు. ఎన్నో అవరోధాల తర్వాత రాజ్యాంగాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. స్వతంత్రంగా ఉన్న రాష్ట్రాలను మన రాజ్యాంగం ఏకంగా చేసిందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం రోజున మన పార్లమెంట్‌కు సెల్యూట్‌ ‌చేయాలన్నారు. ఇక్కడే అనేక మంది నేతలు తమ మేథోమథనంతో రాజ్యాంగాన్ని రచించినట్లు చెప్పారు. మహాత్మా గాంధీతో పాటు దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఎంతో మంది నేతలకు నివాళి అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 1950 తర్వాత ప్రతి ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాల్సి ఉండె అని, రాజ్యాంగ నిర్మాణంపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కానీ కొందరు అలా వ్యవహరించలేదన్నారు. మన హక్కుల రక్షణ కోసం మన విధులు ఏంటో తెలుసుకోవాలన్నారు.

ముంబైలో ఉగ్రదాడులు జరిగి నేటికి 14 ఏళ్లు అవుతుందని, ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన సాహస సైనికులకు నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2008లో ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి వందలాది మంది అమాయక పౌరులను హతమార్చిన ఈరోజు 26/11 కూడా మనకు చాలా బాధాకరమైన రోజు అని ఆయన అన్నారు. ఆ రోజు మరణించిన ప్రతి ఒక్కరికీ, ఇతరులను రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన మన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.

vice president at Constitution Day celebrations

ఈరోజు రాజ్యాంగ దినోత్సవం..ఈ రోజు మనం మన రాజ్యాంగం చెప్పినదంతా సమర్థిస్తున్నామా? రాజ్యాంగాన్ని మన గొప్ప నాయకులు, భారతదేశానికి స్వాతంత్య్ర పొందిన వారు రచించారు. అయితే ఈరోజు మనం రాజ్యాంగంలోని ఒక పేజీని కూడా అనుసరిస్తున్నామా అని తర్కించుకోవాలన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ ‌పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ‌పార్టీ వైఖరిని తప్పుపట్టిన ఆయన..పార్టీ ఫర్‌ ‌ద ఫ్యామిలీ..పార్టీ బై ద ఫ్యామిలీ అన్నట్లుగా మారిందన్నారు. ఈ అంశంపై అంతకన్నా ఎక్కువగా చెప్పడం తనకు ఇబ్బందిగా ఉందన్నారు. ఒకే పార్టీ దేశాన్ని పాలించడం కానీ, ఒక పార్టీ వ్యవస్థ మొత్తం ఒకే కుటుంబం చేతుల్లో ఉండడం సరికాదన్నారు. ఒక జాతీయ పార్టీ తరతరాలు ఒకే కుటుంబం చేతుల్లో ఉంటే, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సమస్యగా మారుతుందని ఆయన అన్నారు.

కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు రాజకీయ పార్టీలను గమనిస్తే..ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అన్నారు. రాజ్యాంగం చెప్తున్న దానికి ఇది విరుద్ధమన్నారు. కుటుంబాల చేతుల్లో ఉండే పార్టీల గురించి ప్రస్తావిస్తూ.. ఒక కుటుంబం నుంచి పార్టీలోకి ఎక్కువ మంది రావద్దు అన్న ఆంక్షలు ఏవీ లేవన్నారు. యోగ్యులైన వారు ఒకే కుటుంబంలో ఎందరు ఉన్నా..ప్రజల దీవనెలు ఉంటే..వారంతా పార్టీలో సేవ చేయవచ్చు అన్నారు. కానీ ఒక పార్టీని తరతరాలు ఒకే కుటుంబం ఏలితే, ఆ పార్టీలో ఉన్న వ్యవస్థలన్నీ ఒకే కుటుంబం వద్ద ఉంటే, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకటంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ఓం ‌బిర్లా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఆధునిక భగవత్‌ ‌గీత అన్నారు. దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు రాజ్యాంగం మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరం దేశం కోసం పనిచేయాలని తపిస్తే, అప్పుడు మనం ఏక్‌ ‌భారత్‌, ‌శ్రేష్ట భారత్‌ను నిర్మించవచ్చని స్పీకర్‌ ‌బిర్లా తెలిపారు. రాజ్యాంగ దినోత్సవ సంబురాలకు విపక్షాలు డుమ్మా కొట్టాయి. 14 ప్రతిపక్షాలు పార్టీలు ఆ వేడుకలకు హాజరుకాలేదు. కాంగ్రెస్‌, ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ఈ వేడుకల్లో పాల్గొనలేదు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడంలేదని కాంగ్రెస్‌ ‌నేత మానిక్‌ ‌కూర్‌ ఆరోపించారు. సోమవారం నుంచి శీతాకాల సమావేశలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని 14 పార్టీలు నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ ‌నేత మల్లిఖార్జున్‌ ‌ఖర్గే వెల్లడించారు.

నవభారత నిర్మాణంలో రాజ్యాంగంది కీలక పాత్ర : ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు
సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. రాజ్యాంగ రూపకర్తలకు నివాళర్పిస్తున్నాని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్‌ 26 ‌చారిత్రక దినం అని తెలిపారు. ప్రజాస్వామ్య దేశ తత్వాన్ని రాజ్యాంగ పీఠిక ప్రతిబింబించిందని చెప్పారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి జరగాలని సూచించారు. భారతీయులంతా ఒక్కటే.. ఒకరి కోసం అందరం ఉన్నామని చెప్పారు. సవాళ్లకు అనుగుణంగా మార్చుకునే స్వభావం మన రాజ్యాంగానికి ఉందన్నారు. సురక్షిత, సుశిక్షిత, స్వాస్థ్య భారత్‌ ‌మనందరి లక్ష్యం కావాలన్నారు. ఇటీవల ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశాల్లోనూ ఇదే ప్రస్తావన వొచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగాల్సి ఉందన్నారు.

Leave a Reply