Take a fresh look at your lifestyle.

మత సంబంధిత విషయాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం సరికాదు

  • సోషల్‌ ‌మీడియా వాస్తవాలను ప్రసారం చేయాలి
  • ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌

‌వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్‌ ‌మీడియాలో వార్తలు ప్రసారం చేయడం తగదని ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌సూచించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడితే తప్పు లేదుకానీ, ప్రజలను విడదీసి ప్రభుత్వాన్ని కుంగదీసే విధంగా చానళ్లు ప్రవర్తించకూడదని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత సంబంధిత అంశాలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పరిస్థితులు ఏర్పడే విధంగా అసత్యాలను సోషల్‌ ‌మీడియాను ఆధారం చేసుకుని ప్రసారం చేసే చానళ్ల విలేకరులపై కేసులు పెట్టినప్పుడు జర్నలిస్టు సంఘాలు దాని మీద కొంత పరిశీలన చేసి వాస్తవాలను తెలుసుకుని ప్రకటనలు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవాలను తెలుసుకుని నిజాలు ఉంటే నిజాలను రాయవచ్చనీ, నిజంగానే ఒక ఆలయంపైననో, ప్రార్థనా మందిరంపైననో ఎవరైనా దాడి చేసి దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన పక్షంలో లేదా విధ్వంసానికి పాల్పడితే వాస్తవాలు ఉంటే రాయడంలో తప్పు లేదన్నారు. కానీ, జరగని వాటిని కూడా జరిగినట్లు సోషల్‌ ‌మీడియాను ఆధారం చేసుకుని రాయొద్దని ఆయన జర్నలిస్టులకు, మీడియా యాజమాన్యాలకు, మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

ఏపీలో ఇటీవలి కాలంలో పలు ఆలయాలపై జరిగిన దాడుల ఘటనలన్నీ రాత్రి వేళల్లోనే జరిగాయనీ, దీన్ని బట్టి చూస్తే ఈ ఘటనల వెనక ఏదో కుట్ర దాగి ఉందని భావించాల్సి వస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుట్ర జరుగుతోందనీ, ఇందులో భాగంగానే కొన్ని విధ్వంసకర శక్తులు ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆలయాలు,ప్రార్థనా మందిరాలపై ఇటీవల జరిగిన దాడుల ఘటనలకు సంబంధించి దోషులను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వం 16 మందితో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏసిబి అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌జివిజి అశోక్‌ ‌కుమార్‌ ‌నేతృత్వంలోని ఈ బృందంలో ఎస్పీ స్థాయి అధికారి ఒకరు, ఇద్దరు అడిషనల్‌ ఎస్పీ స్థాయి, నలుగురు డీఎస్పీలు ఈ బృందంలో ఉన్నారని వివరించారు, సెప్టెంబర్‌ 2020 ‌నుంచి ఆలయాలపై జరిగిన దాడుల ఘటనలన్నింటిపై విచారణ సాగిస్తోందనీ, దోషులను త్వరలోనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా దేవులపల్లి అమర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply