- ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదులుకోవడం వల్లే సమస్య
- తెలంగాణ సర్కార్ తీరును తప్పుపట్టిన ప్రభుత్వ సలహాదారు సజ్జల
అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఆంబులెన్స్‌లను ఆపడం దురదృష్టకరమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన డియాతో మాట్లాడుతూ ఆంబులెన్స్‌లను ఆపొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పిందని, న్యాయస్థానం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్‌లైన్స్ పెట్టిందన్నారు. ఈ సమస్యపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
మానవత్వంతో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ల ప్రజల గురించి ఆలోచించడం సహజమేనని.. అయితే తెలంగాణ ప్రభుత్వ గైడ్‌లైన్స్ పాటించడం కష్టమని అన్నారు. వైద్యం కోసం ఏపీ నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్తున్నారని… ఎక్కడా రాని సమస్య తెలంగాణ సరిహద్దులోనే వస్తోందన్నారు.
మెడికల్ ఇన్‌ఫ్రాస్టక్చ్ర ఉన్న రాష్ట్రాలకు వెళ్లడం సాధారణమన్నారు. గత ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టలేదని ఆయన విమర్శించారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిందని, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్టాన్రికి వచ్చేయడంతో తాము ఈ అవకాశాన్ని కోల్పోయామన్నారు. అడ్డగోలు విభజన చేసి వసతులు లేని ప్రాంతాలను ఏపీకి ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.