Take a fresh look at your lifestyle.

వివేకా హత్యలో తన పేరు జోడించడం సిగ్గుచేటు

సిబిఐ విచారణ కోరిన వారే..ఇప్పుడు వద్దంటున్నారు
సిఎం జగన్‌కు వ్యవహారమంతా తెలుసు
మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి

న్యూదిల్లీ,ఏప్రిల్‌25 : ‌వైఎస్‌ ‌వివేకానందరెడ్డి వివేకా హత్యలో తన పేరు, చంద్రబాబు, సునీత పేర్లు సాక్షిలో రాశారని.. ఇది సిగ్గు చేటని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో డియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా సాక్షి పేపర్‌లో అలానే రాస్తున్నారని మండిపడ్డారు. కోర్టులో జడ్జి చాలా క్లియర్‌గా చెప్పారని.. పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఉం‌ది కాబట్టి సుప్రీంకోర్టు కేసు డిస్మిస్‌ ‌చేసిందన్నారు. జగన్‌ ‌ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ  విచారణ కావాలని కోరారని, అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ వద్దు అంటున్నారని విమర్శించారు. తనను సీబీఐ అధికారులు రెండు గంటల పాటు విచారించారని, కుక్కను ఎవరు చంపారు, గొడ్డలి ఎక్కడ కొన్నారో అందరికీ తెలుసునని ఆది నారాయణ రెడ్డి అన్నారు.

వివేకా హత్యలో మొదట సీబీఐ విచారణ కోరింది తామేనని ఆది నారాయణ రెడ్డి అన్నారు. తాను తప్పు చేసి ఉంటే.. తనను ఎక్కడైనా ఊరి తీయవచ్చునని.. ఒక్క శాతం తప్పు చేసిన ఎన్‌కౌంటర్‌ ‌చేయొచ్చునని అన్నారు. కొడికత్తి కేసులో తన పేరు పెట్టారని.. దీనిపై విచారణ చేసిన ఎన్‌ఐఏ.. ఈ ‌కేసులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదని తేల్చిందన్నారు.  సీఐ వద్దంటున్నా.. ఇల్లు క్లీన్‌ ‌చేశారని, కుట్లు వేశారన్నారు. ఇది తమ కుటుంబ సమస్య అని ఎంపీ అవినాష్‌ ‌రెడ్డి సీఐతో అన్నారని, ఒకే తప్పును రెండు మూడు సార్లు చెప్తే నిజం అవుతుందని సీఎం జగన్‌ అనుకుంటున్నారన్నారు. జగన్‌ ఎన్ని కోట్లు సంపాదించినా ఆయన ఎప్పుడు అసంతృప్తితో ఉంటారన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే రూ. లక్ష కోట్లు సంపాదించారని, ఇప్పడు రూ. 10 లక్షల కోట్లు సంపాదించాలని అనుకుంటున్నారని అన్నారు.

గొడ్డలి ఎక్కడ కొన్నది.. కుక్కను కారుతో ఎవరు చంపారన్నది తెలిసిందన్నారు. టీవీ ఛానల్స్‌లో వచ్చిన తర్వాత శంకరయ్యకు ఫోన్‌ ‌చేస్తే గుండెపోటుతో రక్తం కక్కుకున్నరని చెప్పారన్నారు. గుండెపోటు అని విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లో చెప్పారని.. సీఎం జగన్‌ అయితే గొడ్డలి పోటు అని చెప్పారని..ఎలా చెప్పారని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై తమకు అనుమానం ఉందన్నారు.వివేకానందరెడ్డి ఉదయం చనిపోతే సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్‌ ‌వచ్చారని, కప్‌బోర్డుకు రక్తం అంటిందని, ఐదు గొడ్డలి పోట్లు పడ్డాయని ముఖ్యమంత్రి ఎలా చెప్పారని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. జగన్‌ ‌పులివెందుల వచ్చి భాస్కర్‌ ‌రెడ్డితో మాట్లాడి కథ అల్లారన్నారు.

ఇంటి చుట్టూ కెమికల్స్ ‌చల్లారని సీబీఐ చెప్పిందని, సీబీఐపై ఒత్తిడి చేసే అవకాశం లేదన్నారు. అవినాష్‌ ‌రెడ్డి నిందితుడు అని సీబీఐ చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, భాస్కర్‌ ‌రెడ్డిని అరెస్ట్ ‌చేశారన్నారు. అవినాష్‌ ‌రెడ్డి అరెస్ట్ ‌తప్పక జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో ఎవరెవరికి సంబంధం ఉందో వారికి శిక్ష తప్పదన్నారు. సీబీఐ దగ్గర అన్ని అంశాలు ఉన్నాయని.. త్వరలో యాక్షన్‌ ఉం‌టుందన్నారు. సీఎం జగన్‌ ఏమైనా మాట్లాడతారని.. తనను చంపాలనుకుంటే చంపండి… నన్ను చంపొచ్చు కానీ ధర్మాన్ని చంపలేరని అన్నారు. తన కుటుంబ సభ్యులకు ఒక విషయం చెప్పానన్నారు. తాను లేనట్లే బ్రతకమని చెప్పానని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply