Take a fresh look at your lifestyle.

ప్ర‌భుత్వ వైఖ‌రిలో మార్పు రాకపోవడం సిగ్గు చేటు

  • కేంద్ర వైద్య బృందాలు పర్యటించి మార్గదర్శకాలివ్వాలి
  • క‌రోనా వంక‌తో సాదార‌ణ వైద్యానికి మొండిచెయ్యి
  • తెలంగాణ ఇంటి పార్టీ అధ్య‌క్షుడు చెరుకు సుధాకర్

హిమాయత్ నగర్, జూన్ 10 (ప్రజాతంత్ర విలేఖరి) : ప్ర‌పంచ ప్రామాణిక ఆరోగ్య సంస్థ‌ల మార్గ నిర్ధేశాల‌ను ఎగ‌తాళి చేస్తూ శ‌వాల‌కు ప‌రీక్ష‌లు అశాస్త్రీయం అనడం బాధ్యత రాహిత్యమని ఇంత‌టితో ఆగ‌క‌ స‌ప్రీమ్ కోర్టుకు పోతామ‌న‌డం సిగ్గుచేటని తెలంగాణ ఇంటి పార్టీ అధ్య‌క్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. జ‌ర్న‌లిస్టు మ‌నోజ్ సోద‌రుడు గాంధీ హాస్పిట‌ల్‌లో ఆధునిక సౌక‌ర్యాల డొల్ల‌త‌నాన్ని, మ‌నోజ్ చ‌నిపోయే ముందు జ‌రిగిన చాటింగ్‌ను మీడియాకు విడుద‌ల చేసినా, ప్ర‌భుత్వ వైఖ‌రిలో మార్పురాకపోవడం సిగ్గు చేటన్నారు. ఒక వైపు ప్ర‌జ‌ల త‌రుపున పార్టీలు, సంఘాలు మ‌రోవైపు హైకోర్టు క‌రోనా క‌ట్ట‌డి టెస్టులు, వైద్యం గురించి కేసిఆర్ ప్ర‌భుత్వాన్ని నిలదీస్తుంటే మ‌రోవైపు క‌వ్వింపుగా వైద్య మంత్రి ఈట‌ల చ‌నిపోయిన వారికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌డం అశాస్త్రీయ‌మ‌ని ప్ర‌క‌ట‌న‌లివ్వ‌డం కోర్టు దిక్క‌ర‌ణ అన్నారు. పొద్దున లేస్తే ప్ర‌జాధ‌నంతో యాగాల‌కు కోట్ల ఖ‌ర్చు చేసి, మాస్క్‌ల‌తో క‌రోనాకు సంబంధం లేద‌ని, సెక్ర‌టేరియేట్‌ను నిష్కార‌ణంగా, క‌డు అశాస్త్రీయంగా కూల్చ‌డానికి నిర్ణయం తీసుకున్న కేసిఆర్ మంత్రి వ‌ర్గంలో ఆరోగ్య‌మంత్రి మటలు హాస్యాస్పదం అన్నారు.

నిన్న గాంధీ హాస్పిట‌ల్‌లో ఒక రోగి చ‌నిపోయిన‌ప్పుడు బంధువులు డాక్ట‌ర్ల‌పై దాడి తీవ్ర ఉద్రిక్త‌త నేప‌ద్యంలో జూనియ‌ర్ డాక్ట‌ర్లు ఆందోళ‌న‌కు దిగ‌డం వైద్య సౌక‌ర్యాల డొల్ల త‌నాన్ని, ముందు వ‌రుస యోధులు పేరుతో క‌రోనా బారిన‌ప‌డే ప్ర‌మాదాన్ని, త‌మ‌ని బ‌లిచేసే అనేక నిర్ల‌క్ష్య చ‌ర్య‌ల‌ను ర‌క్ష‌ణ లేని స్థితిని తెలియ‌జేస్తుందన్నారు. కేంద్ర వైద్య బృంధాలు గాంధీ హాస్పిట‌ల్‌తో పాటు తెలంగాణ అంత‌టా క‌రోనా వైద్య సేవ‌ల ఆధునీక‌ర‌ణ‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారి భ‌యాన్ని పోగొట్ట‌డానికి గాంధీ దవాఖానను సందర్శించాలన్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అత్యంత కీల‌క ప‌ద‌విలో కొన‌సాగుతున్న‌వేళ దేశంలోనే వైద్య‌వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. క‌రోనా వంక‌తో సాదార‌ణ వైద్యానికి మొండిచెయ్యి చూపెడుతున్నారన్నారు. ఈటెల రాజేంద‌ర్ గాంధీ హాస్ప‌ట‌ల్‌లో వైద్య సౌక‌ర్యాల గురించి ప్ర‌తిప‌క్షాల‌ను ఆహ్వానిస్తున్నారు క‌నుక తెలంగాణ ఇంటి పార్టీ నుండి ఒక డాక్ట‌రుగా, ఉద్య‌మ‌కారుడిగా తానే గాంధీ హాస్పిట‌ల్‌కు వ‌చ్చి సూప‌రింటెడెంట్‌తో మాట్లాడి అనుమ‌తించిన వార్డుల‌ను సందర్శించనున్నట్లు తెలిపారు. ప్ర‌జారోగ్యం యెడ‌ల, క‌రోనా క‌ట్ట‌డికై సిద్ద‌మైన అన్ని సంఘాల‌ను, పార్టీల‌ను నేడు గాంధీ హాస్పిట‌ల్ రావ‌ల‌సిన‌దిగా కోరారు. ఆరోగ్య‌మంత్రి స్పందిస్తే వారితో సంప్ర‌దింపులు, చ‌ర్చ‌ల‌కు, సంద‌ర్శ‌న‌కు సిద్ద‌మేనన్నారు.

Leave a Reply