నియంత్రణ రేఖ పొడవునా కాల్పుల విరమణకు భారత్ , పాక్ సేనలు అంగీకారానికి రావడం శుభ పరిణామం. భారత్ తో కయ్యం కన్నా, నెయ్యం వల్లనే ప్రయోజనకరమని చైనా అంగీకరించిన మరు క్షణంలోనే కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించడం ఆరెండు దేశాల మధ్య ప్రగాఢ బంధానికి నిదర్శనం. చైనా చెప్పినట్టుగా పాక్ నడుచుకుంటోందన్న ఆరోపణల్లో అసత్యం లేదని రుజువు అవుతోంది. భారత్, పాక్ డైరక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం ఉపఖండంలో శాంతికి నాందికావాలని ఇరుదేశాల్లోని శాంతి కాముకులు కోరుకుంటున్నారు. భారత్, పాకిస్తాన్ లను దాయాది దేశాలని మీడియా వర్ణిస్తూ ఉంటుంది.దాయాదుల మధ్య స్వల్ప వివాదాలు అత్యంత సహజం.అవి ఇరుదేశాల మధ్య ఘర్షణలకు దారి తీయకూడదని ఇరుదేశాల్లోని లౌకిక వాదులు, జాతీయవాదులూ కోరుతున్నారు. పాకిస్తాన్ తో సంబంధాలను మన దేశం తేలిగ్గా తెంచుకోలేదు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సినీ దిగ్గజం దిలీప్ కుమార్ పూర్వీకుల నివాసం అతి తక్కువ ధర పలుకుతోందన్న వార్త విని దేశంలో చాలా మంది విచారం వ్యక్తం చేశారు . దిలీప్ కుమార్ మాత్రమే కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వస్థలం ఇస్లామాబాద్ సమీపంలో ఉంది.
మాజీ ఉప ప్రధాని అద్వానీ స్వస్థలం కరాచీ. మరో సినీ దిగ్గజం రాజ్ కుమార్ తండ్రి పృధ్వీరాజ్ కపూర్ స్వస్థలం పాక్ లోనే ఉంది.అలాగే, పాక్ ప్రధానమంత్రి గా చాలా కాలం పని చేసిన నవాజ్ షరీఫ్, మిలటరీ పాలకుడు జనరల్ ముషారఫ్ ల స్వస్థలాలు భారత్ లోనే ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం ఈ రెండు దేశాలు కలిసి ఉండటం వల్ల ఇక్కడి వారిపూర్వీకులు ఇంకా అక్కడే ఉన్నారు. వారందరినీ పేరుపేరునా ప్రస్తావించలేం కానీ , మొత్తం మీద పాకిస్తాన్ తో భారతీయులకు మొదటి నుంచి స్నేహ సంబంధాలున్నాయి.అందుకే, పాక్ తో యుద్ధాన్ని మన దేశం ఎన్నడూ కోరుకోలేదు. పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి చొరవ తీసుకున్నది మన మాజీ ప్రధాని వాజ్ పేయి. ఆయన హయాంలో 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఎన్నో సార్లు ఉల్లంఘించింది.
అయినప్పటికీ మన దేశం ఎంతో సహనాన్నీ, సంయమనాన్ ప్రకటిస్తూ వచ్చింది, ఇప్పటికీ మన విధానం అదే. 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితం అయిందనీ, దీనిని ఆచరణలో పెట్టేందుకు ఇరుదేశాల మిలటరీ ఆపరేషన్స్ డైరక్టర్ జనరల్స్ హాట్ లైన్ సంభాషణలో అంగీకారానికి వచ్చారు. ప్రభుత్వ స్థాయిల్లో కుదిరిన ఒప్పందాలను అమలులో పెట్టాల్సింది సైనికాధికారులే. పాకిస్తాన్ సైనికాధికారులు కూడా భారత్ పట్ల శత్రువైఖరిని ప్రదర్శిస్తూ వచ్చారు.ఈ మధ్యనే పాక్ జనరల్ ఖ్వజ్వా భారత్ తో ఘర్షణకు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. పాక్ వైఖరిలో నిజంగా మార్పు వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.అయితే,.ఆ దేశంలో అంతర్గతపరిస్థితుల కారణంగానే పాక్ జనరల్ ఈ ప్రకటన చేసి ఉండవచ్చు.
చైనాయే భారత్ సైనిక పాటవం ముందు నిలబడలేకపోయింది. అలాంటప్పుడు పాక్ ఎంత అనే వాదన అక్షర సత్యం. భారత్ ఇటీవల సమకూర్చుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు,ఆధునిక ఆయుధ సామగ్రి చూసి చైనా వెనక్కు తగ్గింది. అదే దారిలో ఇప్పుడు పాక్ కూడా మనతో నెయ్యానికి సిద్ధం అవుతోంది. భారత్ మొదటి నుంచి శాంతి కాముక దేశం. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించాలన్న దురుద్దేశ్యం భారత్ కి లేదు.అలాగే, ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశ్యం కూడా భారత్ కి లేదు. అయితే, భారత్ లోకి జిహాదీలను పాక్ సరిహద్దుల నుంచి పంపుతోంది.ఈ జిహాదీలు దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడుతున్నారు. ముంబాయి దాడులు, పఠాన్ కోట విమానాశ్రయంపై దాడులు మొదలైనవన్నీ అలా జరిగినవే. పుల్వామా దాడి సంఘటన కూడా పాక్ ఉగ్రవాదుల పుణ్యమే.
ఇన్ని రకాలుగా పాక్ నుంచి నష్టపోతూ వస్తున్న భారత్ శాంతి యుత విధానంలోనే పాక్ ని లొంగదీయాలన్న సూత్రాన్ని పాటిస్తోంది.చివరికి అది ఇప్పుడు ఫలప్రదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ లో ఈ మార్పు రావడానికి కేవలం చైనా వైఖరి వల్లే కాకుండా, అంతర్గతంగా పాక్ ఎదుర్కొంటున్న సంక్షోభాలు ప్రధాన కారణాలు. పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోయింది. అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలూ పాక్ ని ఆదుకునే స్థితిలో లేవు, పైగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా ముద్ర పడింది. ఈ తరుణంలో పాక్ తన వైఖరిని మార్చుకోవడం అనివార్యం అయింది. పాకిస్తాన్ గడిచిన మూడేళ్ళలో దాదాపు 10,752 సార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. ఇరువైపులా అశేషంగా ప్రాణనష్టంసంభవించింది. పౌరులు కూడా మరణించారు.
ఇలాంటి పరిస్థితులలో భారత్ తో పోరు సాగించలేమన్న నిస్సహాయత పాక్ సైన్యంలో వచ్చి ఉండవచ్చు. పై వారు ఎంత ఎగదోసినా సైనికాధికారులు నియంత్రణ పాటిస్తే కాల్పులవిరమణ ఉల్లంఘన జరగదు.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పాక్ సైనికాధికారులు తాజాగా కాల్పుల విరమణకుఅంగీకరించి ఉంటారు. భారత్ లో బలమైన రాజకీయనాయకత్వం ఉండటం కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. పాక్ మెడలు వంచేలా చేయడంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ప్రధాన పాత్ర వహించారు.ఇటు మన ప్రధానితోనూ,అటు పాక్ ప్రధాని సలహాదారులతోనూ ఆయన పలు దఫాలు జరిపిన చర్చల పర్యవసానంగానే ఈఒప్పందం కుదిరింది. అయితే, పూర్వపు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పాక్ తో జాగ్రత్తగానే వ్యహరించడం అత్యవసరం.