Take a fresh look at your lifestyle.

కోడి పందాలపై ఏటా ప్రహసనమే !

  • పందాలకు వ్యతిరేకంగా పోలీసుల ప్రకటనలు
  • పందెం రాయుళ్లలో గుబులు ..అయినా ఆగని ఏర్పాట్లు

ఏలూరు,జనవరి5 : ఏటా సంక్రాంతి ముందు కోడిపందాల వ్యవహారం ఓ ప్రహసనంగా మారుతోంది.  కోడిపందాలకు వ్యతిరేకంగా పోలీసుల ప్రకటన నేపథ్యంలో కోడి పందేలు ఉంటాయా… ఉండవా..అనే సందేహాలు నెలకొంటున్నాయి. అధికారులు ఎన్నిచెప్పినా పందేలు ఆడితీరాల్సిందేనని పందెం రాయుళ్లు పంతం పట్టడం కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా పందేలకు బరులు సిద్దం చేస్తున్నారు. లోపాయకారి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పుడు పందాలపైనే అంతా ఆసక్తి చూపుతున్నారు. ఆంక్షలను కాదని ఎక్కడికక్కడ కొబ్బరి తోటల్లో రహస్య బరులు సిద్ధం చేస్తున్నారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. మరోపక్క ఎన్ని ఆంక్షలున్నా పందేలు జరగాల్సిందేని అధికార వైసీపీ నేతలు కూడా పట్టుదలగా ఉన్నారు.

పోలీసుల ఆదేశాలతో పందేలు జరగకపోతే అధికార పార్టీ పరువుపోతుందని ఇప్పటికే అనేకచోట్ల ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. కీలకమైన పందేలు జరగకపోతే నియోజకవర్గంలో తలెత్తు కోలేమని, ప్రతిపక్ష పార్టీలు హేళన చేస్తాయని ఎమ్మెల్యేల వద్ద మొరపెడుతున్నారు. దీంతో క్యాడర్‌ అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించకపోతే తమ పరపతి పోతుందనే భయం ఎమ్మెల్యేలను వెన్నాడుతోంది. మరోవైపు వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో పండగ మూడు రోజులు పందేలు ఆడుకోవడానికి ఇబ్బంది రాదని, అంతా తాము.. ఒకరకంగా చెప్పాలంటే సంక్రాంతి సందడి అందరికంటే ముందే మొదలయ్యేది తూర్పులోనే. అదీ కోనసీమలో అయితే ఇక చెప్పక్కర్లేదు. అయితే ఈసారి పండక్కి కోడిపందేలకు అనుమతి లేదని జిల్లా అధికారులు ఇప్పటికే  ప్రకటించారు.  కోడిపందేలపై నిషేధం ఉందని, ఇవి జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు, ఇతర అధికారులతో కూడిన బృందాలు నిఘా పెట్టి ఫోటోలు కూడా తీయించాలని చూస్తున్నారు. ఎక్కడికక్కడ పందేలకు బదులు సంప్రదాయ క్రీడలు ప్రోత్సహించాలంటూ సూచిస్తున్నారు. వాస్తవానికి గతేడాది సైతం జిల్లాలో కోడి పందేలకు అసలే మాత్రం అనుమతి లేదని పోలీసులు ముందునుంచీ విస్తృత ప్రచారం చేశారు. తీరా పండగ దగ్గరపడ్డాక మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడితో చూసీచూడనట్టు వదిలేశారు. ఇందుకోసం కోనసీమలో డివిజన్‌ ‌స్థాయి నుంచి స్టేషన్‌ ‌వరకు లక్షల్లో మామూళ్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరు  ఎన్ని చెప్పినా కిందిస్థాయిలో అధికార పార్టీ నేతలను కాదని వారికి వ్యతిరేకంగా వెళ్లడానికి తహశీల్దార్లు, ఎస్‌ఐలు సాహసించలేని పరిస్థితి. పండగ మూడు రోజులు కావలసింది తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరించడం షరామామూలుగా వస్తోంది. అయితే ఈసారి కూడా నిషేధాజ్ఞలు అంటూ ఎంత ప్రచారం చేసినా ఇబ్బందులు ఉండవనే ధీమా నేతలు, పందేరాయుళ్లలో కనిపిస్తోంది. అటు స్థానిక ఎమ్మెల్యేలు అంతా చూసుకుంటారనే ధీమాతో ఇప్పటికే పలువురు నేతల అనుచరులు తమ వారికి భరోసా ఇస్తున్నారు. దీంతో యథావిధిగా పందేలు జరుగుతాయనే ధీమాతో అనేకచోట్ల బరులు ముస్తాబవుతున్నాయి. అయితే మరో వరాం రోజుల్లో పండగ సందడి ఉండనుంది. అప్పటి వరకు పరిస్థితి ఎలా ఉంటందో చూడాలి.

Leave a Reply