Take a fresh look at your lifestyle.

అవసరం మేరకే టోకెన్లు జారీ చేయాలి

  • ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
  • నర్సాపూర్, రంగదాంపల్లిలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

కొనుగోళ్ల కేంద్రంలో ఉన్న బ్యాగులు, హమాలీల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అవసరం మేరకే టోకెన్లు జారీ చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట మున్సిపాలిటీ 8వ వార్డు నర్సాపూర్, 9వ వార్డుపరిధిలోని రంగదాంపల్లిలో గురువారం మధ్యాహ్నం వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రభుత్వం నిర్దేశించిన కనీస ప్రమాణాలను అనుసరించి, రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు.

ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు-ఏఈఓలు క్లస్టర్ పరిధిలో ఉండి ధాన్యం కోతలు క్రమపద్ధతిలో చేపట్టే విధంగా కూపన్లు అందజేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భౌతిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కేంద్రాల వద్ద టార్ఫాలిన్లు, తూకం యంత్రాలు, తేమను చూసే పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. స్థానికంగా ఉండే హమాలీలను వినియోగించుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడూ ట్యాబ్లో నమోదు చేయాల్సిన బాధ్యత ఏఈఓలదేనని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోళ్ల కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.

Leave a Reply