విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట అమలులోకి తీసుకొచ్చిన ఈ విధానాన్ని ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లకు అదనంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలలో ప్రవేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఉత్తర్వులలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలోనే అన్ని ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఎంతో మంది నిరుద్యోగులకు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు వినియోగించుకోనున్నారు.