Take a fresh look at your lifestyle.

అం‌తర్రాష్ట బస్సు సర్వీసుల ప్రారంభం ఇప్పట్లో లేనట్లేనా ?

ఉన్నతాధికారుల చర్చల వాయిదాతో ప్రయాణికుల నిరాశ:
‌తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించే విషయంపై సస్పెన్స్ ఇం‌కా కొనసాగుతోంది. కొరోనా వైరస్‌ ‌వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి నెల నుంచి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. అయితే, వైరస్‌ ‌క్రమంగా తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో అంతర్రాష్ట బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు రెండు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ముందుగా ఏపీకి బస్సు సర్వీసులను తక్కువ సంఖ్యలో నడపాలనీ, ఆ తరువాత పరిస్థితిని బట్టి మహారాష్ట్ర, ఒడిషా, కర్నాటక రాష్ట్రాలకు నడపాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య ఒక దఫా చర్చలు ముగిశాయి. గతవారం విజయవాడలో సమావేశమైన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు బస్సుల నిర్వహణపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. ముందుగా ఏ రూట్లలో బస్సులను నడపాలి ? ఎన్ని బస్సు)తో ప్రారంభించాలి ? అనే అంశాలపై మరోసారి చర్చించుకుని తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు.

ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల జరగాల్సిన చర్చలు జరగాల్సి ఉండగా, కొరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో ఇక వచ్చే వారం నుంచి బస్సుల్లో ప్రయాణించవచ్చని భావించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిరాశే ఎదురైంది. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కొరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో అంతర్రాష్ట బస్సు సర్వీసులను ఇప్పుడే పునరుద్ధరించడంపై సీఎం కేసీఆర్‌ ఆసక్తి చూపే అవకాశం లేదని టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే గురువారం ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడినట్లు సమాచారం. మళ్లీ ఈ చర్చలు ఎప్పుడు ప్రారంభించా)నే విషయంపై కూడా ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య స్పష్టమైన అభిప్రాయం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఇప్పట్లో ప్రారంభం కావడం కష్టమేనని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, కొరోనా విజృంభణ అధికంగా ఉన్న హైదరాబాద్‌ను మినహాయించి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఏపీ నుంచి బస్సులను నడిపేందుకు అనుమతిస్తే ఎలా ఉంటుందనే అంశంపై సైతం టీఎస్‌ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఏపీ నుంచి బస్సులను హైదరాబాద్‌కు నడిపితేనే ఆర్టీసీకి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని ఆ రాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నందున ఇప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల నిర్వహణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాగా, తెలంగాణకు అత్యధిక సంఖ్యలో బస్సులు నడిపే ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో సైతం కొరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఇప్పట్లో ఆ రాష్ట్రాలకు సైతం తెలంగాణ నుంచి బస్సులు నడిపే అవకాశాలు ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ఆ రాష్ట్రాల రాజధానులైన విజయవాడ, ముంబై, బెంగళూరు నగరాలలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply