Take a fresh look at your lifestyle.

జలజగడం రాజకీయ లబ్ధికోసమేనా ?

తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాల మధ్య ఇటీవల రగులుతున్న జలజగడం రాజకీయ లబ్ధికోసమేనంటున్నాయి ప్రతిపక్షాలు. విడిపోయిన రెండు రాష్ట్రాలు నిన్నటివరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నప్పుడు, ఇప్పుడు భేదాభిప్రాయాలు ఎందుకు పొడసూపుతున్నాయన్నది ప్రశ్నగా మిగులుతున్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని విబేధాలున్నా, వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాలు ప్రతీ విషయంలో సంయమనాన్ని పాటిస్తున్నట్లుగానే ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకు జలవివాదం మొదలైందన్న విషయంలో అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజల, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని గతంలో జగన్‌, ‌కెసిఆర్‌లు ముఖ్యమంత్రి హోదాల్లో బాహాటంగానే ప్రకటించిన విషయం తెలియందికాదు.

అవసరమైతే సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని ఇరు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు ఉమ్మడి ప్రాజెక్టులను చేపడతామన్న స్థాయిలో కలిసిన వారి మధ్య ఇప్పుడు అభిప్రాయభేదాలు ఎలా వొచ్చాయన్నది ఇరు రాష్ట్ర ప్రజల మధ్య నలుగుతున్న ప్రశ్న. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు బయటికి అలా ప్రవర్తిస్తున్నారేగాని, వారిద్దరి మధ్య మంచి సయోద్యనే ఉందన్న భావనను కొందరు వ్యక్తం చేస్తుండగా, హుజురాబాద్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెరాస నాయకత్వం కావాలని మరోసారి రాష్ట్రాల మధ్య పంచాయితీని రగిలించినట్లు చేసి, దాన్ని వోట్ల రూపంలో లబ్ది పొందాలని చూస్తున్నదన్నది విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని తెలంగాణ నేతలంటున్నమాట. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఆ పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులంతా ఒక్కసారే ఏపి ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు.

మంత్రులైతే గతంలో తెలంగాణ ఉద్యమకాలంలో వాడినంత ఘాటైన పదజాలాన్ని వాడటం ఒక విధంగా విచిత్ర పరిణామమే. జలదోపిడీలో వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి దోపిడీదారైతే ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి తండ్రికి మించిన తనయుడిగా గజదోపిడీకి పాల్పడుతున్నాడంటూ ఇటీవల మంత్రులు పువ్వాడ, ప్రశాంత్‌ ‌రెడ్డి పేర్కొనడం పెద్ద వివాదంగానే మారింది. ఈ వ్యాఖ్యలపై వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి అభిమానులు, కాంగ్రెస్‌ ‌నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వైస్‌ను అంతలేసి మాటలనడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినతర్వాత ఇవ్వాళ టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులన్నీ గతంలో డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి శంఖుస్థాపనలు చేసిన ప్రాజెక్టులేనని, అయితే కొన్నిటి పేరు మార్చి, వాటిని కొనసాగిస్తున్నంత మాత్రాన అవి టిఆర్‌ఎస్‌ ఆలోచనా ప్రాజెక్టులనడం సరైందికాదన్న వాదన వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎదుటి రాష్ట్రంలో చేపడుతున్న జల ప్రాజెక్టులన్నీ అక్రమమైన వేనంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్‌ ‌గ్రీన్‌ ‌ట్రిబునల్‌కు ఫిర్యాదులు చేయడంతోపాటు కోర్టులనుకూడా ఆశ్రయిస్తున్నాయి. ప్రభుత్వాల మధ్య నలుగుతున్న ఈ వివాదం ఇప్పుడు రైతుల మధ్య చేరుకుంది.

కృష్టా జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం నియమాలను ఉల్లంఘిస్తున్నదని ఏపికి చెందిన ఒకరైతు హైకోర్టుకు వెళ్ళడంతో ఈ విషయం మరింత జటిలంగా మారింది. జూన్‌ 20‌న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్‌ ‌చేయాలన్నది ఆ రైతు డిమాండ్‌. ‌విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో విడుదలవుతున్న నీటి కారణంగా ఏపి నష్టపోతున్నదన్నది ఆయన ఆరోపణ. దీంతో నిన్నటివరకు ప్రాజక్టులపై జరిగిన చర్చంతా ఇప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులవైపు మళ్ళింది. ఏపి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిలిపివేయాలన్న తెలంగాణ ప్రభుత్వాన్ని తిప్పికొడుతూ అనుమతులు లేకుండా నాగార్జున సాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టడాన్ని సవాల్‌ ‌చేస్తూ కృష్ణానది మేనేజ్‌మెంట్‌కు తాజాగా ఏపి ఫిర్యాదు చేసింది. కాగా వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టు చేపట్టిందే జలవిద్యుత్‌ ‌కోసమంటోన్న తెలంగాణ ప్రభుత్వం, జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టును ప్రారంభించిన సమయంలో ప్లానింగ్‌ ‌కమిషన్‌, ‌కృష్ణా మొదటి ట్రిబునల్‌ ‌పూర్తి స్థాయిలో విద్యుత్‌ ‌వినియోగానికి అనుమతిచ్చిందని వాదిస్తున్నది.

జలవిద్యుత్‌కు తప్ప మరే ఇతర అవసరాలకు ఈ నీటిని వినియోగించవద్దని ప్రణాళికా సంఘం చెప్పిన విషయాన్ని ఒక లేఖలో ఉటంకిస్తూ బోర్డుకు వివరించింది. కాగా గత నాలుగు రోజులుగా నాగార్జున సాగర్‌ ‌ప్రాజక్టుపై డ్రోన్లు తిరగటం, ఇరు రాష్ట్రాల పోలీసు భద్రత ఏర్పాటు చేయడంలాంటి సంఘటనలు ఒక విధంగా ఉద్రిక్తలను సృష్టిస్తున్నాయి.. ఇదిలా ఉంటే తెలంగాణలో ఉన్న ఆంధ్రుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాను తెలంగాణ ప్రభుత్వంతో వివాదం జోలికి వెళ్లడం లేదని తాజాగా ఏపి సిఎం జగన్‌ ‌మాట్లాడినట్లు వొచ్చిన కథనాలు టిఆర్‌ఎస్‌ ‌నేతలను రెచ్చగొట్టినట్లైంది. రాష్ట్రం ఏర్పడిన ఏడు ఏళ్ళుగా ఆంధ్రులెవరైనా తమకు ఇబ్బంది కలుగుతున్నట్లు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా అని స్వయంగా మంత్రులే జగన్‌పై విరుచుకు పడుతుండగా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి వొచ్చిన జగన్‌ , ‌రాయలసీమ లిఫ్ట్‌ను అసెంబ్లిలో జగన్‌ ‌ప్రకటించి, జిఓ విడుదలచేసినప్పుడు మాట్లాడని కెసిఆర్‌ ఇప్పుడు వాటిని అక్రమ ప్రాజెక్టులుగా ఇరువురూ పేర్కొంటున్నతీరుపై కాంగ్రెస్‌ ‌విరుచుకుపడుతున్నది. ఇదంతా ఇద్దరు ముఖ్యమంత్రులు చేస్తున్న డ్రామా అని, హుజురాబాద్‌ ఎన్నికలముందు కావాలనే ఈ వివాదానికి తెరాస తెరలేపిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply