Take a fresh look at your lifestyle.

బంగారు తెలంగాణాలో .. వలసజీవులకు చోటు లేదా..?

“కొరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ‌ముంబయిలోని తెలంగాణా బిడ్డలను ఎన్నో రకాల కష్టాలకు, అవమానాలకు గురిచేసింది. ఉత్తరాది రాష్ట్రాలు ముంబయిలో ఉంటున్న తమ రాష్ట్రాల వలస కార్మికులను ఎన్నో విధాలుగా ఆదుకున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం  వలస బిడ్డల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని సామాన్య తెలంగాణ ముంబైకర్‌ ‌వాపోతున్నాడు. తెలంగాణా నుండి ఎంతో ఆత్మీయంగా ఇతర రాష్ట్రాల కార్మికుల్ని శ్రామిక రైళ్ల ద్వారా ఆయా రాష్ట్రాలకు తరలించిన తెలంగాణా ప్రభుత్వం, మహారాష్ట్రలో ఉంటున్న తమ సొంత బిడ్డల్ని మాత్రం విస్మరించింది. అత్యవసర పరిస్థితుల్లో సొంత డబ్బులతో, తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతులు పొంది,  తెలంగాణ వెళ్ళే వలస జీవుల్ని అడ్డుకునేందుకు తాత్కాలిక అనుమతుల్ని కూడా రద్దు చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వలస శ్రామికుల్ని స్వరాష్ట్రానికి రప్పించడానికి తపనపడితే, తెలంగాణ  ప్రభుత్వం మాత్రం ముంబైలోని తెలంగాణ వలస జీవుల్ని ఏ రకంగా కూడా అక్కున చేర్చుకోలేకపోయింది.

sangeveni ravindhar
సంగెవేని రవీంద్ర,
ముంబై, సెల్‌ ‌నం: 99871 45310

ఎన్నెన్నో ఉద్యమాలు… ఎంతెంతో పోరాటం… ఎందరో వీరుల అమరత్వం..! చిట్టచివరికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. యావత్‌ ‌తెలంగాణ ప్రజల కలలు నెరవేరిన రోజు.. తెలంగాణ మట్టి పరిమళించి, పరవ శించిన రోజు.. తెలంగాణ రాష్ట్ర ప్రగతి పథానికి శ్రీకారం చుట్టిన రోజు.. తెలంగాణలోని ప్రతి బిడ్డ స్వాభిమానంతో తలెత్తుకున్న రోజు..! ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాపకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుగారి పాత్ర అపూర్వమైనది.. అద్వితీయమైనది. తెలంగాణ పోరాటంలో ఉద్యోగ సంఘాలు, కులసంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా పోరాటం సాగించినప్పటికీ, ఈ శ్రేణులందరినీ ఏకత్రాటిపై నిలిపి, తెలంగాణ ఉద్యమం పక్కదారి పట్టకుండా ఉద్యమస్ఫూర్తిని కాపాడింది మాత్రం కేసియారేనని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలుసిసలైన తెలంగాణత్వం ఏమిటో ప్రపంచానికి తెలిసివస్తోంది. తెలంగాణ ప్రజల స్వభావం, తెలంగాణ ప్రజల జీవనశైలి, తెలంగాణ ప్రజల నిజాయితీ, చిత్తశుద్ధి, కఠోర పరిశ్రమ, మేధస్సు.. దేశవ్యాప్తంగా నేడు జేజేలు అందుకుంటోంది. కాకతీయ, భగీరథ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులైతేనేం… డబుల్‌ ‌బెడ్‌ ‌రూంలు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ‌పెన్షన్‌లు, రైతు బంధు, రైతు బీమాలాంటి సంక్షేప పథకాలైతేనేం… తెలంగాణ ప్రజల్లో నూతన చైతన్యాన్ని, నూతన శక్తిని, సరికొత్త భరోసాని ప్రజ్వలింపచేస్తున్నాయి.. రహదారుల నిర్మాణం, హరితహారం, పంచాయితీల వికాసం, పరిశ్రమల ఏర్పాటు… ఇలా బహుముఖంగా అభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రం సాగుతోంది.

తెలంగాణా మలి దశ ఉద్యమ సమయంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు ఇంకా పూర్తిగా రైలు పట్టాలు ఎక్కలేకపోవచ్చు కానీ, ఒక సరికొత్త రాష్ట్రం ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా ప్రశాంతంగా ప్రగతిపథాన ప్రస్థానించడమనేది విశేషంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. పరిపాలన చేతకాదని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని ఎకసెక్కాలాడిన వారంతా నేడు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి ట్రేడ్‌మార్కుగా నిలిచిన కేసియార్‌గారిని రెండవ దఫా కూడా ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం వెనక అభివృద్ధి పథకాలే ప్రధాన పాత్ర పోషించాయి. పరిపాలనా దక్షత, ప్రజాకాంక్షల పట్ల అపారమైన అవగాహన కలిగిన కేసియార్‌గారు రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం పాటుపడుతున్నారనీ నేడు తెలంగాణ ప్రజానీకం పూర్తిగా విశ్వసిస్తున్నారనీ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలే తార్కాణం.తెలంగాణ ఉద్యమ సమయంలో ముంబయిలో కూడా పలు సంఘీభావ సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ పరాయి ప్రాంతంలో కూడా తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రతి చోటా ఏదో ఒక రకంగా ఉద్యమానికి మద్ధతుగా నిలిచారు. ముంబైలోని పలు పాత సంఘాలతో పాటు, నూతనంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన సంఘీభావ సంస్థలెన్నో ప్రజా చైతన్య సభల్ని నిర్వహించారు. ఊరేగింపులు చేసారు. ధర్నాలు చేశారు. ముంబయి నగరంలో తెలంగాణ ఉద్యమ ఘోషను ఎలుగెత్తి చాటారు. ముంబయిలోని ఆయా తెలుగు సంఘాలు తెలంగాణా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిసున్న ప్రముఖులెందరినో ముంబయికి ఆహ్వానించి ఇక్కడి ప్రజల్లో కూడా ఉద్యమస్ఫూర్తిని రగిలింపచేశారు. భారీ బహిరంగ సభలు కూడా ముంబయిలో నిర్వహించారు.

ఈ సభల్లో పాల్గొనడానికి ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిగారితో పాటు, ప్రొఫెసర్‌ ‌కోదండరాం, దేశపతి శ్రీనివాస్‌, ‌రసమయి బాలకిషన్‌, ‌చెరుకు సుధాకర్‌, ‌దేవీప్రసాద్‌రావు, కర్నే ప్రభాకర్‌, ‌వి.ప్రకాశ్‌, ‌మల్లేపల్లి లక్ష్మయ్య, జూలూరి గౌరీశంకర్‌, ‌నలిమెల భాస్కర్‌, ‌విమలక్క, పౌ సంధ్య లాంటి ప్రముఖులెందరో విచ్చేసారు. తెలంగాణ ఏర్పాటు కోసం నియమించిన శ్రీకృష్ణ కమిటీ చైర్మెన్‌గారిని ముంబైలో కలిసి, తెలంగాణాకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని కోరుతూ ఒక మెమోరండం సమర్పించడం ఆ రోజుల్లో చర్చనీయంగా మారింది. ముంబయిలోని అన్ని పార్టీల నాయకుల్ని కలిసి జాతీయ స్థాయిలో తెలంగాణాకు మద్దతు ఇవ్వాలని వినతి పత్రాలు సమర్పించారు. ముంబై నుండి తెలంగాణా వెళ్లే బస్సులను అడ్డుకొని రాస్తారోకోలు కూడా నిర్వహించారు. తెలంగాణాలో జరుగుతున్న ఉద్యమానికి దీటుగా ముంబైలో కూడా తెలంగాణా ఉద్యమాన్ని నిర్వహించారు. ముంబైలో జరిగిన తెలంగాణా ఉద్యమానికి తగినంత గుర్తింపు ఆనాడు లభించలేదు.. ఈనాడు కూడా గుర్తించడం లేదు. అయితే అప్పట్లో ముంబైకి వచ్చిన ప్రముఖులంతా ముంబైలో తెలంగాణ వలస బిడ్డల వెతలు, వ్యధలు, కష్టాలు, కన్నీళ్ళు గ్రహించారు. ‘తెలంగాణా ఏర్పడ్డ తర్వాత ఈ వలస బతుకుల్నుండి విముక్తి లభిస్తుందని..’ హామీ ఇచ్చారు. ‘వలస వచ్చిన తెలంగాణ బిడ్డలు సొంత రాష్ట్రానికి రావాలనుకుంటే వారందరికీ ఉపాధి మార్గాలు చూయిస్తామనీ..’ భరోసా కల్పించారు. ‘బొంబాయి, దుబాయి లాంటి వలస బతుకులు ఇక ఉండవని, స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక స్వాభిమానంగా సొంత రాష్ట్రంలోనే బతుకొచ్చని, బంగారు తెలంగాణాలో ప్రతి ఒక్కరి పెదవుల పై చిరునవ్వులు ఉంటాయనీ..’ నమ్మ బలికారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెలువడిన వెంటనే ఒక బృందం ముంబయి నుండి తెలంగాణకు ఉత్సాహంగా వెళ్ళి, కెసియార్‌గారిని కలిసి అభినందనలు, శుభాకాంక్షలు అందించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వి.ప్రకాశ్‌గారు మహారాష్ట్రలోని తెలంగాణా బిడ్డల కోసం సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తామనీ, ఈ విషయాన్ని కేసియార్‌గారికి వివరిస్తామనీ..’ హామీ కూడా ఇచ్చారు.

అంతేగాక, ఎన్నికల సందర్భంగా పలు ప్రముఖులు మాట్లాడుతూ, ‘అన్ని పార్టీల మానిఫెస్టోలో మహారాష్ట్ర వలస జీవులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తామని..’ అన్నారు.. కానీ, ఒక్క టీఆర్‌ఎస్‌ ‌పార్టీ మానిఫెస్టోలో ఒకే ఒక్క లైను తప్ప మరెవ్వరి మానిఫెస్టోలో వలస జీవుల గురించి ఒక్క అక్షరం కూడా కనిపించలేదు. రాష్ట్రం ఏర్పడింది.. కేసియార్‌గారి నేతృత్వంలో స్వాభిమాన తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పడింది. అయిదు సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ ఎన్నికలొచ్చాయి. మళ్ళీ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. కానీ, ముంబై వలస జీవులను అందరూ మరిచిపోయారు. నదుల అనుసంధానం గురించి కేసియార్‌గారి నేతృత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు ముంబైకి వచ్చినప్పుడు, ముంబై తెలంగాణా ప్రతినిధుల మండలి రాజ్‌భవన్‌లో కేసియార్‌గారిని కలిసి, తెలంగాణ వలసజీవుల సమస్యల గురించి మరోమారు వినతి పత్రం సమర్పించారు. కానీ, ఇంత వరకు ముంబయి వలసజీవుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ముంబైలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సాంస్కృతిక భవనం తప్ప తతిమ్మా అన్ని రాష్ట్రాలకు చెందిన భవనాలున్నాయి. తెలంగాణ సాంస్కృతిక భవనం ఇక్కడి తెలంగాణ ప్రజల స్వప్నం. అది వెంటనే ఏర్పాటు చేయాలి. మహారాష్ట్ర తెలుగు పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్రకు స్థానం కల్పించాలి. ముంబయి నుండి తెలంగాణాకు రైలు రవాణాసౌకర్యం సరిగ్గా లేదు. ప్రత్యేకంగా తెలంగాణా రైలును ఏర్పాటు చేయాలి.. మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజల సమస్యలపై ఒక ప్రత్యేక సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఆ సభా సంఘం ఇచ్చే నివేదకల ప్రకారం సంక్షేమ పథకాలు ప్రకటించాలి. బట్టల మిల్లులు మూతపడడం వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు తెలంగాణాలో డబల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు కెటాయించాలి.

వారికి ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ఎందరో తెలంగాణ బిడ్డలు కూడా అమరులయ్యారు. రాజకీయాల్లో కూడా తెలంగాణ బిడ్డలు ఉన్నత స్థానాలకు ఎదిగారు. మహారాష్ట్ర మొదటి శాసన సభాధిపతి శీలం సయాజీరావు తెలంగాణా మూలాలున్నవాడే..! పరిపాలనలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు సయాజీరావు కారణభూతుడయ్యారు. ఆ తర్వాత ఆయన పాండిచ్చేరి గవర్నర్‌గా కూడా విధులు నిర్వహించారు. అలాంటి తెలంగాణాకు చెందిన నాయకులు, మహారాష్ట్ర రాజకీయాల్ని మలుపుతిప్పిన ఘనాపాఠీలు ఎందరో ఉన్నారు. వారందరి విగ్రహాల్ని ట్యాంక్‌బండ్‌ ‌పై ప్రతిష్టించాలి. అన్నింటికంటే ప్రధానమైన సమస్య. విద్య..! శతాబ్దాలుగా మహారాష్ట్రలో ఉంటున్నప్పటికీ తెలంగాణా బిడ్డల్ని ఇంకా ఇక్కడ నాన్‌ ‌లోకల్‌గానే చూస్తున్నారు. స్థానిక మహారాష్ట్ర విద్యార్థులకు లభించే అవకాశాలు తెలంగాణా విద్యార్థులకు లభించడం లేదు. కుల దృవీకరణ పత్రాలు పొందడంలో చెప్పులు అరిగిపోతున్నాయి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని హైదరాబాద్‌ ‌లాంటి నగరాల్లో చదించాలనుకుంటే అక్కడ కూడా నాన్‌ ‌లోకలే అంటున్నారు. ఈ రకంగా తెలంగాణ బిడ్డలు అటూ ఇటూ నాన్‌లోకల్‌గానే మిగిలిపోతున్నారు.

కొరోనా కాలంలో బయటపడ్డ వివక్ష:
కొరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ‌ముంబయిలోని తెలంగాణా బిడ్డలను ఎన్నో రకాల కష్టాలకు, అవమానాలకు గురిచేసింది. ఉత్తరాది రాష్ట్రాలు ముంబయిలో ఉంటున్న తమ రాష్ట్రాల వలస కార్మికులను ఎన్నో విధాలుగా ఆదుకున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం వలస బిడ్డల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని సామాన్య తెలంగాణ ముంబైకర్‌ ‌వాపోతున్నాడు. తెలంగాణా నుండి ఎంతో ఆత్మీయంగా ఇతర రాష్ట్రాల కార్మికుల్ని శ్రామిక రైళ్ల ద్వారా ఆయా రాష్ట్రాలకు తరలించిన తెలంగాణా ప్రభుత్వం, మహారాష్ట్రలో ఉంటున్న తమ సొంత బిడ్డల్ని మాత్రం విస్మరించింది. అత్యవసర పరిస్థితుల్లో సొంత డబ్బులతో, తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతులు పొంది, తెలంగాణ వెళ్ళే వలస జీవుల్ని అడ్డుకునేందుకు తాత్కాలిక అనుమతుల్ని కూడా రద్దు చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వలస శ్రామికుల్ని స్వరాష్ట్రానికి రప్పించడానికి తపనపడితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముంబైలోని తెలంగాణ వలస జీవుల్ని ఏ రకంగా కూడా అక్కున చేర్చుకోలేకపోయింది. పైగా తెలంగాణ దారుల్ని కట్టుదిట్టం చేసింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత లభించిన అనుమతులతో తెలంగాణ చేరుకున్న వలస జీవుల్ని అధికారులు ఇంకో రకంగా వేధించడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా 14 రోజుల క్వారంటైన్‌ అమలులో ఉంటే ముంబయి తెలంగాణ వలసజీవులు కొందరికి ఆశ్చర్యకరంగా 28 రోజుల క్వారంటైన్‌ ‌విధించి వారిని హతాశుల్ని చేసే ప్రయత్నం చేశారు. కరోనా రావడమేమో కానీ, మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబయి తెలంగాణా వలసజీవుల హృదయాల్లో, తమ స్థానం ఏమిటో, తాము ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళమో అనే సందేహం మాత్రం స్థిరపడిపోయింది. బంగారు తెలంగా ణాలో వలస జీవులకు లభించే గౌరవం ఇదేనా..? స్వాభిమాన తెలంగాణాలో వలస బిడ్డలకు చోటు లేదా..?!.

Leave a Reply