Take a fresh look at your lifestyle.

వెంటిలేటర్ల కొరత ఏర్పడనుందా..?

ప్రపంచాన్నంతా ప్రళయాగ్నిలో ముంచివేస్తున్న మహమ్మారి కోవిడ్‌ 19 ‌బారినుండి కాపాడుకునేందుకు కావాల్సిన పరికరాల కొరత భారతదేశంలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అంగబలం, అర్థబలమున్న ఆగ్రరాజ్యమైన అమెరికాలాంటి దేశాలే ఈ కొరోనా వైరస్‌కు అతలాకుతలమవుతుండగా, అభివృద్ధి చెందుతున్న భారతదేశం పరిస్థితి ఏమిటన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తల కారణంగా వైరస్‌ ‌పుట్టిన చైనాతో పాటు, ఇటలీ, స్పెయిన్‌ ‌దేశాలతో పోలిస్తే భారతదేశం అదుపులోనే ఉందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌ ‌డౌన్‌ ‌సత్ఫలితాలిచ్చిందని, ఇతర దేశాలు కూడా మెచ్చుకుంటున్న తరుణంలో ఢిల్లీ నిజాముద్దీన్‌లాంటి సంఘటనలు ఇప్పుడు సంకటంలో పడేస్తున్నాయి. కొద్ది ఏమరుపాటు మరోసారి దేశాన్ని కుదిపివేసే దిశకు చేర్చింది. ఇలా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు ఎప్పుడు కొంపముంచుతాయోనన్న భయం మాత్రం దేశ ప్రజలను వెన్నాడుతూనే ఉంది. దానికి తగినట్లుగా జాన్‌నాటికి ఈ వైరస్‌ ‌దేశంలో మరింతగా విజృంభించే అవకాశాలున్నట్లు కొన్ని సంస్థల సర్వే చెబుతుండడం ఈ భయాన్ని ఇనుమడింపజేస్తున్నది. ప్రతిష్టాత్మకమైన జాన్స్ ‌హాప్కిన్స్ ‌యూనివర్సిటీ, సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసీజ్‌ ‌డైనమిక్స్, ఎకనమిక్స్ అం‌డ్‌ ‌పాలసీ(డిడిఇపి) తాజా అంచనాల ప్రకారం ఈ వ్యాధి జూన్‌నాటికి మరింతగా విస్తరించే అవకాశాలున్నట్లు అర్థమవుతున్నది. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న 21రోజుల లాక్‌డౌన్‌ ‌కోవిడ్‌ను అడ్డుకోలేదన్న అభిప్రాయాన్ని అది ప్రకటించింది.

ప్రభుత్వాలు ఎంతచెప్పినా సామాజిక దూరం పాటించకపోవడం, సహజంగానే దేశంలో వైద్య సదుపాయాల కొరత కారణంగా కోవిడ్‌19 ‌బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరగే అవకాశాలున్నట్లు ఆ అంచనాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా కనీసం ఒక మిలియన్‌ ‌వెంటిలేటర్లు అవసరమవుతాయన్నది కూడా వారు వేసిన అంచనా. అయితే ప్రస్తుతం దేశంలో 50వేల వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని, మేలోగా పదిలక్షల వెంటిలేటర్లు తయారుకావడం చాలా కష్టతరమైన విషయమేనన్న అభిప్రాయాన్ని ఆ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అనూహ్యంగా కొరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఈ వ్యాథి బారినపడిన ప్రతీ ఆరుగురిలో ఒకరు తీవ్ర అనారోగ్యబారిన పడుతున్నారు. వారికి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరమవుతున్నదంటూ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ) ‌వెల్లడించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే వెంటిలేటర్ల ఆవశ్యకత ఎంత ఉందో అర్థమవుతోంది. ఈ వ్యాధి లక్షణమే ఊపిరితిత్తులపై మొదటగా ప్రభావం చూపడంతో పాటు. శరీరంలో ఆక్సీజన్‌ ‌స్థాయి పడిపోయే విధంగా ఊపిరి తిత్తులను పాడుచేస్తుంది. అలాంటప్పుడు రోగి పూర్తిగా కృత్రిమ శ్వాసపైనే ఆధారపడాల్సి వస్తుంది. అంటే రోగి వ్యాధితో పోరాడే సమయాన్ని పెంచేందుకు వెంటిలేటర్‌ అత్యంతావశకం అన్నది స్పష్టమవుతున్నది. భారత దేశంలోని 130 కోట్ల జనాభాకు ఇప్పుడు దేశంలో ఉన్నది మాత్రం 50వేల వెంటిలేటర్లు మాత్రమే. అయితే దేశంలో లక్ష వెంటిలేటర్లున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ఓ మీడియా సమావేశంలో చెప్పడం గమనార్హం. ఏదిఏమైనా కొరోనా వైరస్‌ ‌కారణంగా ఇప్పుడు వీటి డిమాండ్‌ ‌పెరిగింది. ఇదే అదనుగా ఇవి తయారుచేసే సంస్థలు ఇంతకు క్రితం వీటిని విక్రయించే ధరలకు రెండు మూడింతలు పెంచి అమ్ముతున్నాయి.

- Advertisement -

ఈ వైరస్‌ ఎవరిపై ఎప్పుడు ప్రభావం చూపిస్తుందోనన్న భయంతో కొందరు ధనవంతులు తమకు అవసరం లేకున్నా ముందస్తుగానే వీటిని కొనుగోలుచేసి దాచిపెట్టుకోవడం వల్ల కూడా వీటి కొరత ఏర్పడుతున్నది. తాజాగా నిజాముద్దీన్‌ ‌ఘటన చూస్తుంటే దేశ వ్యాప్తంగా మరెన్నో కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వెంటిలేటర్ల ఆవశ్యకత ఎంతో ఉంది. జాన్స్ ‌హాప్కిన్స్ ‌విశ్వవిద్యాలయం, సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసీజ్‌ ‌డైనమిక్స్, ఎకనమిక్స్ పాలసి, ప్రిన్స్‌టన్‌ ‌విశ్వవిద్యాలయాల అంచనా ప్రకారం దేశంలో జూలై 2020 నాటికి ఒక మిలియన్‌ ‌వెంటిలేటర్స్ అవసరమని తెలుస్తున్నది. దేశంలో అతికష్టంగా ఇప్పటివరకు 5500 నుండి 5700 మధ్య వెంటిలేటర్ల ఉత్పత్తి జరుగుతున్నది. దేశం ఎదుర్కుంటున్న ఈ క్లిష్ట పరిస్థితిలో మద్దతుగా భారత పారిశ్రామిక రంగం ముందుకు వచ్చింది. కోవిడ్‌ 19 ‌కారణంగా గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా బంద్‌ ‌వాతావరణం కొనసాగుతుండడంతో పారిశ్రామికరంగమంతా కుదేలైంది. దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఈ పరిస్థితిలో కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చి బూరి విరాళాలు అందజేస్తున్నాయి.

దేశంలో అతిపెద్ద పరిశ్రమైన ఆటోరంగం పూర్తిగా స్థంభించిపోవడంతో ఆ రంగంతోపాటు మరికొంతమంది తాజాగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వైద్యపరికరాల తయారీకి సిద్ధమైనాయి. మారుతి, సుజికి, మహేంద్ర అండ్‌ ‌మహేంద్ర, హుండాయి, కళ్యాణి లాంటి సంస్థలు దేశానికి కావాల్సిన వెంటిలేటర్లను అత్యంత ఆధునికంగా, చౌకగా తయారుచేసేందుకు ఇప్పటికే ఉపక్రమించాయి. మాన్‌కైండ్‌ ‌ఫార్మాకంపెనీ ఆర్థిక సహాయంతోపాటు వెంటిలేటర్లు, ఔషధాలను అందించేందుకు సిద్ధమైంది. మహేంద్ర అండ్‌ ‌మహేంద్ర అతిచౌకగా 7500 రూపాయలకే వెంటిలేటర్ల తయారీకి ఉపక్రమించింది. భారత ప్రభుత్వం సాగిస్తున్న పోరుకు దేశీయ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఓ)కూడా తోడ్పాటునందిస్తోంది. ఒకేసారి ఒకరి కన్నా ఎక్కువ రోగులకు ఉపయోగపడే విధంగా వెంటిలేటర్స్‌ను అభివృద్ధిచేసేపనిలో పడిందా సంస్థ. అయితే తాజా అద్యయనాల ప్రకారం జూన్‌ ‌నాటికి వీటి ఉత్పత్తిని మూడు నాలుగింతలు పెంచితేగాని రాబోయే ఉపద్రవాన్ని దేశం ఎదుర్కునే పరిస్థితి కనిపించడంలేదు.

Leave a Reply