Take a fresh look at your lifestyle.

ఉచిత వ్యాక్సిన్‌ ‌ప్రకటన వెనుక రాజకీయమేనా?

ప్రధాని ఉచిత వ్యాక్సిన్‌ ‌ప్రకటన వెనుక రాజకీయముందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ పార్టీలు. దేశంలో రెండో వేవ్‌ ‌విస్తృతంగా వ్యాపించి వేల సంఖ్యలో జనం చనిపోతున్నా ఉచితం పైన ఆలోచన చేయని ప్రధాని ఒక్కసారే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ ఎత్తుగడే ఉందంటున్నాయి ఆ పక్షాలు. వ్యాక్సిన్‌ ‌విషయంలో చాలా గందరగోళమే ఏర్పడింది. ప్రజలకు వ్యాక్సిన్‌ ఇచ్చే విషయంలో మొదట కేంద్రీకృతం చేసిన కేంద్రం అ తర్వాత రాష్ట్రాలనుండి వొచ్చిన డిమాండ్‌ ‌మేరకు వికేంద్రీకరణ చేసింది. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్‌లో కొంత భాగం రాష్ట్రాలకు, మరికొంత భాగం ప్రైవేటుకు కేటాయించడం, వయస్సుల వారీ విధానం ప్రవేశపెట్టడం లాంటి చిక్కులతో ఈ వ్యాక్సినేషన్‌ ‌నిర్వహణ కొనసాగించడం సాధ్యం కాదని తొందరలోనే తెలుసుకున్న రాష్ట్రాలు నిర్వహణ బాధ్యత కేంద్రానికే వదిలివేశాయి. ఇదిలా ఉంటే రాష్ట్రాలను వ్యాక్సిన్‌ ‌కొనుగోలు చేయాలని కేంద్రం ఆదేశించడం, అందునా కేంద్రానికో ధర, రాష్ట్రాలకు ఒక ధర, ప్రైవేటు హాస్పిటల్స్ ‌కు మరో ధర నిర్ణయించడం కూడా కొంత గందరగోళ వాతావరణాన్ని కలిగించింది.

దీనికి తోడు కేంద్రం తాను కొనుగోలు చేసే వ్యాక్సిన్‌ ‌ధర కన్నా రెండింతల ధరను రాష్ట్రాలకు కేటాయించడం లాంటి విషయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావాన్ని చూపించింది. కేరళ, ఒడిస్సా రాష్ట్రాల ముఖ్యమంత్రులైతే కేంద్రమే మొత్తం కొనుగోలుచేసి రాష్ట్రాలకు సరఫరాచేయాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి. దేశంలో విపరీతంగా కొరోనా విస్తరిస్తున్న క్రమంలో కేంద్రం ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సిన్‌ అం‌దించాలన్న డిమాండ్‌ అన్ని రాష్ట్రాలనుండి వినిపించడం ప్రారంభమైంది. అప్పటికే ఉత్తర ప్రదేశ్‌, అసోం, మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌ ‌లాంటి రాష్ట్రాలు ప్రజలకు ఉచిత టీకాలు వేస్తామని ప్రకటించాయి కూడా. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే వరుసలో నిలిచింది. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం కేంద్రమే ఉచిత వ్యాక్సిన్‌ అం‌దించాలన్న డిమాండ్‌ ‌చేస్తూ, ఇందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేతాటిపై నిలువాలంటూ ముఖ్యమంత్రులందరికీ స్వయంగా సందేశాలు పంపించాడు.

ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో ఏకంగా దేశంలోని అత్యుత్తమ న్యాయస్థానం తలుపులు తట్టింది. దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిందేనంటూ ఆమె తన పిటీషన్‌లో డిమాండ్‌ ‌చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు హాస్పిటల్స్ ‌కు వేరవేరుగా ధరలను నిర్ణయించడం ఎంతమాత్రం సరైందికాదని, దేశ వ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉండాలని కూడా అమె అందులో కోరింది. వ్యాక్సిన్‌ను రాష్ట్రాలే కొనుగోలు చేయాలని కేంద్రం పేర్కొనడంపై, దీని వల్ల రాష్ట్రాల పై అధిక భారం పడుతుందని, ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్న రాష్ట్రాలు దీనివల్ల మరింత ఆర్థిక సంక్షోభంలో పడిపోతాయని, అందుకు ఈ ఆర్థిక భారాన్నంత కేంద్రమే భరించాలని ఆమె అందులో పేర్కొంది.

ఈ విషయంలో వివిధ రాజకీయ పక్షాలు కూడా కేంద్రానికి బాధ్యత గుర్తు చేశాయి. కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌గాంధీ ఈ విషయంలో ప్రధాని మోదీపై సీరియస్‌ ‌కామెంట్‌ ‌చేశారు. దేశ ప్రజలు ఈ కొత్త వైరస్‌తో అల్లాడిపోతున్నారు. లక్షలాదిమంది మృత్యువాత పడుతుంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది మన్‌కీ బాత్‌కాదు. జన్‌ ‌కీ బాత్‌ అం‌టూ, ఇప్పటికైనా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్న ప్రధాని మోదీ మౌనం వీడలేదు. రాష్ట్రాలు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. దీనికి తగినట్లు సుప్రీమ్కోర్టు కూడా దీన్ని సీరియస్‌గానే తీసుకుంది.

కొరోనాను కట్టడి చేయడం పై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న వ్యయం పై వివరాలు కోరింది. ఇంత తతంగం జరిగిన తర్వాత గాని మోదీ స్పందించలేదు. దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచిత వ్యాక్సిన్‌ అం‌దజేస్తుందని ఆయన చేసిన ప్రకటనతో ఒక పక్క రాష్ట్రాలు తాము నైతిక విజయాన్ని సాధించాయనుకుంటుంటే, త్వరలో దేశంలో రానున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ఈ ప్రకటన చేసి ఉంటారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో తొమ్మిది పది నెలల కాలంలో ఉత్తరప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రాకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. బహుషా ఫిబ్రవరి, మార్చ్‌ల్లో వీటికి ఎన్నికలు జరిగే అవకాశముంది. పంజాబ్‌ ‌సిఎం కూడా ఉచిత వ్యాక్సిన్‌ అం‌దించాలని కేంద్రాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఉత్తరప్రదేశ్‌ అప్పటికే ప్రకటించింది.

కాగా, దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఉత్తరప్రదేశ్‌ ‌పెద్దరాష్ట్రం. పైగా భాజపా అక్కడ అధికారంలో ఉంది. ఇప్పటికే అక్కడి సిఎంకు పిఎం మధ్య అభిప్రాయబేదాలున్నాయంటున్నారు. అక్కడి ప్రజలను సంతృప్తి పర్చాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా. అయితే ఇప్పటికైనా మోదీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు దేశ ప్రజలు హర్షించే అవకాశం ఏర్పడింది. మొదట్లో రాష్ట్రాల మీదకు నెట్టివేసినా, తర్వాత కాస్తా ఆలోచించి స్వామి కార్యం, స్వకార్యం జరుగుతుందని భావించే ప్రధాని మోదీ వెనక్కు తగ్గి ఉంటాడనుకుంటున్నారు.

Leave a Reply