Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొత్త రాజకీయపార్టీల ఆవశ్యకతుందా ?

తెలంగాణలో మరిన్ని  కొత్త రాజకీయ పార్టీలు రావాల్సిన అవశ్యకత ఉందా ? ఇప్పుడున్న పార్టీలకు ప్రజా రంజకంగా పాలించే సత్తా లేదా లాంటి ప్రశ్నలు గత కొంతకాలంగా ప్రజలు, రాజకీయ వర్గాల మధ్య నలుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానంతరం ఇక్కడి ప్రజలు ఊహించుకున్నట్లుగా స్వరాష్ట్ర ఫీలింగ్‌ ఏమాత్రం లేకుండా పోయిందా? ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన ఈతిబాధలు పునరావృతం అవుతున్నాయా?  రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళ కాలం పూర్తి అయినా  ప్రజలకు నేటి పాలకపార్టీ పైన ఇంకా నమ్మకం కలగడం లేదా? వారి మధ్య  వ్యాక్యూమ్‌ ఏర్పడిందా? అందుకు మరో రాజకీయపార్టీ అరంగేట్రం చేయాల్సిన ఆవశ్యకత ఉందా అంటే ఉందనే ఆంటున్నారు రాజకీయ మేధావి వర్గం.

తెలంగాణ ఏర్పడడానికి ముందు తెలంగాణ సాధనే ధ్యేయంగా అనేక రాజకీయ పార్టీలు, ఫోరంలు, సంఘాలు, సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆ విషయంలో తెలంగాణ అభిమానులు కాస్త చికాకుపడినా, కాళోజీ లాంటివారు మాత్రం అన్నిటినీ ఆహ్వానించాల్సిందేనన్నారు. అన్ని సంస్థలు తెలంగాణ సాధనే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు వాటిని వ్యతిరేకించాల్సిన అవసరంలేదన్నాడు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఇలాంటి మరికొన్ని పార్టీలు ప్రజల ముందుకు వొచ్చాయి. అయితే మొదటి నుంచి ఉద్యమపార్టీగా ఉంటూ, ఆ తర్వాత క్రమంలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే నిలదొక్కుకోగలిగింది. టిఆర్‌ఎస్‌ ‌పార్టీని ఆ హోదాకు తీసుకురావడంలో సమిధ లైనవారనేకులున్నారు.  వారిలో కొందరు కాలగర్భంలో కలిసిపోగా, మరికొందరు తెరమరుగైనారు.

వెనుక కొమ్ములొచ్చి ముందరి చెవులను వెక్కిరించినట్లు ఉద్యమ నేపథ్యం లేనివారికి పెద్దపీఠ వేయడంతో మిగిలిన ఒకరిద్దరు ఉద్యమకారులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్లు ఇటీవల తెలంగాణ రాజకీయాలను విశ్లేషిస్తే అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. అదేమని ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం వేటువేస్తున్నదన్న ఆరోపణలున్నాయి. కాగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తమ పాత్రను సమర్థవంతంగా పోషించడంలేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

దేశంలోలాగేనే  రాష్ట్రంలోనూ  కాంగ్రెస్‌ ‌చతికిలబడుతున్నది. రోజుకో సీనియర్‌ ‌నాయకుడిని కోల్పోతూ, దాదాపు అన్ని ఎన్నికల్లోకూడా విఫలమవుతున్నది.  ఇక బిజెపి అనుకున్నంతగా రాష్ట్రంలో రాజకీయ పట్టును సాధించుకోలేకపోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఏ ఉద్దేశ్యంతోనైతే రాష్ట్రాన్ని సాధించుకోవడ మైందో ఆ ఉద్దేశ్యాలను నెరవేర్చలేకపోతున్న పాలక పక్షాన్ని నిలదీయగల బలమైన ప్రతిపక్షం  లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆ అభిప్రాయమే రాష్ట్రంలో మరో కొత్త పార్టీకి వెసులుబాటును కలిగిస్తున్నదంటున్నారు.
ప్రజల ఈ  ఆవేదనను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తాజాగా ఇప్పటికే ఒకపార్టీ వేళ్ళూనుకోవడానికి సన్నద్దమైంది. అయితే అర్థశతాబ్దం కాలంగా ఏ ప్రాంతం వారి పెత్తనం వొద్దని తెలంగాణ ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారో ఆ ప్రాంతంవారి కనుసన్నల్లోనే ఈ కొత్త పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టబోతున్నది.

కరుడుగట్టిన  తెలంగాణ అభిమానులు ఎవ్వరూ దీన్ని ఆహ్వానించాలను కోకపోయినా, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకునే అవకాశాన్ని ఎవరూ కాదనలేరు. అయితే  రెండు దశాబ్ధాల మలిదశ పోరాటాన్ని మరిచిన కొందరు మాత్రం ఇంకా ఆవిర్భావం కానీ ఆ పార్టీకి జేజేలు పలుకుతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తెలంగాణ ఏర్పడిన ఈ ఏడేళ్ళలో పాలకపార్టీ  ప్రజల ఆశలు, ఆశయాలకు తగినట్లుగా పనిచేయడంలేదన్న ఆరోపణలు కొల్లలుగు ఉండడమే. ఈ విషయంలో  పాలకపార్టీని గట్టిగా నిలదీసే సత్తా  ఇక్కడున్న పార్టీలకు లేకపోవడమేనన్న అభిప్రాయాలు న్నాయి.  ఇదే విషయాన్ని తెలంగాణలో కొత్తగా  పార్టీని పెట్టబోతున్న డా.వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి కూతురు, ఏపి సిఎం వైఎస్‌ ‌జగన్‌ ‌సోదరి, వైఎస్‌ ‌షర్మిల ఇటీవల తెలంగాణలో పర్యటించిన సందర్భంగా చెబుతూ వొచ్చింది. ఇంతకాలంగా ఇక్కడ ప్రశ్నించే పార్టీలకు కరువేర్పడిందని, అందుకే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతకను తానవుతానంటోంది. మనమంతా కలిసి తెలంగాణ స్వాభిమానాన్ని కాపాడాల్సిన అవసరముందంటోంది.  నిజంగా ఇక్కడి ప్రజలకు స్వాభిమానం కరువయిందా.

అంటే ఈటల ఎపిసోడ్‌ అదే అంశాన్ని గుర్తు చేస్తోంది. తన స్వాభిమానంకోసం ఎంతకష్టాన్ని అయినా భరిస్తానంటున్నాడు ఈటల రాజేందర్‌. ‌తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజేందర్‌ ఆరుసార్లు ఎంఎల్‌ఏ, ‌గడచిన ఏడు సంవత్సరాలు మంత్రిగా కొనసాగిన వ్యక్తికి ఇప్పుడు స్వాభిమానం ఎందుకు గుర్తుకు వొచ్చిందన్నది ప్రశ్న. ఆయన మంత్రి పదవి ఊడిపోయినందుకా, లేక పాలకులు ఆరోపిస్తున్నట్లు ఆయనపై అవినీతి మచ్చ ఉందా అన్నది ఇంకా తేలాల్సిన అంశం.

అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఎంఎల్‌ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు, మంత్రుల్లోని  ఎక్కువ శాతం  మందిపై అవినీతి, అక్రమాల ఆరోపణలున్నాయి. అయినప్పటికీ ఈటల రాజేందర్‌పైనే ప్రభుత్వం బాణం ఎక్కుపెట్టింది. మిగతావారి విషయాన్ని పట్టించుకోకపోవడం పై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుండడం వేరే విషయం. దెబ్బ తిన్న స్వాభిమానంతో ఈటల ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నాడా అన్నదిప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఒకవేళ ఈటల పార్టీ అవిర్భవిస్తే  మరో పరాయి పార్టీతో అవసరం లేకుండా ఇప్పటివరకు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యాక్యూమ్‌ ‌ఫిల్‌ అవుతుందా లేక బంగారు తెలంగాణ కోసం మరేదైనా పార్టీ పుట్టుకురావల్సిందేనా అన్నది కూడా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది.

Leave a Reply