Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ఉం‌టుందా? లేదా ?

రాష్ట్రంలో పెరుగుతున్నకొరోనా పాజిటివ్‌ ‌కేసుల నేపద్యంలో మరోసారి లాక్‌డౌన్‌ ‌పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల్లో క్యాబినెట్‌ ‌సమావేశంలో దీనిపై సరైన నిర్ణయం తీసుకోనుందని తెలుస్తున్నది. ప్రభుత్వం వద్ద ఇప్పటికే వేల సంఖ్యలో కొరోనా సాంపిల్స్ ‌పరీక్షలకు సిద్దంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్ట్‌ల సేకరణ కోసం సాంపిల్స్‌ సేకరణ రెండు రోజులు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, నాలుగు రోజులైనా తిరిగి సాంపిల్స్‌ను తీసుకోకపోవడంతో అనుమానితులు ప్రైవేటు హాస్పిటల్స్ లో పరీక్షలు ‌చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. ప్రతీరోజు వందలు, వేల సంఖ్యలో టెస్ట్‌ కోసం వొస్తున్నారు. అయితే దీన్ని ప్రైవేటు హాస్పిటల్స్ బాగా సొమ్ముచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వొస్తున్నాయి. ఒక వైపు టెస్ట్ ‌ఛార్జీలు విపరీతంగా పెంచడం ఒకటైతే, నెగటివ్‌ ‌వొచ్చినా కొందరికి పాజిటివ్‌ అని తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి . ఏదిఏమైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పాజిటివ్‌ ‌కేసులసంఖ్య రాష్ట్రంలో విపరీతంగా పెరిగిందనడంలో ఏమాత్రం సందేహంలేదు. ఇదే విషయాన్ని తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ ‌మీడియా సమావేశంలోకూడా ఒప్పుకున్నారు. ఇది కేవలం మన రాష్ట్రంలోనే కాదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలోనే పాజిటివ్‌ ‌కేసులిప్పుడు అయిదున్నర లక్షలు చేరుకున్నాయి. రాష్ట్రాల, ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దశల వారిగా లాక్‌డౌన్‌ను అన్ని రాష్ట్రాలు తొలగిస్తూవొచ్చాయి. ఈ తొలగింపే ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో దాదాపు మెజార్టీ రాష్ట్రాలు తిరిగి లాక్‌డౌన్‌ను విధించాలనే నిర్ణయానికి వొచ్చాయి. అదికూడా మొదట్లో విధించినట్లు కఠినంగా అమలు చేయాలని బావిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగించాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌ను తీసుకుంటే, ఆ రాష్ట్రంలో జూలై 31 వరకు పొడిగించారు. అయితే వైరస్‌ ‌ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో ఎప్పుడో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అసోంలో జూలై 12 వరకు, ఝార్ఖండ్‌, ‌మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా జూలై31 వరకు, కర్నాటక జూలై పదివరకు ఇలా ఒక్కోరాష్ట్రం ఆ రాష్ట్రంలో వెలుగుచూస్తున్న పాజిటివ్‌ ‌కేసులనుబట్టి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయి. అలాగే తెలంగాణలోకూడా ఇటీవల కాలంలో అంచనాకు అందనంత వేగంగా పాజిటివ్‌కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.. రాష్ట్ర రాజధాని పరిధిలోనే అదికంగా నమోదవుతున్నాయి. జిహెచ్‌ఎం‌సీ, రంగారెడ్డి జిల్లాలో గత కొద్ది రోజులుగా చాలా కేసులు వెలుగు చూస్తున్నాయి.

వైరస్‌ ‌పెరుగుతున్న వేగానికి స్థానికులు భయపడిపోతున్నారు. ప్రజలే స్వచ్చందంగా లాక్‌డౌన్‌ ‌పాటించేందుకు సిద్దపడ్డారు నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రాల్లో వ్యాపారస్తులే స్వచ్చందంగా పదిహేను రోజులపాటు తమ లావాదేవీలను మూసేసుకోవడానికి సిద్దపడ్డారంటే ఎంత తీవ్రంగా వైరస్‌ ‌వ్యాపిస్తుందన్నది అర్థమవుతున్నది. కొన్ని ప్రాంతాల్లో కేవలం మధ్యాహ్నంవరకే వ్యాపారాలను సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో మరోమారు లాక్‌డౌన్‌ ‌విధించాలని పలువురు డిమాండ్‌ ‌చేస్తున్నారు. రాష్ట్రంలోని వైద్యశాఖనుండి కూడా కనీసం పదిహేను రోజుల పాటైనా లాక్‌డౌన్‌ ‌విధించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. ముఖ్యంగా రాజధానిలో లాక్‌డౌన్‌ ‌విధించడమంటే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పే. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్నంతా అప్రమత్తం చేయాల్సి వొస్తుంది. గతంలోలాగా పోలీసులను సిద్దపర్చాలి. దీనిపై ప్రభుత్వం ఉన్నతాధికారులు, క్యాబినెట్‌ ‌మంత్రులతో సమాలోచనలు జరుపుతున్నది.. పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్నా, జాతీయ స్థాయిలో పెరుగుతున్నంతగా రాష్ట్రంలో మరణాల సంఖ్య లేకపోవడంతో లాక్‌డౌన్‌ ‌విధింపు అంత అవసరమా అన్న ఆలోచనలోకూడా ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతోంది. దీనికి తోడు ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నందున పాజిటివ్‌ ‌కేసులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుండడంతో కూడా లాక్‌డౌన్‌ అవసరం లేకపోవచ్చన్న అభిప్రాయంకూడా లేకపోలేదు. కాని పరిస్థితిలో కేవలం జిహెచ్‌ఎం‌సీ పరిధిలో మాత్రమే విధించవచ్చనుకుంటున్నారు. అయితే వైరస్‌ ‌నివారణకు లాక్‌డౌన్‌ ఒకటే నివారణ కాదని, అది కొద్దిరోజులపాటు కేసులను వాయిదా వేయడానికే పనికి వొస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి దశ లాక్‌డౌన్‌లోనే ఇంటింట పరీక్షలను అధికంచేసిఉన్నట్లు అయితే పాజిటివ్‌ ‌కేసులు చాలావరకు తగ్గేవంటున్నారు. పరీక్షల సంఖ్యను పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా, పరీక్షలకోసం రోజూ వేల సంఖ్యలో వొస్తున్న జనానికి సరిపోయినంత ఏర్పాట్లను చేయకపోవడంకూడా ప్రధాన లోపంగా చెబుతున్నారు. పరీక్షల వేగాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం పెంచగలిగితే వైరస్‌ ‌వేగాన్ని అధిగమించే అవకాశాలుంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!