Take a fresh look at your lifestyle.

గ్రేటర్ ‌పరిధిలో లాక్‌డౌన్‌ ‌లేనట్లేనా..?

హైదరాబాద్‌ ‌నగరంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలకు కేంద్రాలుగా ఉన్న బేగంబజార్‌, ‌చార్మినార్‌, ‌సికింద్రాబాద్‌, ‌రాణిగంజ్‌, ‌ప్యారడైజ్‌ ‌ప్రాంతాలలో వైరస్‌ ‌తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా స్థానిక వ్యాపారులే ఈనెల 5 వరకు స్వచ్చందంగా లాక్‌డౌన్‌ ‌విధించుకున్నారు. మిగతా చోట్ల వైరస్‌ ‌ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోగా సామూహిక వ్యాప్తి జరిగే అవకాశాలు అంతగా  లేవు. దీంతో గ్రేటర్‌ ‌పరిధిలో లాక్‌డౌన్‌ ‌విధిస్తే మళ్లీ జనజీవనం అస్తవ్యస్థంగా మారడంతో పాటు కొరోనా ప్రభావం నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని సీఎం కేసీఆర్‌ ‌భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయంలో దాదాపు 60 శాతానికి పైగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నుంచే వస్తుంది.

  • ఆర్థిక పరిస్థితి మళ్లీ దిగజారుతుందనే ఆందోళన
  • కంటైన్‌మెంట్‌ ‌జోన్ల కట్టడితోనే సరి

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో లాక్‌డౌన్‌ ‌మళ్లీ విధించే ఆలోచన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్లుగా కనిపిస్తోంది. గ్రేటర్‌ ‌పరిధిలోని హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మేడ్చల్‌ ‌జిల్లాలలో ప్రతీ రోజూ భారీ సంఖ్యలో కొరోనా కేసులు నమోదవుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ ‌తప్పదనే ప్రచారం గత నాలుగైదు రోజులుగా జరుగుతోంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ సైతం వైరస్‌ ‌కట్టడికి లాక్‌డౌన్‌ ‌తప్పనిసరి అని సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చింది. అయితే, లాక్‌డౌన్‌ ‌మళ్లీ విధించడమనేది చిన్న విషయం కాదనీ, ఇది లోతుగా ఆలోచించాల్సిన అంశమనీ ఇందుకు ప్రజలను మరోసారి మానసికంగా సిద్ధం చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ ‌విధించడానికి ముందుగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించాలనీ, ఆర్థిక పరిస్థితితో పాటు ఇతర అన్ని రకాల అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం చెప్పారు. అయితే, జూన్‌ 30‌తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 2 ‌ముగియడంతో పాటు అదే రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో ఇక లాక్‌డౌన్‌ల దశ ముగిసిందనీ, భవిష్యత్తులో అన్‌లాక్‌డౌన్‌లే ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు వైరస్‌ ‌వ్యాప్తి దృష్ట్యా ఆయా రాష్ట్రాలే నియంత్రణ చర్యలు పాటించాలనీ, స్థానిక పరిస్థితులను బట్టి అక్కడి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే జనజీవనం కుదుట పడుతోంది. కొరోనా వైరస్‌ ‌నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు సైతం ఆదాయం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలకు కేంద్రాలుగా ఉన్న బేగంబజార్‌, ‌చార్మినార్‌, ‌సికింద్రాబాద్‌, ‌రాణిగంజ్‌, ‌ప్యారడైజ్‌ ‌ప్రాంతాలలో వైరస్‌ ‌తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా స్థానిక వ్యాపారులే ఈనెల 5 వరకు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ‌విధించుకున్నారు. మిగతా చోట్ల వైరస్‌ ‌ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోగా సామూహిక వ్యాప్తి జరిగే అవకాశాలు అంతగా లేవు. దీంతో గ్రేటర్‌ ‌పరిధిలో లాక్‌డౌన్‌ ‌విధిస్తే మళ్లీ జనజీవనం అస్తవ్యస్థంగా మారడంతో పాటు కొరోనా ప్రభావం నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని సీఎం కేసీఆర్‌ ‌భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయంలో దాదాపు 60 శాతానికి పైగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నుంచే వస్తుంది. లాక్‌డౌన్‌ ‌విధిస్తే వలస కార్మికులకు షెల్టర్ల ఏర్పాటు, నిరుపేదలకు ఉచిత రేషన్‌, ‌నగదు పంపిణీ వంటి సమస్యలన్నీ మళ్లీ తెరపైకి వస్తాయనీ, ఇందులో భాగంగానే అన్‌లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే కంటైన్మెంట్‌ ‌జోన్లలో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే కంటైన్‌మెంట్‌ ‌జోన్లకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన నిబంధనలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేయడం గమనార్హం.

సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని హోం క్వారంటైన్‌ ‌చేయడం, వైరస్‌ ‌లక్షణాలు అధికంగా ఉన్న వారిని దవాఖానలకు తరలించి వైద్య చికిత్సలు అందించడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా గ్రేటర్‌ ‌పరిధిలో కొరోనా విస్తరణను అడ్డుకోవచ్చని సీఎం కేసీఆర్‌ ‌భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, గతంలో సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయం ముఖ్యం కాదని ప్రకటించిన విషయాన్ని పరిగణనలోనికి తీసుకుంటే గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో తిరిగి లాక్‌డౌన్‌ ‌విధించే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా ప్రతీ రోజూ దాదాపు 900కు పైగా కేసులు నమోదవుతుండగా, ఒక్క గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలోనే 800 పై చిలుకు ఉండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. దేశంలో కొరోనా వైరస్‌ ‌ప్రభావం తీవ్రంగా ఉన్న మెట్రో నగరాలైన ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో మరో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ ‌విధిస్తూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకవేళ సీఎం కేసీఆర్‌ ‌సైతం గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో కొరోనా వైరస్‌ ‌నియంత్రణకు లాక్‌డౌన్‌ ‌మినహా మరో మార్గం లేదని భావించిన పక్షంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన పక్షంలో సీఎం కేసీఆర్‌ ‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో లాక్‌డౌన్‌ ‌విధించడానికి సుముఖంగా ఉన్నట్లు భావించాలని పరీశీలకులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply