Take a fresh look at your lifestyle.

అక్కడ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలు కాదా ?

  • పాతబస్తీలో యధేచ్చగా నిబంధనల ఉల్లంఘన
  • గుంపులు గుంపులుగా రోడ్లపైకి…పోలీసులు అడ్డుకుంటే బెదిరింపులు
  • ఎంపీ వత్తాసుతో ఏమీ చేయలేని స్థితిలో పోలీసు యంత్రాంగం

రాష్ట్రాన్ని కొరోనా రక్కసి కబళించి వేస్తున్నది. అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ ‌వేగంగా వ్యాప్తి చెందుతూ గంటల వ్యవధిలో ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నది. దీని బారి నుంచి కాపాడుకోవాలంటే ఇళ్లలో ఉండటం ఒక్కటే మార్గమని, ఎవరూ బయటికి రావొద్దనీ స్వయంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ ‌చేస్తున్న విజ్ఞప్తులు….విధించిన కర్ఫ్యూ లాక్‌డౌన్‌ ‌నిబంధనలు హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రజలకు ఏమాత్రం పట్టడం లేదు. యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తూ వైరస్‌ ‌వ్యాప్తికి కారణమవుతున్నారు. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ‌నిబంధనలను బేఖాతరు చేస్తూ గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. అడ్డుకుంటున్న పోలీసులనే బెదిరిస్తూ సక్రమంగా వారి డ్యూటీని సైతం చేసుకోనివ్వడం లేదు. కరోనా నేపథ్యంలో పాతబస్తీలో నెలకొన్న పరిస్థితి ఇది. ముఖ్యంగా గత నెలలో దేశ రాజధాని దిల్లీలోని మర్కజ్‌కు పాతబస్తీ నుంచి వెళ్లి వచ్చిన వారిలో అధిక శాతం మందికి నిర్వహించిన పరీక్షలలో కొరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ప్రభుత్వం పాతబస్తీ ప్రాంతంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రజలు ఎవరూ బయటికి రాకుండా లాక్‌డౌన్‌, ‌కర్ఫ్యూ వంటి కఠిన నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అయితే, ఒకరితో మరొకరికి వేగంగా సంక్రమించే లక్షణం ఉన్న ఈ వైరస్‌ను పాతబస్తీ ప్రజలు ఏమాత్రం లెక్క చేయడం లేదు.

స్థానిక ప్రజలు యధావిధిగా తమ వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కఠినతర నిబంధనలు ఏమాత్రం లెక్కచేయడకుండా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. చార్మినార్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు సమీపంలోనే కొద్ది రోజుల క్రితం మహిళలు గుంపులు గుంపులుగా గుమికూడటంలో పోలీసులు వారిపై లాఠీచార్జికి ప్రయత్నించారు. దీంతో ఆ మహిళలంతా ఒక్కసారిగా పోలీసులపై కి తిరగబడ్డారు. దీంతో పోలీసుల చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. అలాగే, స్థానిక యువకులు సైతం తమ ద్విచక్రవాహనాలపై ఒకేసారి రోడ్లపైకి వస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘటనలు రోజూ చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు వారిని ఏమైనా అంటే ఎంపీకో, ఎమ్మెల్యేకో ఫోన్లు చేయడం, వారు తమ వారే వదిలిపెట్టాలని సదరు నేతలు పోలీసులకు హుకుం జారీ చేయడం వంటి చర్యలు పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ వ్యవహారం కాస్తా స్థానిక ఎంపీ దృష్టికి రావడంతో ఆయన ప్రజాప్రతినిధిననే బాధ్యత సైతం మరచి నిబంధనలు ఉల్లంఘించిన మహిళలకే వత్తాసు పలకడం గమనార్హం. పైగా కర్ఫ్యూ, నిబంధనలు పాటించని మహిళలను గట్టిగా హెచ్చరించిన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

- Advertisement -

స్థానిక ఎంపీ వత్తాసుతో ఇప్పటికీ శుక్రవారం పూట సామూహిక ప్రార్థనలు, ప్రజలు రోడ్లపైకి గుంపులు గుంపులుగా ఒకేసారి రావడం వంటి సంఘటనలు పాతబస్తీలో ప్రతీ రోజూ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చార్మినార్‌, ‌మాదన్నపేట పోలీస్‌ ‌స్టేషన్ల పరిధిలో పాన్‌ ‌దుకాణాలను స్థానిక వ్యాపారులు యధావిధిగా తెరిచే ఉంచుతున్నారు. ఈ దుకాణాలను మూసివేయాలని పోలీసులు హెచ్చరించిన సమయంలో మూసివేయడం తిరిగి కొద్ది సేపటికే తెరవడం ఇక్కడ మామూలు విషయంగా మారింది. అలాగ్లే ప్లంబర్లు, కరంటు మెకానిక్‌లు, ద్విచక్ర వాహనాల మెకానిక్‌లు కూడా తమ దుకాణాలను యధావిధిగా తెరుస్తూ ప్రభుత్వాన్ని, పోలీసులను అపహాస్యం చేస్తున్నారు.. చార్మినార్‌కు అతి సమీపంలోనే ఉన్న బాబానగర్‌ ‌ప్రాంతాన్ని ప్రభుత్వం కంటైన్మెంట్‌ ‌కేంద్రంగా గుర్తించింది. ఈ ప్రాంతం నుంచి ఎవరినీ బయటకు వెళ్లకుండా, బయటి వారిని ఇక్కడికి రానివ్వకుండా చర్యలు చేపట్టింది. రోడ్డుకు ఇరు వైపులా బారికేడ్లను అమర్చి ప్రజలు రోడ్లపైకి రాకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ఏదో సాకుతో స్థానికులు ముఖ్యంగా మహిళలు రోడ్లపైకి రావడం నిత్యకృత్యంగా మారింది.

అసలే పాతబస్తీలో జనసమ్మర్థం ఎక్కువగా ఉంటుంది. ఇరుకుగా ఉండే రోడ్లపై ఒకేసారి భారీ సంఖ్యలో వాహనాలు వస్తుండటం పోలీసులు చేతులెత్తేసే పరిస్థితి నెలకొంటున్నది. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘించిన ప్రజలపై కఠిన చర్యలు తీసుకుందామని ప్రయత్నిస్తున్న పోలీసులకు స్థానిక ఎంపీ లేదా ఎమ్మెల్యే ఫోన్‌ ‌చేసి వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు తమ పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల జోక్యం కారణంగా వారు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, వచ్చే నెలలో రంజాన్‌ ‌మాసం ప్రారంభం కానుండటంతో పాతబస్తీలో ముందుముందు పరిస్థితులను ఏ విధంగా అదుపు చేయాలో అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. రంజాన్‌ ‌మాసంలో పాతబస్తీలో రోడ్లపైనే సామూహిక ప్రార్థనలు నిర్వహించడం సర్వసాధారణ విషయం. కొరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఈనెల 30 వరకూ పొడిగించింది. ఒకవేళ పరిస్థితి అప్పటి వరకూ అదుపులోకి రాని పక్షంలో పాతబస్తీలో రోడ్లపైకి వచ్చే ప్రజలను ఏ విధంగా ఆపాలో తెలియని పరిస్థితిలో పోలీసులు సతమతమవుతున్నారు.

Leave a Reply