Take a fresh look at your lifestyle.

ఫ్రంట్‌ ఇక బ్యాకేనా ?

సెమీ ఫైనల్‌గా భావిస్తూ వొచ్చిన అయిదు రాష్ట్రాల ఫలితాల తర్వాత బిజెపి, కాంగ్రేసేతర ఫ్రంట్‌ ఏర్పాటు అనుమానస్పదంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీని గద్దె దించాలని కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇంకా సమాలోచన దశలోనే ఉండగా, బిజెపి మాత్రం మరింతగా వేళ్ళూను కుంటోందనడానికి తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్‌, ‌బిజెపియేతర కూటమి ఎలా ఉండాలి? సారథ్యం ఎవరు వహిస్తారు అన్న విషయాల్లోనే ఇంకా స్పష్టతలేదు. కూటమి కట్టాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీల నేతలందరూ బహిరంగంగా తమ అభిప్రాయాన్ని చెప్పకపోయినా ఎవరికి వారు తామే కూటమికి సారథ్యం వహించాలన్న అభిప్రాయాలతో ఉన్నట్లు వెలువడుతున్న వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా అడుగు ముందుకు వేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండు అడుగుల ముందున్నానన్నట్లుగా తానే స్యయంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం అయిన విషయం తెలిసిందే.

మొత్తంమీద ఈ కలయికలో సారథ్యం విషయమెలా ఉన్నా ఫ్రంట్‌ ఏర్పాటుకు దాదాపు అందరు సుముఖతగానే ఉన్నట్లుగానే వాతావరణం కనిపించింది. అయితే తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూటమి కట్టాలనుకున్న వారిని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. అయిదింటిలో నాలుగు రాష్ట్రాల్లో బిజెపినే గెలుచుకోవడం, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ బంపర్‌ ‌మెజార్టీని సాధించుకోవడం ఒకింత ఆలోచింపజేసే పరిణామాలు. వాస్తవంగా ఈ ఎన్నికలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనంటూ మొదటి నుండీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందులో యుపి ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక భూమికను పోషిస్తాయన్న భావన అందరిలో ఉంది. ఇక్కడ అధికారంలోకి ఏపార్టీ వొస్తే కేంద్రంలో కూడా అదే పార్టీ ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి. అలాగే ఒకేపార్టీ రెండు సార్లు గెలవడమన్నది ఇక్కడ లేదు. అలాంటప్పుడు ఈసారి దూకుడుగా ముందుకు పోతున్న సమాజ్‌వాది పార్టీకే ప్రజలు పట్టం కడుతారనుకున్నారు. కాని ఫలితాలు మరో విధంగా వెలువడ్డాయి. బిజెపికే మరో ఆఫర్‌ను ఇచ్చారు ఇక్కడి ప్రజలు. అయితే గత అయిదు సంవత్సరాల్లో బిజెపి ఇక్కడ సమర్థవంతమైన పాలన చేయడంవల్లే మరోసారి ఆ పార్టీని గెలిపించారనుకోవడం పొరపాటేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయినప్పటికీ యోగికే మరోసారి అధికారాన్ని అప్పగించారు. దీంతో కూటమి ఏర్పాటులో ఉత్సుకతను ప్రదర్శిస్తున్న సమాజ్‌వాది పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఎస్పీకి మద్దతు పలికినా లాభం లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే గతంలోనే ఒకసారి ఫ్రంట్‌ ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఒక విడుత ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో వివిధ అంశాలపైన వొస్తున్న విబేధాలతో మరోసారి ఆయన్ను కార్యోన్ముఖుడిని చేసింది. దాంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్‌ ‌థాకరే, నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ చీఫ్‌ ‌శరద్‌ ‌పవార్‌, ‌జార?ండ్‌ ‌ముక్తిమోర్చ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కూడా అయిన హేమంత్‌ ‌సోరెన్‌తో తాజాగా భేటీ అయ్యారు. దిల్లీ వెళ్ళి వివిధ రాజకీయ నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు. అంతకు ముందే జనతాదళ్‌ అధినేత తేజస్వీ యాదవ్‌, ‌కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లను కలుసుకున్నారు. హైదరాబాద్‌లో వామపక్ష నేతలను స్వయంగా ఆహ్వానించి వారితో చర్చలు జరిపారు. రానున్న రోజుల్లో బిజెపిని ప్రజలు విశ్వసించరన్న అభిప్రాయం కెసిఆర్‌లో బలంగా ఉంది. అందుకే జార?ండ్‌ ‌వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇక బిజెపిని తరిమేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. కాని అయిదు రాష్ట్రాల ఫలితాలు వెలువడిన తీరు ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనుకున్న వారికి ఒక విధంగా షాక్‌ ‌లాంటిదే.

నిన్నటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, దూసుకువస్తున్న బిజెపిని కాదని పంజాబ్‌ ‌ప్రజలు ఆప్‌ ‌పార్టీని ఎన్నుకున్నారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడెనిమిది నెలలపాటు పోరాడిన పంజాబ్‌ ‌రైతులు, అటు కాంగ్రెస్‌ను కూడా గెలిపించలేదు. ఇంతవరకు దిల్లీకే పరిమితమైన ఆప్‌ ‌పార్టీకి పట్టం కట్టడం ద్వారా ఇప్పుడా పార్టీ ప్రాంతీయత వీడి జాతీయ పార్టీగా ఆవిర్భవించబోతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో ఆ పార్టీకి వైరం ఉన్నప్పటికీ థర్డ్ ‌ఫ్రంట్‌ ‌పట్ల ఆ పార్టీకి పెద్దగా ఆసక్తి లేదు. ఈ పరిణామాల దృష్ట్యా కెసిఆర్‌ ‌తాను కలలు కంటున్న ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ఇంకా ముందుకు వెళ్తారా లేక ఆ విషయంలో తనతో కలిసి వొచ్చే ప్రాంతీయ పార్టీలతో పునరాలోచన చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే నాలుగు రాష్ట్రాల గెలుపుతో బిజెపికి మరింత ఉత్సాహం ఇనుమడించింది. వొచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఇక తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. వొచ్చే ఎన్నికల్లో కనీసం ఎనభై స్థానాలను కైవసం చేసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాలు పక్కకు పెట్టి రాష్ట్రంలో హ్యాట్రిక్‌ ‌కోసం దృష్టిపెట్టాల్సిన అవసరమైతే కనిపిస్తుంది.

Leave a Reply