Take a fresh look at your lifestyle.

మూసీ నదికి పూర్వ వైభవం సాధ్యమేనా..?

మూసీ నదికి పూర్వవైభవం సాధ్యమవుతుందా.. అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర సర్కారు మూసీ నది ప్రక్షాళన ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టింది. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు చెపుతుంది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ను ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ ‌సలహాలు, సూచనల మేరకు మూసీ ఒడ్డు(కేవలం హైదరాబాద్‌ ‌దాని శివారు ప్రాంతాలకే పరిమితం) ప్రాంతాల్లో సుందరీకణ పనులు, వాకింగ్‌ ‌ట్రాక్‌ల ఏర్పాటు పనులు అక్కడక్కడ చేపట్టింది. మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన (శుద్ది) చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చేస్తున్న ప్రకటనలకు, ప్రచారానికి కొంత విశ్వాసం కల్పించేలా ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు వరకు ఇరు వైపులా రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.

అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, నది సుందరీకరణకు చర్యలను పలువురు పర్యావరణ, ప్రకృతి ప్రేమికులు స్వాగతిస్తున్నారు. ఈ పథకానికి పూర్తిస్థాయిలో సత్ఫలితాలు వొస్తాయా..అని మరి కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా రోడ్లు, వాకింగ్‌ ‌ట్రాక్‌లు అవసరమే అయినా నీటి శుద్ధికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. మూసీ శుద్ధి విషయంలో మాత్రం క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులేవీ అగుపడడం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు. మూసీలో కలుస్తున్న పరిశ్రామిక వ్యర్థాలలో అధిక శాతం విషపూరిత రసయనాలు ఉండడంతో వీటిని శుద్ధి చేయడం ఎంత వరకు సఫలీకృతమవుతుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అతి ఘాడమైన విషపూరిత రసాయనాల శుద్ధి కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను వినియోగించాలని సూచిస్తున్నారు. నదిలో ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్న కంపెనీలపై క్రిమినల్‌ ‌కేసులు నమోదుచేయించడం, కఠిన శిక్షలు అమలుచేయడం వంటివి చేస్తే సత్ఫలితాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

శాశ్వత పరిష్కారం చూపాలి..

మూసీ ప్రక్షాళన విషయంలో ప్రకటనలతోనే సరిపెట్టకుండా చిత్తశుద్ధితో శాశ్వత చర్యలకు పూనుకోవాలి. మూసీ నుండి దుర్వాసనతో వాతావరణం కలుషితమై ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంది. అధునాతన సీవరేజ్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్ల(ఎస్టీపీ) ఏర్పాటు విషయంపై దృష్టి సారించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో వాడుతున్న పరిజ్ఞానాన్ని పరిశీలించాలి.

Leave a Reply