Take a fresh look at your lifestyle.

‘‌తెలంగాణ’ మరో ఉద్యమానికి సిద్దపడుతున్నదా ?

ఉద్యమాల పుట్టిల్లుగా పేరున్న తెలంగాణ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నదా అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాల్లో అధిక భాగం విముక్తి పోరాటాలే. నాటి రైతాంగ పోరాటాలు మొదలు నిన్నటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు ఇక్కడి ప్రజలు విరామంలేని పోరాటాలు చేశారు. అయినా మరోసారి పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అరవై ఏండ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే ఏర్పడింది. రాష్ట్రం బౌతికంగా ఏర్పడిందేగాని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని పాలించడంలో ప్రభుత్వం విఫలమవడమే మరో పోరుకు ప్రజలు సన్నద్ధం కావడానికి కారణమయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆరు దశాబ్దాల పాటు తాము కోల్పోయిన అనేకానేక వసతులను తిరిగి పొందవొచ్చని ప్రజలు ఆశించారు. 1969కి ముందు, ఆ తర్వాత కూడా రాష్ట్ర సాధనా ఉద్యమాలు అనేకం జరిగినప్పటికీ, రాష్ట్ర సాధన మాత్రం 2002లో శ్రీకారం చుట్టుకుని పద్నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా జరిగిన ఉద్యమ ఫలితంగానే సాధ్యపడింది. ఈ మలిదశ ఉద్యమం ప్రధానంగా నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌ ‌లైన్‌తో సాగింది. రాష్ట్రం ఏర్పడి, స్థానిక ప్రభుత్వమే అధికారం చేపట్టినప్పటికీ ఆశించిన మేరకు ఆకాంక్షలను నెరవేర్చలేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఉద్యమంలో భాగస్వాములైన యువకులకు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను చూపించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న వాదన బలంగా ఉంది. ఈ విషయంలో ఆందోళన చేసినవారిని పోలీసు బలగాలతో ప్రభుత్వం అణచివేస్తున్నదని, ఎదిరించి నిలిచి అడిగిన వారి నోరు నొక్కుతున్నదంటూ ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు నిత్యం ఏకరువు పెడుతున్నాయి. ప్రశ్నించే గొంతుకలంటూ ఎక్కడా కనిపించకూడదన్నట్లుగా ప్రభుత్వం వారిని వివిధ కేసుల్లో ఇరికించడమో, మరో విధంగానో నోరెత్తకుండా చేస్తుందన్న విమర్శలున్నాయి. తెలంగాణ ఆవిర్భావానంతరం ఆనాటి ఉద్యమకారులకు గుర్తింపే లేకుండా పోయింది. వేల మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వొదిలేసి తెచ్చిన తెలంగాణలో కనీసం వారిని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంగాని, వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నాన్ని కాని ప్రభుత్వం చేయలేకపోయిందన్న ఆరోపణలున్నాయి. పాలనలో కూడా ఉద్యమకారులకు ఉధ్వాసనచెప్పి, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని, ఉద్యమకారులపై లాఠీలు ఝుళిపించిన వారికే ఈ ప్రభుత్వం పెద్దపీఠ వేయడంపట్ల ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి.

తెలంగాణకు ద్రోహం తలపెట్టినవారే ఇవ్వాళ క్యాబినెట్‌ ‌మంత్రులుగా చెలామణి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యమకారుల, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరుతాయనుకోవడం అతిశయోక్తే అవుతుంది. ఆ ఆకాంక్షల సాధనకోసం మరోసారి ప్రజలంతా ఏకమై మరో ఉద్యమానికి సన్నద్దం అయ్యేందుకు కార్యాచరణ రూపొందించుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే ‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక’ పేరున రాష్ట్రంలోని మేధావి వర్గం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది. ఇప్పటికే ఆచరణలోకి వొచ్చిన ఈ ప్రణాళికలో భాగంగా ప్రస్తుత పాలనా విధానం పట్ల అయిష్టం, నమ్మకంలేని వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, పౌరులతో ఆ వేదిక సమాలోచనలు చేస్తుంది. ముందుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి ధ్యేయంగా, ఆ లక్ష్య సాధనకోసం కలిసి వొచ్చేవారినందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలన్నదే ఈ వేదిక లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు దశాబ్దాల పోరాటం, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను కేవలం ఒక కుటుంబ పాలన కింద, ప్రగతి భవన్‌ ‌నాలుగు గోడల మధ్య, ఫామ్‌హౌజ్‌లో బందీ కానివ్వకూడదదన్నదే ఆ వేదిక లక్ష్యం. ఏడేళ్ళ పాలనతో విసిగి వేసారిపోయిన వారినందరినీ మరో సారి తట్టిలేపడమే కాకుండా, వారిని మరో ఉద్యమం కోసం సన్నద్ధం చేయడం కోసం అవసరమైతే గడపగడపకు వెళ్ళేందుకు వేదిక సిద్ధపడుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడున్న పార్టీలకు మరో పార్టీ కూడా ఇదే లక్ష్యంగా పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నది. తెలంగాణలో పాలకులను ప్రశ్నించే సత్తా ఉన్న పార్టీ లేకపోవడంవల్లే, తాము ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ తాజాగా ఆవిర్భవించింది వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ. ఇప్పటికే అడుగడుగునా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తుంది. కాగా, పాతపార్టీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతూ మరో రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై దండెత్తడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నది. నిన్నటివరకు తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ, మరో ఆరునెలల సర్వీసుకాలం ఉన్నప్పటికీ దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉండలేక తన పదవికి రాజీనామాచేసి మరో వారం రోజుల్లో మాయావతి సారథ్యంలోని ‘బిఎస్‌పి’లో అరంగేట్రం చేయబోతున్నాడు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌. ఇం‌కా ఆయన పార్టీలో చేరకముందే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై ధ్వజమెత్తడం ప్రారంభించాడు. ఈ రెండు వేదికలు కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలన్న లక్ష్యంగా ఉద్యమించబోతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో వేచి చూడాలి.

Leave a Reply