Take a fresh look at your lifestyle.

సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌నిషేధం సాధ్యమేనా?

పాస్టిక్‌ ‌మన జీవితంలో సౌకర్యం పేరిట విడదీయ లేనంత బలంగా పెన వేసుకు పోయింది.ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్ర పోయే వరకూ ప్లాస్టిక్‌ ‌తో మన అనుబంధం అంతా ఇంతా కాదు.ఉదయాన్నే పాలు, కూరగాయలు తేవాలంటే ప్లాస్టిక్‌ ‌కవర్‌ ‌కావాలి.టీ తాగాలి అంటే ప్లాస్టిక్‌ ‌కప్పులు. వాటర్‌ ‌బాటిల్‌ ‌ప్లాస్టిక్‌. ‌హోటల్‌ ‌నుండి టిఫిన్‌ ‌తేవాలి అన్నా కిరాణా నుంచి సరుకులు తేవాలి అన్నా ఇలా చెప్పుకుంటే పోతే బజారు నుంచి తెచ్చుకునే ప్రతీ వస్తువుకు క్యారీ బాగ్‌ ‌తప్పని సరి అయిపోయింది.
ఎందుకంటే ప్లాస్టిక్‌ ‌వలన మనకు కలిగే సౌకర్యం అంతా ఇంతా కాదు అందుకే దానికి మనం ఇంతగా ఎడిక్ట్ అయిపోయాం.ఈ ప్లాస్టిక్‌ ‌వినియోగం మనతో పాటు ఏ పాపం ఎరుగని మూగ జీవాలకు పర్యావరణానికి ఎంత హాని చేస్తుందో మనకు తెలియని విషయం కాదు. అయినా ఆ విషయాన్ని మాత్రం విస్మరించి మన పని మనం చేసుకుంటూ పోతున్నాం.ఈ పుడమిని కాలుష్య కాసారం చేసేస్తున్నాం.
వ్యర్ధాలు.
2015-16 సంవత్సరంలో మన దేశంలో ప్లాస్టిక్‌ ‌వ్యర్థాల పరిమాణం 15.89 లక్షల టన్నులు కాగా, 2019-20 నాటికి అది 35 లక్షలకు చేరింది. రోజుకు 25,940 టన్నుల ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే అందులో సుమారు 10,376 టన్నుల వ్యర్థాలను సేకరించకుండా వదిలేస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇదే పరిస్ధితి కొనసాగితే 2050 నాటికి 12 బిలియన్‌ ‌టన్నుల ప్లాస్టిక్‌ ‌మన దేశ భూ భాగంపై పేరుకుపోతుందని అంచనా వేస్తున్నారు.  కేంద్ర కాలుష్య మండలి 2012 లెక్కల ప్రకారం చూస్తే ప్రతీ రోజు మన దేశంలో 26 వేల టన్నుల ప్లాస్టిక్‌  ఉత్పత్తి అవుతుంది. దీనిలో16 వేల టన్నుల ప్లాస్టిక్‌ ‌ను తిరిగి సేకరిస్తున్నాం. అంటే రోజుకు 10 వేల టన్నుల ప్లాస్టిక్‌ ‌మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఇంకా వ్యర్ధాలుగా మిగిలిపోతున్నాయి.
ప్రభావాలు..
ఒకటి కాదు రెండు కాదు వందల వేల సంవత్సరాలు అయినా మట్టిలో కలసి పోని ప్లాస్టిక్‌ ‌వ్యర్ధాలు వలన కలిగే అనర్ధాలు అన్నీ ఇన్నీ కాదు.మన సౌకర్యం కోసం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌ ‌వ్యర్ధాలు తిని జీర్ణించుకోలేక జంతువులు, జలచరాలు, పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి.అంతే కాదు చివరికి ఇది మన శరీరంలో కూడా పేరుకుపోతోందని.. రక్తంలో కూడా అతిసూక్ష్మ (మైక్రో) ప్లాస్టిక్‌ ‌రేణువులు చేరుతున్నాయని ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు ఎన్విరాన్‌మెంటల్‌ ‌సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ మేగజైన్‌ ‌విడుదల చేసిన ‘హ్యూమన్‌ ‌కన్సంప్షన్‌ ఆఫ్‌ ‌మైక్రోప్లాస్టిక్స్ ‌నివేదిక ప్రకారం..
సగటున ఏటా ఒక్కోవ్యక్తి శరీరంలోకి వెళ్తున్న మైక్రోప్లాస్టిక్‌ ‌రేణువుల సంఖ్య 74 వేల నుంచి లక్షా 21 వేల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల జరిగిన మరొక అధ్యయనంలో మంచి నీళ్లలో సూక్ష్మ ప్లాస్టిక్‌ ‌చేరడంతో నీళ్లు కలుషితం కావడంలో అమెరికా, లెబెనాన్‌ ‌తర్వాత భారత్‌ ‌మూడో స్థానంలో ఉన్నట్టు తేలింది. ప్లాస్టిక్‌ ‌పదార్థాల్లో స్టైరీన్‌, ‌బెంజీన్‌ ‌లాంటి విషపూరిత రసాయనాలుంటాయి. ఇవి కాన్సర్‌ ‌ముప్పును పెంచుతాయి. నాడీవ్యాధులు, శ్వాసకోస, ప్రత్యుత్పత్తి సమస్యలు, కిడ్నీ, కాలేయ రుగ్మతలకు దారితీస్తాయి.
సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌నిషేధం
50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్‌ ‌సంచులను సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌గా యూరోపియన్‌ ‌యూనియన్‌(ఈయూ) నిర్వచించింది. ఈ ప్రమాణాలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. ఏది ఏమైనా. పర్యవరణానికి తీవ్ర హాని కలిగించేది సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఎందుకంటే ప్లాస్టిక్‌ ‌కాలుష్యంలో దీనిదే పై చేయి.అందుకే   ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు దీనిని నిషేధించాయి. దీనిలో భాగంగానే ఇంగ్లాండ్‌ ‌ప్రభుత్వం సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌వస్తువులను నిషేధిస్తూ ఈ మధ్య కాలంలో చట్టం చేసింది. పర్యావరణాన్ని సంరక్షించుకునే దేశాల్లో అగ్ర భాగాన ఉండే  కోస్టారికా దేశం 2021 నాటికి సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌ను నిషేధించాలని నిర్ణయించింది.
జర్మనీ కూడా గతేడాదే సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌పై నిషేధం విధించింది. ఇండోనేషియా రాజధాని జకర్తాలో సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌వస్తువులుపై పూర్తిగా నిషేధం విధించడం జరిగింది. యూకేలోని వేల్స్ ‌దేశం కూడా సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌నిషేధానికి నిబంధనలును రూపొందించింది ప్లాస్టిక్‌ ‌వలన కలిగే అనర్ధాలను 10 సంవత్సరాలు క్రితమే గుర్తించి పకడ్బందీగా నిషేధాన్ని అమలు చేస్తున్న మొట్ట మొదటి దేశం రువాండా. ఆస్ట్రేలియా, చైనా, జింబాబ్వే, కెనడా, ఫ్రాన్స్ ‌వంటి దేశాలయితే ప్లాస్టిక్‌ ‌బ్యాగ్స్ ‌వాడకంపై భారీ పన్నులు విధించి వాటి వినియోగాన్ని నిరుత్సాహ పరచేలా చేస్తున్నాయి.
ఈ ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ దేశంలోనూ వచ్చినప్పుడే దాని కట్టడి సులభం అవుతుంది.అందుకే ప్రపంచ మంతా ‘ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని తగ్గించాలని’ ఐక్యరాజ్యసమితి(యుఎన్‌ఒ) ‌పిలుపు నిచ్చింది.దీనికి స్పందించి 2022 నాటికి సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని 60 దేశాలు ప్రతిజ్ఞ కూడా చేశాయి. ఈ ప్రతిజ్ఞ చేసిన దేశాల్లో మన దేశం కూడా ఒకటి.అయితే 2022 నాటికి ఆ ప్రతిజ్ఞ మాత్రమే మిగిలింది తప్ప లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
భారత ప్రభుత్వ చర్యలు
మన దేశంలో కూడా ప్లాస్టిక్‌ ‌వినియోగంపై  కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించలేకపోయిన ఆంక్షలు మాత్రం రూపొందించాయి. మన దేశంలో 20 సంవత్సరాల క్రితమే సిక్కిం రాష్ట్రం ప్లాస్టిక్‌ ‌క్యారీబ్యాగుల్ని,నిషేదించగా రెండేళ్ల క్రితం ప్లాస్టిక్‌ ‌ప్లేట్లు, నీటి సీసాల్ని పూర్తిగా నిషేధించింది.ప్లాస్టిక్‌ ‌వినియోగం తగ్గించేందుకు ఆ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తూ 2016లో  ప్లాస్టిక్‌ ‌వ్యర్థాల నిర్వహణ విషయమై కేంద్రం స్పష్టమైన నిబంధనలు తీసుకు వచ్చింది.దీని ప్రకారం స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలే ప్లాస్టిక్‌ ‌నియంత్రణ చర్యలు చేపట్టాలి.
ఆ తదుపరి 2018లో గత నిబంధనలను సవరిస్తూ ప్లాస్టిక్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమ దారులకు వాటిని తిరిగి సేకరించే బాధ్యత కూడా అప్పగించింది.కానీ ఈ నిబంధనలు అన్నీ కాగితాలకే పరిమితం కావడం వలన ప్లాస్టిక్‌ ‌నివారణ చర్యలు ఏ మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేక పోయాయనే చెప్పవచ్చు.ఈ స్ధితిలో తాజాగా కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జూలై 1 నుంచి ఒకసారి మాత్రమే వినియోగించే 16 రకాలైన (సింగిల్‌ ‌యూసేజ్‌) ‌ప్లాస్టిక్‌ ‌వినియోగాన్ని నిషేధించింది.   నిషేధం ప్రకటిస్తే సరి పోదు దానిని అమలు చేయడానికి వాస్తవికమైన ప్రణాళికలు కావాలి. దానితో పాటు కట్టడి చేసే పటిష్ట యంత్రాంగం ప్రభుత్వాలకు ఉండాలి.అంతే తప్ప ప్రకటనలతో ఏ మాత్రం మార్పు సంభవించదని గత అనుభవాలు మనకు స్పష్టం చేస్తున్నాయి.
నిషేధం ఎంత ముఖ్యమో దానికి ప్రత్యమ్నాయం చూపడం కూడా అంతే ముఖ్యం.దాని కోసంజీవ విచ్ఛిన్నానికి అనువైన కాగితం, జనప నార, గుడ్డతో తయారు చేసే సంచులను చౌకగా తయారు చేసే సాంకేతికతను అభివృది చేయాలి.దీనితో పాటు ప్రజలు కేవలం మన సౌలభ్యతే ప్రధానమని భావించకుండా ఈ పుడమిపై ఇతర జీవరాసుల మనుగడ కోసం మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ ‌రహిత స్థితిని సాధించే కృషిని అందరూ ఉమ్మడిగా చేపట్టినప్పుడే పర్యావరణానికి జరిగే హానిని ఇప్పటికైనా అడ్డు కట్ట వేయగలుగుతాం భావితరాల వారికి మనుగడ సాగించే అవకాశం అందించిన వారం అవుతాం.
image.png
రుద్రరాజు శ్రీనివాసరాజు.
9431239578
లెక్చరర్‌…ఐ.‌పోలవరం

Leave a Reply