Take a fresh look at your lifestyle.

మౌనం అంగీరమేనా ?

టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ఐటి శాఖ మంత్రి కల్వకంట్ల తారకరామారావు ముఖ్యమంత్రి అయ్యే విషయం ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రజలు, వారి ప్రాధాన్యాల కన్నా ఇప్పుడిదే హాట్‌ ‌టాపిక్‌ అయింది. కెటిఆర్‌ ‌ముఖ్యమంత్రి విషయాన్ని ఇంతకాలం అవునూ, కాదన్న వాదనలకే పరిమితమవుతూ వస్తుండగా తాజాగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆ సమయం ఎంతో దూరం లేదన్న విషయాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఇంతకాలం పత్రికా వార్తలకు, టివీ చర్చాగోష్టులకు మాత్రమే పరిమితమవుతూ వస్తున్న ఈ అంశంపై ఇప్పుడు అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా, అధికారపార్టీ ప్రధాన నేతల ప్రసంగాల్లో అంశంగా మారింది. కేవలం పార్టీ వర్గాలు ఈ ప్రస్తావనపై మాట్లిడితే అది పార్టీ అంతర్గత అంశమనుకోవచ్చు, కాని, ఒక్కొక్కరుగా మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ రావటం చూస్తుంటే, అధికారపార్టీ ఒక పథకం ప్రకారం ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకుపోతున్నారన్నది స్పష్టమవుతున్నది.

ఎక్కడో ఎవరో అడిగితేనో మంత్రులు ఈ ఆంశంపై మాట్లాడుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే, సాక్షాత్తు కెటిఆర్‌ ‌పాల్గొన్న సభలో ఆయన వేదికపై ఉండగానే మంత్రులు మాట్లాడుతున్నప్పుడు కనీసంగానైనా దాన్ని కెటిఆర్‌ అడ్డుకునే ప్రయత్నం చేయలేదంటే మౌనం అంగీకారమన్నది స్పష్టమవుతున్నది. గతంలోకూడా ఇలాంటి చర్చ జరిగినప్పుడు వేదికపై ఆసీనుడై ఉన్న కెటిఆర్‌ ‌దాన్ని ఖండించడమేకాక, మరో పదేళ్ళపాటు కెసిఆరే ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ వివిధ బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఘంటాపథంగా చెబుతూ వచ్చాడు. కాని అందుకు భిన్నంగా తన ముందే తనను పొగుడుతూ కాబోయే ముఖ్యమంత్రి అంటూ మంత్రులు మాట్లాడుతున్నా ఆయన ఇసుమంత్తైనా అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని చూస్తుంటే, ముఖ్యమంత్రి మార్పు వార్త సరైందన్న అభిప్రాయం కలుగుతున్నది. తాజాగా డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్‌ ‌సంఘ్‌ ‌సికింద్రాబాద్‌ ‌డివిజన్‌ ‌కార్యాలయ సభలో అవేదికను పంచుకున్న కెటిఆర్‌ను కాబోయే ముఖ్యమంత్రి అని కెటిఆర్‌ను సంబోదిస్తూ ఆయనకు తన అభినందనలు తెలుపడమే కాకుండా, ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ రైల్వే కార్మికులను ఆదుకోవాలంటూ కోరడం చూస్తుంటే కెటిఆర్‌ ‌సిఎం పదవి త్వరలోనే చేపట్టడం ఖాయమన్నది స్పష్టమైనది. పద్మారావు అంత స్పష్టంగా మాట్లాడినా కెటిఆర్‌ ఏమాత్రం స్పందించకపోవడం ప్రచారంలో ఉన్న వార్తలు గాలివార్తలు కాదన్నవి స్పష్టమవుతున్నది.

అంతకు ముందు పలువురు ఎంఎల్‌ఏలు, మంత్రులు కెటిఆర్‌ ‌సిఎం ప్రస్తావనను పలు సందర్భాల్లో వెల్లడించారు. కెటిఆర్‌ ‌ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అని ఒకరు, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలున్నాయని మరొకరు, ఆయన వెంటే తామంతా అని మరికొందరు ఇలా ఇప్పటినుండే ఆయన్ను ప్రసన్నంచేసుకునేందుకు తమ శక్తిమేర ఆయన పదోన్నతిని ప్రస్తుతిస్తూనేఉన్నారు. తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ఈటల రాజేందర్‌, ‌గంగుల కమలాకర్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు ఇలా వరుసబెట్టి ఈ ప్రస్తావనను తీసుకురావడం వెనుక పార్టీ ప్రముఖుల అమోద ముద్ర ఉందన్న విషయం చెప్పకనే చెప్పినట్లు అవుతున్నది. ఇక ముహూర్త సమయాన్ని ప్రకటించడమే తరువాయి. మీడియా సంస్థలు ఇప్పటికే ముహుర్త సమయాలనుకూడా ప్రకటిస్తున్నాయికూడా. రాష్ట్ర మఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కూడా ఇదే దృష్టితో తన కుమారుడిని ఎక్స్‌పోజ్‌ ‌చేస్తూవస్తున్నాడన్న ఆరోపణలేకపోలేదు. ఈ శాఖ ప్రారంభోత్సవాలైనా కెసిఆర్‌ ‌బదులుగా కెటిఆర్‌తోనే జరిపిస్తూ వస్తున్నారు.

- Advertisement -

ఇటీవల వాక్సిన్‌ ‌ప్రారంభోత్సవంకూడా ఆయనతో జరిపించిన విషయం గమనార్హం. కెసిఆర్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌కే పరిమితమవుతున్నాడని ప్రతిపక్షాలు చెవులో గూడు కట్టుకున్నట్లు ఎంత ఆరోపించినా కెటిఆర్‌ను ఎక్స్‌పోజ్‌ ‌చేసేందుకే ఆయన బయటికి రావడంలేదన్నది దీనివల్ల స్పష్టమవుతున్నది. ఇదే అంశంపై ఇటీవల కెసిఆర్‌ ‌కాళేశ్వరం వెళ్ళాడని, దోశ నివారణ పూజలు చేసి, ఆ పూజపుష్పాలను నదిలో కలుపడానికే కాళేశ్వరం వెళ్ళాడుకాని, పనుల పర్యవేక్షణకోసం కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తీవ్రంగా విమర్శిస్తున్నారు. కెటిఆర్‌ ‌ముఖ్యమంత్రి అయితే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నట్టనడిమికి చీలుతుందన్న జోస్యం చెబుతున్న బండి సంజయ్‌, ‌వాస్తవంగా తనపై అసంతృప్తితో ఉన్న పార్టీ సీనియర్‌ ‌నేతలు, ఉద్యమం నుండి ఎదిగినవారి దృష్టిని మళ్ళించేందుకు కెసిఆర్‌ ‌చేస్తున్న ఎత్తుగడగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రులు, ఎంఎల్‌ఏలు, పార్టీ ఇతర నేతలు కెటిఆర్‌ ‌సమర్థతపై చేస్తున్న ప్రకటనలపైన కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కెటిఆర్‌ ‌సమర్ధుడంటే కెసిఆర్‌ అసమర్ధుడన్నట్లేనా అని కాంగ్రెస్‌ ‌నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచన వెనుక బిజెపి అగ్రనేతల ఆలోచన ఉందన్న వాదాన్నికూడా కాంగ్రెస్‌ ‌వినిపిస్తోంది.

manduva ravindhar rao
మండువ రవీందర్‌రావు

Leave a Reply