“కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో వివిధ ప్రదేశాలలో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులను వారి వారి ఇళ్లకు చేరవేయడంలో కీలకపాత్ర వహించి దాతృత్వం కనబరచారు. అప్పుడు ఆయన జాతీయ స్థాయి హీరో గా ఎదిగాడు. జాతీయ మీడియాతో పాటు తెలుగు ఛానళ్ళు కూడా సోనుసూద్ ను ఆకాశానికెత్తాయి. అప్పటివరకూ ఒక సినిమా విలన్ అయిన సోనుసూద్ నిజజీవితంలో హీరో అయ్యారు. ఇప్పుడు ఆయనను రాజ్యం అనిపిలుచుకునే ప్రభుత్వం భుజానికెత్తుకోవాలని నిర్ణయించింది. దేశంలో ఓటింగ్ గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) నటుడు సోనుసూద్‌ను పంజాబ్ రాష్ట అంబాసడర్ గా నియమించినట్లు, పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు తెలిపారు.”

‘దానం’ అనే పదం పదే పదే పొగడ్తలు రుచి చూస్తుంటుంది. అదే పదం పరాన్న జీవితానికి ప్రోత్సాహకారిగా నిలుస్తుంది. ధనం ఉద్దీపన మేలు చేస్తుందా? హక్కు సాధించుకునే విధంగా అండగా నిలవడం మేలు చేస్తుందా అనే అంశం అన్నికాలాలకూ వర్తిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇదే ప్రశ్నప్రభుత్వం, (రాజ్యం అందాం) ముందుంచితే ఏం సమాధానం వస్తునదన్న కథనమే ఈ వ్యాసం.
మనవాడుగా చెప్పుకున్న సోను సుద్ పంజాబ్ మోగా జిల్లాలో పుట్టి పెరిగాడు. కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో వివిధ ప్రదేశాలలో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులను వారి వారి ఇళ్లకు చేరవేయడంలో కీలకపాత్ర వహించి దాతృత్వం కనబరచారు. అప్పుడు ఆయన జాతీయ స్థాయి హీరో గా ఎదిగాడు. జాతీయ మీడియాతో పాటు తెలుగు ఛానళ్ళు కూడా సోనుసూద్ ను ఆకాశానికెత్తాయి. అప్పటివరకూ ఒక సినిమా విలన్ అయిన సోనుసూద్ నిజజీవితంలో హీరో అయ్యారు. ఇప్పుడు ఆయనను రాజ్యం అనిపిలుచుకునే ప్రభుత్వం భుజానికెత్తుకోవాలని నిర్ణయించింది. దేశంలో ఓటింగ్ గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) నటుడు సోనుసూద్‌ను పంజాబ్ రాష్ట అంబాసడర్ గా నియమించినట్లు, పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు తెలిపారు. ఈ మేరకు తమ కార్యాలయం ఇసిఐకి ప్రతిపాదన పంపిందని, ఎలక్షన్ కమిషన్ దీనిని ఆమోదించారని తెలిపారు.
పంజాబ్ లో పుట్టిన నటుడు సోను సూద్ ఇంత ఘనత సాధించారు కదా మరి ఇతర కళాకారుల మాట ఏమిటి అని తరచి చుస్తే పంజాబ్ గడ్డ మీదనే ఆసక్తిదాయక వివరాలు తెలియవచ్చాయి. ప్రముఖ పంజాబీ పాప్ గాయకులు సిధు మూసేవాలా, దిల్జిత్ దోసాంజ్, బబ్బూ మన్, గిప్పి గ్రెవాల్, పర్మిష్ వర్మ, అమ్మి విర్క్..వీరంతా రాష్ట్రంలో.. పంజాబీ ప్రజలలో, నటుడు సోనూసూద్ కంటే బాగా ప్రసిద్ధి చెందినవారే. వీరంతా పెద్ద వేదికలు డీజేలు స్టూడియోలు వదిలి, సామాన్య రైతుల కోసం, రోడ్ల మీద నిలబడి పంజాబ్ రైతులకు మద్దతు తెలుపుతూ, పోరాటంలో భాగమై నిలిచి పాటలు పాడుతున్నారు. హర్యానాకు చెందిన ప్రముఖ గాయని సప్నా చౌదరి, బీజేపీ ఎంపీ భోజపురి నటుడు మనోజ్ ఝా స్నేహితురాలు. రైతులకు మద్దతుగా రోడ్డు మీదకు వచ్చారు. కురుక్షేత్రలో రైతులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని వీరందరూ విమర్శించారు.
వీళ్లంతా యువతలో ఆదరణ ఉన్న గాయకులే. ఈ కళాకారులందరూ పంజాబ్ ప్రజానాడి తెలుసుకుని కేంద్రం తెచ్చిన రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ జనంలో మమేకమై అన్నివర్గాల ప్రజలు, రైతుల మనసులను గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘‘పంజాబ్ లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేము రైతులం. మా తండ్రి, మా తాత కూడా రైతులే. మాది రైతు కుటుంబం. రైతుల హక్కుల కోసం మేము పోరాడి నిలబడతాం. నిరసనకు సిద్ధమయ్యాం. గ్రామాల్లోని మా అభిమానులందరికీ త్వరలో మా నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని తెలియజేస్తాం ’’ అని కళాకారుడు మూస్వాలా ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా చెబితే గంటలో 700,000 మందికి పైగా చూసారు. త్వరగా మా పోరాటంలోకి రండి అని పంజాబ్ ప్రజలు వారిని ఆహ్వానించారు.
పంజాబ్‌లో రైతు నిరసనల్లో పాల్గొంటానని, ఢిల్లీ పాలకులు, కార్పొరేట్లు రూపకల్పన చేసిన బిల్లుకి వ్యతిరేకంగా పోరాడతానని బబ్బూ మన్ అనే మరో కళాకారుడు ఇన్స్టాగ్రామ్ వీడియోలో ప్రకటించిన వెంటనే 400,000 వీక్షణలు వచ్చాయి. ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ ఈ పాటికే రైతుల నిరసనకి మద్దత్తు వ్యక్తం చేసారు.. ‘‘ ఎంతటి వారైనా సరే రైతు మాట వినాలి’’ అని దోసాంజ్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఇదిలా ఉండగా బీజేపీ అనుకూల కళాకారుకు పంజాబ్ ప్రజలనుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా గమనించాలి. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ, గురుదాస్‌పూర్ బిజెపి ఎంపి నటుడు సన్నీ డియోల్ బిల్లులకు అనుకూలంగా మాట్లాడి ఎదురుదెబ్బలు చవి చూసారు. కొంతమంది రైతులు మెహందీ దిష్టిబొమ్మలను తగలబెట్టగా, కాంగ్రెస్ కార్యకర్తలు డియోల్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.వారిని పంజాబ్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబోమని స్పష్టం చేసారు.
ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి – ప్రజలతో సంభంధం వున్న కళాకారులు. ప్రతి శుభకార్యక్రమ%శీ%లో, పండగలో వీరి పాటలు వినబడతాయి. వ్యవసాయం వొనగూర్చే సొమ్ము, ఆదరించే వారు లేకపొతే వీరి జీవితాలు గల్లంతే. అస్తిత్వం కోసం వీధిపోరాటానికి సిద్దపడ్డారు. ఇక రెండవది – ప్రభుత్వం తరఫున నిలిచే కళాకారులు అక్కరకు రారు. వాళ్ళకు యెంతగా ప్రజలలో పేరున్నా, ప్రభుత్వం తరఫున వారిని అంబాసడర్ గా ప్రకటించదు. సోనూ సూద్ పంజాబ్ లో అంతగా తెలియని కళాకారుడైనా ఆయన్ను ఐకాన్ అని ప్రకటిస్తుంది. మరో విషయమేమిటంటే.. పంజాబ్ రైతులు చేస్తున్న సంఘర్షణ గురించి సోనుసుద్ మౌనంగా ఉంటారు. పరాన్న జీవిత ప్రోత్సాహాకునిగా నిలిచిన సోనుసుద్ ను ‘‘ఆత్మనిర్భర్’’ ప్రచారక అంబాసడర్ గా ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి.