Take a fresh look at your lifestyle.

పాదయాత్రలు సక్సెస్‌ ‌ఫార్ములానా ?

అధికార పార్టీని పడదోసి రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి పాదయాత్రల ఫార్ములా చక్కటి రాజమార్గంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే పేరున చేపడుతున్న ఈ పాదయాత్రలతో ప్రజలకు దగ్గరై తద్వారా అధికారానికి చేరువ అవుతామన్న ప్రగాడ నమ్మకం ప్రతిపక్షాల్లో ఉంది. ప్రజల బాధల పట్ల సానుభూతి ప్రకటించడంతోపాటు అందుకు అధికార పార్టీయే కారణమంటూ దుమ్మెత్తి పోసేందుకు ఈ పాదయాత్రలు ప్రతిపక్షాలకు దక్కుతున్న చక్కటి వరమనే చెప్పాలె.

Padayatra ys yagan vs ysr

అయితే ఈ ఫార్ములాతో కొందరు అధికారాన్ని హస్తగతం చేసుకోగా, మరికొందరు తాత్కాలిక లబ్ది పొందిన సంఘటనలకు చరిత్రే సాక్ష్యం. ఈ తరానికి పాదయాత్రల ఫార్ములా ద్వారా విజయాన్ని సాధించిన ప్రధాన వ్యక్తుల పేర్లలో దివంగత డా.వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి పేరు మొదటి వరుసలో నిలుస్తున్నప్పటికీ, అహింసా, ఆమరణ నిరాహార దీక్షల ద్వారా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీ దీనికి ఆద్యుడు. ఉప్పు సత్యాగ్రహం పేరుతో దండికి పాదయాత్ర చేసి ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే రీతిలో భూదాన ఉద్యమం పేరుతో వినోబా భావే జరిపిన పాదయాత్ర ఎలా విజయవంతమైందన్నది తెలియందికాదు.

ఆ తరహాలో అక్కడక్కడ చిన్నాచితక పాదయాత్రలు జరిగాయి. మన తెలుగు రాష్ట్రానికి వొస్తే డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ఆయనకు అధికారాన్ని తెచ్చిపెట్టింది. ‘ప్రజాప్రస్థానం’ పేరున 2003లో ఆయన సుమారు 1468 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి, ఉమ్మడి ఆంధప్రదేశ్‌లోని అన్నివర్గాల ప్రజలను కలుసుకోవడం ద్వారా 2004లో అధికారాన్ని చేపట్టగలిగాడు. అదే క్రమంలో రాష్ట్ర విభజన జరుగుతున్న క్రమంలో 2013లో నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం’ పేర సుమారు 2వేల 340 కిలోమీటర్లమేర పాదయాత్ర నిర్వహించి విడిపోయిన ఆంధప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయినాడు. తన తండ్రి ఫార్ములాను అనుసరించడం ద్వారా ఏపి ముఖ్యమంత్రిగా ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగుతున్నాడు. రాజకీయాల్లో పెద్దగా అనుభవంలేకపోయినా, తండ్రి చనిపోయిన తర్వాత అనేక కేసులు ఎదుర్కుంటూ కూడా ఆయన ‘ప్రజాసంకల్ప యాత్ర’ చేపట్టి దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, నలభై ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబును గద్దె దింపి ఆ స్థానంలో కూర్చోగలిగాడు. అంత పవర్‌ఫుల్‌ అయిన ఈ ఫార్ములాను ఇప్పుడు దాదాపు అన్ని ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా తమ రాజకీయ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనుకున్న వారెవరైనా సరే తిరిగి ప్రజాప్రస్థానంలోకి వెళ్ళేందుకు వారికిదొక చక్కటి రాజమార్గమైంది.

తాజాగా గురువారం ‘వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ’ పార్టీని ప్రారంభించిన డా.వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి తనయ, ఏపి సిఎం జగన్‌ ‌సోదరి వైఎస్‌ ‌షర్మిల మరోసారి తాను తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించింది. పార్టీ ఆవిర్భావం నుండి వంద రోజుల తర్వాత తానీ కార్యక్రమానికి స్వీకారం చుట్టనున్నట్లు తెలిపింది. కాగా పాదయాత్ర చేసిన అనుభవం ఆమెకు గతంలోనే ఉంది.

ys sharmila padayaatra

ఇవ్వాళ ఏపి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ ‌జైలు జీవితం అనుభవిస్తున్నప్పుడు ఆ పార్టీకి అండగా నిలిచిన షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పేర జగనన్న విడిచిన బాణమంటూ 2012 అక్టోబర్‌ 18 ‌నుంచి 2013 జూలై 29 వరకు సుమారు మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించింది. ఇవ్వాళ జగన్‌ ‌గద్దెనెక్కడంలో ఆ పాదయాత్ర ప్రభావం కూడా లేకపోలేదు. పాదయాత్ర ద్వారా అధికారం రాకపోయినా పార్టీ ఉన్నత పదవిని దక్కించుకో గలిగాడు తాజా టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వొచ్చిన కొద్దికాలంలోనే తన దూకుడును ప్రదర్శించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ పార్టీలోని కొన్ని శక్తులు అడ్డుపడడంతో తన పాదయాత్రను నిర్ణీత పరిధికే పరిమితం చేసుకున్నాడు. ‘రాజీవ్‌ ‌రైతు భరోసా’ పేరున అచ్చంపేట నుండి హైదరాబాద్‌ ‌వరకు పాదయాత్ర నిర్వహించినా అధికారపార్టీ తప్పిదాలను ఎత్తిచూపడంలో ముందువరుసలో నిలిచాడనే చెప్పాలె.

ఆ దూకుడే ఆయనకు ఇప్పుడు టిపిసిసి పదవిని కట్టబెట్టింది. ఇప్పుడాయన టిఆర్‌ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అధిష్టానం తేదీ ఖరారు చేయడమే మిగిలింది. ఇంతకాలం స్థబ్దతగా ఉన్న పార్టీ క్యాడర్‌ను యుద్ధానికి సన్నద్ధం చేయడంతో పాటు, ప్రజల ఈతిబాధలు స్వయంగా తెలుసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు.

revanth reddy paadayatra

అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగం కూడా అదే వరుసలో ఉంది. త్వరలో జరుగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో పాటు మరో రెండేళ్ళ కాలంలో రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాదయాత్ర పథక రచనలో ఆ పార్టీ వర్గాలు మునిగిపోయాయి. మొదటి విడుతలో రంగారెడ్డి, మెదక్‌, ‌నిజామాబాద్‌, ‌కరీంనగర్‌ ‌నుండి హుజూరాబాద్‌ ‌వరకు దాదాపు 55 రోజుల్లో 750 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. హైదరాబాద్‌ ‌చార్మినార్‌ ‌దగ్గరి భాగ్యలక్ష్తి టెంపుల్‌ ‌నుండి ఆగస్టు 9న యాత్ర ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించుకుంది కూడా.

ఇదిలా ఉంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల్లాగా పాదయాత్రలు నిర్వహించ లేదు కాబట్టి మరో నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళే కార్యక్రమాన్ని ఇప్పటికే చేపట్టింది. ‘పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి’ పేరున స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలను ప్రారంభించారు. ప్రగతి భవన్‌కు, ఫామ్‌ ‌హౌజ్‌కే పరిమితమవుతున్నాడన్న ప్రతిపక్షాల నిందను తుడిపేసుకోవడానికా అన్నట్లు ఒక్కసారే ఆయన తన పూర్వ శైలితో జిల్లాలను చుట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

kcr pada yaatra

మొదటి విడుతగా ఆయన సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్‌, ‌భువనగిరి, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. కేవలం పర్యటనలకు పరిమితం కాకుండా ఆయా జిల్లాల్లో చేపట్టే అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఏకరువు పెట్టడంతో పాటుగా, కోట్లాది రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్‌పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం త్వరలో యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా మారబోతున్నదన్న విషయం స్పష్టమవుతున్నది. కొత్తగా వొచ్చిన షర్మిల పార్టీతో పాటు రెండు ప్రధాన పార్టీలు త్వరలో చేపట్టే పాదయాత్రలు భవిష్యత్‌లో వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్నదిప్పుడు తెలంగాణ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.

Leave a Reply