Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల అనుమతి లేకుండా ఒక్కరోజు జీతం విరాళమా?

ఉద్యోగ నేతలపై స్టీరింగ్‌ ‌కమిటీ సభ్యులు మండిపాటు
జేఏసీ పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరికీ తామే ప్రతినిధులుగా కొందరు ఏక పక్షంగా ఒక్కరోజు వేతనం విరాళంగా ప్రకటించటాన్ని ఐక్యవేదిక పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని కమిటీ సభ్యులు అన్నారు. ఈ మేరకు స్టీరింగ్‌ ‌కమిటీ సభ్యులు కె లక్ష్మయ్య, టి శుభాకరరావు, జి సదానందం గౌడ్‌, ‌పి పర్వతరెడ్డి, తదితరులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐఆర్‌, ‌పీఆర్సీ, డీఏ లాంటి సమస్యల పరిష్కారం కోసం ఏనాడూ ఉద్యమించని వారికి, ఐక్యవేదిక చలో అసెంబ్లీ ఉద్యమానికి మద్దతు తెలపని వారికి, కనీసం మూడు నెలలు జీతాలు, పెన్షన్లు ఏకపక్షంగా కోతపెడితే స్పందించని వారికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరికీ ప్రతినిధులమని చెప్పుకునే నైతిక అర్హత ఎక్కడుందని వారు ప్రశ్నించారు.

రాష్ట్రంలో జేఏసీ ఉనికిలో లేదని, ఉన్నదల్లా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్‌ ‌సెక్టార్‌/ ‌కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక మాత్రమేనని అన్నారు. కాబట్టి ఐక్యవేదికతో సంప్రదించకుండా కొన్ని సంఘాల నాయకులు ఏకపక్షంగా ఇచ్చిన విరాళం ప్రకటన చెల్లదని, ఆ లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా వేతనాల్లో కోత పెట్టటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు విరాళాలివ్వాలనుకుంటే ఎవరైనా స్వచ్ఛందంగా సిఎంఆర్‌ఎఫ్‌కు ఆన్‌లైన్‌లో పంపొచ్చని అన్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు పంపుతున్నారు కనుక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల అంగీకారంతో మాత్రమే ఒకరోజు వేతనం కోత విధించాలని డిడిఓలను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి ఐక్యవేదిక స్టీరింగ్‌ ‌కమిటీ పక్షాన గురువారం నాడు లేఖ వ్రాశారు. ఆ లేఖపై పెన్షనర్ల జెఏసి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, జాక్టో, యుయస్పీసీ ప్రతినిధులు సంతకాలు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply