Take a fresh look at your lifestyle.

కొత్త పార్లమెంటు భవన సముదాయం ఇప్పుడు అవసరమా..?

కోవిడ్ సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. వివిధ రంగాల్లో ఉత్పత్తులు ఇంకా పుంజుకోలేదు. పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు పూర్తిగా తెరుచుకోలేదు. అయినా కేంద్రం తాను తలపెట్టిన పార్లమెంటు కొత్త భవనాల ప్రాజెక్టును సాగించడానికే నిర్ణయించుకోవడం దురదృష్టకరం. ప్రస్తుత పార్లమెంటు భవనాలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. వాటి స్థానే కొత్త భవనాలను నిర్మించాల్సిన అత్యవసరం ఇప్పుడేమీ లేదు. దీని కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేయడం ప్రస్తుత పరిస్థితులలో వృధా చేయడమే అవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవ రజతోత్సవాల నాటికి ( 2022) పార్లమెంటు కొత్త భవనం పూర్తి అయ్యేట్టు దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని నరేంద్రమోడీ ప్రభుత్వం సంకల్పించింది. అయితే, సుప్రీంకోర్టు ఈ భవనం శంకుస్థాపన డిసెంబర్ 10వ తేదీన యథావిధిగా చేసుకోవచ్చనీ, నిర్మాణాన్ని మాత్రం వెంటనే చేపట్టవద్దని ఆదేశించింది. ఈ కొత్త భవన సముదాయం నిర్మాణానికి 971 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుంది. ఈ కొత్త భవన నిర్మాణానికి ఇది సమయం కాదని ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకలేదు. స్వతంత్ర భారత దేశంలో ప్రస్తుత పార్లమెంటు భవనంలో ఎన్నో చారిత్రక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగం ఆమోదించింది ఈ భవనంలోనే, ఎంతో మంది ప్రధానులు, ఇక్కడి నుంచే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది.అయినప్పటికీ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గేది లేదన్న ధోరణిలో ముందుకు సాగుతోంది.

కోవిడ్ వల్ల దేశంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా, పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్రంగా నష్టపోయారు. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రాలేదు. వ్యాక్సిన్ గురించి ప్రచారార్భాటాలే తప్ప కచ్చితంగా ఎప్పుడొస్తుందో తెలియదు.ఇటువంటి పరిస్థితుల్లో కొత్త పార్లమెంటు భవనాలను కోట్లాది రూపాయిలు వెచ్చించి ఇప్పుడు చేపట్టడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్న వేళ కొత్త భవన నిర్మాణానికి గురువారం ( డిసెంబర్ 10వ తేదీ) శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల పలు ప్రజాస్వామిక సంస్థలు, పార్టీలు ఆక్షేపణ తెలుపుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి మోడీనీ, బీజేపీని తీవ్రంగా విమర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కొత్త పార్లమెంటు భవనాల శంకుస్థాపన సందర్భంగా మోడీని అభినందిస్తూ సందేశం పంపడం ఇంకా విడ్డూరంగా ఉంది. తాను కూడా హైదరాబాద్ లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన సచివాలయ భవనాలను కూలగొట్టి కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నందున చంద్రశేఖరరావు ఇప్పుడు మోడీని అభినందిస్తున్నారేమోననిపిస్తోంది. సచివాలయం,అసెంబ్లీ, లేదా పార్లమెంటు భవనాలు శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటైనవే. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. అక్కడ సచివాలయం,అసెంబ్లీ భవనాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏక పక్ష నిర్ణయాలతో ప్రారంభించారు. ఇప్పుడు మోడీ కూడా ఏక పక్షంగానే పార్లమెంటు భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. సెంట్రల్ విస్టా పేరిట నిర్మిస్తున్న పార్లమెంటు కొత్త భవనాల సముదాయంలో సచివాలయం, విఐపీల భవనాలు కూడా ఉంటాయి. ఇది బృహత్ పథకం.

వ్యయం వేల కోట్ల రూపాయిలకు డేక వచ్చు. భారత్ వంటి శరవేగంగా అభివృద్ది చందుతున్న దేశం ప్రతిష్టకు తగినట్టు పార్లమెంటు, సచివాలయ సముదాయాలు ఉండటం అవసరమే కానీ, ప్రస్తుత ఆర్థిక సంక్షోభ కాలం లో అవసరమా అన్నదే అందరి ప్రశ్న. అలాగే, తెలంగాణ సచివాలయ భవన సముదాయాలను ముఖ్యమంత్రి కీ,ఆయన కుమారునికీ వాస్తు రీత్యా సరిపడవన్న కారణంగానే పూర్తిగా కూల్చి వేసి కొత్త భవనాలు చేపట్టారు. ఇది అప్రజాస్వామికం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ముఖ్యమంత్రులు పేరొందిన వారు ఈ సచివాలయ భవన సముదాయాల నుంచే పాలన సాగించారు. రాష్ట్రపతి సంజీవరెడ్డి, ప్రదాని పీవీ నరసింహారావు ఈ భవనాల్లోనే ముఖ్యమంత్రులుగా పాలన సాగించారు. అంత ఘన చరిత్ర ఉన్న సచివాలయ భవనాలను కేవలం వాస్తు కారణంగా కూల్చివేసి కొత్త భవనాల నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఇద్దరేననిపించుకుంటున్నారు. ప్రజా ధనం వృధా గురించి ఆలోచించడం లేదు.

Leave a Reply