- నన్ను పిలువరా..ప్రోటోకాల్ పాటించరా..
- అధికారుల తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ పార్టీ కీలుబొమ్మగా మారి.. పాతబస్తీకి మెట్రో రాకుండా చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే మెట్రో ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు. శనివారం దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో మెట్రో రైలు అధికారులతో కిషన్ రెడ్డి సక్ష నిర్వహించారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను పిలవలేదంటూ మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించరా అంటూ అధికారుల తీరును తూర్పారబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే తనకు ఆహ్వానం పంపలేదని అసహనం వ్యక్తం చేశారు. మెట్రో ప్రారంభోత్సవం ఏమైనా టీఆర్ఎస్ ఫంక్షనా అని ఫైర్ అయ్యారు. మెట్రో రైలు కోసం కేంద్రం రూ.1250 కోట్లు ఇచ్చిందని, కనీసం ప్రధాని ఫోటో అయినా పెట్టలేదని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గం పరిధిలో జరిగిన కార్యక్రమం గురించి తనకే చెప్పరా అని అధికారులను కేంద్ర మంత్రి నిలదీశారు. ఇదిలాఉండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సక్షా సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హాజరుకాలేదు.అనంతరం ఆయన డియాతో మాట్లాడుతూ నగరంలో పాతబస్తీ చాలా వెనుకబడి ఉందన్నారు. పాతబస్తీ అభివృద్ధిని కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. మెట్రో రావడం వల్ల పాతబస్తీ రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కై పాతబస్తీకి మెట్రో రైలు రాకుండా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మజ్లిస్ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాల న్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తయిందన్నారు. మెట్రోకు కేంద్రం రూ.1200 కోట్లు నిధులిచ్చిందని గుర్తుచేశారు. మరో రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఫలక్‌నూమా వరకు మెట్రో నిర్మాణం చేస్తామంటేనే కేంద్రం నిధులిచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో రైలు టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
కేంద్రంపై విమర్శలు చేయటమే పనిగా కేటీఆర్ పెట్టుకున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు ఇస్తుంది.. ఎన్ని ఇళ్లు కడతారో చెప్పండి అంటూ కేటీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చినా తన వాటా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో ఎంఎంటీఎస్ రెండోదశ పనులపైనా కేంద్ర మంత్రి స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫలం వలనే ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభం కావటంలేదన్నారు. ఎంఎంటీఎస్ రెండోదశను ఇప్పటికైనా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ కోసం కేంద్ర ప్రభుత్వం తన వాటా కంటే అదనపు నిధులు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే సహకరించడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
మెట్రో రైల్లో ప్రయాణం..
ఇదిలాఉండగా, మెట్రో రైలు అధికారులతో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ నేతలు లక్ష్మణ్, మోత్కుపల్లి నరసింహులు, చింతల రామచంద్రారెడ్డి, మెట్రోరైలు అధికారులు ఉన్నారు. మెట్రో నిర్వహణకు సంబంధించి వివరాలను అధికారులు కిషన్‌రెడ్డి వివరించారు. మెట్రో రైలు నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యతను మెట్రో అధికారులు విస్మరించడాన్ని కేంద్ర •ంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. కేంద్రం మరో రూ.250కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. ఇంకోసారి నిధుల కోసం తమ వద్దకు రావద్దని హెచ్చరించారు.నిజానికి హైదరాబాద్ పాతబస్తీ వరకు మెట్రో నిర్మాణం జరగాల్సి ఉందని.. కానీ పాతబస్తీ అభివృద్ది చెందడం మజ్లిస్‌కు ఇష్టం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ కుట్రలో టీఆర్ఎస్ భాగమై పాతబస్తీకి మెట్రోను దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ ప్రజలు మజ్లిస్ కుట్రలు,టీఆర్ఎస్ వైఖరిని అర్థం చేసుకోవాలన్నారు. మెట్రో వస్తే పాతబస్తీ రూపు రేఖలు మారిపోయేవని.. కానీ కుట్రపూరితంగా మెట్రోను అక్కడిదాకా తీసుకెళ్లలేదని ఆరోపించారు. కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్‌లో పాతబస్తీ వరకు మెట్రో నిర్మాణం చేపడుతామని చెప్పారని.. అందుకే కేంద్రం కూడా రూ.1458కోట్లు సాయం అందించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తన వాటా కంటే ఎక్కువ నిధులు కేటాయింయించిందన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వాటాను ఇవ్వలేదన్నారు.