Take a fresh look at your lifestyle.

బెంగాల్లో పరిణామాలకు మమత ధోరణి కూడా కారణమేనా?

పశ్చిమ బెంగాల్‌ ‌శాసనసభకు వొచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోపు పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఫిరాయింపులను సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ప్రోత్సహిస్తున్నారని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తన పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల ఆమె మరింత ఆగ్రహంతో రోజుకో ప్రకటన చేస్తున్నారు. మేనల్లుడు అభిజిత్‌ ‌బెనర్జీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే ఆమె పార్టీలో అసమ్మతి పెరిగి పెద్దదవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందులో కొంత నిజం ఉన్నా, అభిజిత్‌కు పార్టీ పెట్టిన నాటి నుంచి ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అసమ్మతి స్వరం వినిపిస్తున్నవారంతా అభిజిత్‌ ‌ద్వారానే ఆమెకు సన్నిహితులయ్యారు. అందువల్ల అది ఒక సాకు మాత్రమే. రాష్ట్రంలో పరిణామాలపై కేంద్రం ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డా పర్యటన సందర్భంగా ఆయన వాహన శ్రేణిపై జరిగిన దాడి సంఘటనను నివారించడంలో విఫలమైన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కేంద్ర సర్వీసులకు వెనక్కి పిలిపించారు. దీంతో మమత భగ్గుమన్నారు. తమ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బాగా పని చేస్తున్నదనీ, నడ్డాపై జరిగిన దాడిలో పోలీసుల వైఫల్యం ఏమీ లేదనీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ‌ఘోష్‌ ‌రెచ్చగొట్టే ప్రకటనల వల్లే దాడి జరిగిందని తృణమూల్‌ ‌నాయకులు అంటున్నారు.

మమతా బెనర్జీ ఇంతకన్నా తీవ్ర స్వరంతో కేంద్రంలోని బీజేపీ నాయకులపై ఆరోపణలను గుప్పించారు. తమ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ నాయకులు టార్గెట్‌ ‌చేశారని, అందులో భాగంగానే ఒక్కొక్కరూ వొచ్చి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎవరెన్ని ప్రకటనలు చేసినా తమ పార్టీ వొచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ ‌సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. అయితే, ఆమె పార్టీలో అసంతృప్తిని గురించి పట్టించుకోకపోవడం వల్ల అసంతృప్తిపరుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని యువ నాయకులు చెబుతున్నారు. పార్టీ సభ్యత్వానికీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన సువేందు అధికారి మమతా బెనర్జీకి ఎంతో విధేయునిగా ఉండేవారనీ, ఆయనను పిలిచి మాట్లాడటానికి బదులు మరింత రెచ్చగొట్టే రీతిలో ప్రకటన చేయడం వల్లనే ఆయన పార్టీకి శాశ్వతంగా దూరమయ్యారని అసమ్మతి నేతలు అంటున్నారు. మమతా బెనర్జీకి జాతీయ స్థాయిలో కూడా తగిన మిత్రులు ఎవరూ లేకపోవడం వల్ల ఆమెలో నిస్పృహ కానవొస్తోందని అంటున్నారు. పశ్చిమబెంగాల్‌ ‌నుంచి పోటీ చేయనున్నట్టు మజ్లిస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎం‌పీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించగానే, ఆయనతో గొడవ పెట్టుకున్నారు. దాంతో ఆయన ఆమెను మరింత తీవ్రంగా విమర్శించారు.

mamatha benarji

- Advertisement -

ఒవైసీ తన పార్టీని దేశవ్యాప్త పార్టీగా చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. బీహార్‌ ఎన్నికలలో నాలుగు స్థానాలు గెల్చి, తర్వాత హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌లో 44 సీట్లు విజయం సాధించగానే ఆయన పార్టీ విస్తరణపై దృష్టిని కేంద్రీకరించారు. ఆయన బెంగాల్‌లో పోటీకి దిగినా తృణమూల్‌కి వొచ్చే నష్టమేమీ లేదు. అయితే, తృణమూల్‌ ‌రొహింగ్యా ముస్లింలపై ఆధారపడుతున్న దృష్ట్యా, ఆయన బరిలోకి దిగితే ఆ వోట్లు చీలిపోతాయేమోనన్న భయం దీదీలో కలిగి ఉండవొచ్చు. మొత్తానికి మమతా బెనర్జీ సహనాన్ని కోల్పోయి మాట్లాడుతుండడాన్ని కేంద్రంలో కమలనాథులు ఆసరాగా తీసుకుని మరింతగా రెచ్చగొడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ‌రాజకీయాలపై సంస్కృతి, భాష ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇతర ప్రాంతాల వారికి అవి జాతీయ పార్టీలైనా సరే ఎక్కువ ఆదరణ ఉండదు. అందువల్ల మమతా బెనర్జీ ఇతరుల ప్రకటనలపై తీవ్రంగా స్పందించకుండా ఉంటే ఆమెకు వొచ్చే నష్టం పెద్దగా ఉండదు.

రాష్ట్రంలో ఆమె పార్టీ కుటుంబ పార్టీగా నడుస్తోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న ముకుల్‌ ‌రాయ్‌ ‌వంటి వారు ఇప్పటికే దూరమయ్యారు. ఆమె పార్టీలో నమ్మదగిన రెండవ శ్రేణి నాయకులు లేరు. పాత వారు కొత్తవారితో కలుపుకుని పోవాలన్న ఆమె ఆదేశలు చాలా మందికి కొరకబడటం లేదు. అంటే, తన మేనల్లుడుతో కలుపుకుని పోవాలని ఆమె ఉద్దేశ్యమై ఉంటుంది. రెండు8 సార్లు ఎంపీగా ఎన్నికైన సునీల్‌ ‌మండల్‌ ‌సువేందు అధికారికి మద్ధతు పలికారు. ఇంకా పలువురు తృణమూల్‌ అసంతృప్త నేతలు బయటికి వొస్తారని అంటున్నారు. పార్టీలో అంతా తాను చెప్పినట్టు వినాలన్న ధోరణిని ఆమె తగ్గించుకోవాలని, అందరినీ కలుపుకుని పోవాలన్న సూత్రాన్ని ముందుగా ఆమె పాటించాలని అసంతృప్త నాయకులు అంటున్నారు.

తమ ప్రాంతానికి వొచ్చిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళిస్తోందని జితేంద్ర తివారీ ఆరోపించారు. ప్రశ్నించిన వారిని తృణమూల్‌ ‌నేతలు ఇష్టం లేని వారు బయటకు పోవాలని అంటున్నారని ఆయన అన్నారు. మమతా బెనర్జీ గతంలో ఈ మాదిరిగా లేరనీ, ఆమె మేనల్లుని పెత్తనం పెరిగిన తర్వాతనే ఆమెలో మార్పు వొచ్చిందని అంటున్నారు. ఏమైనా, నిప్పులేనిదే పొగ రాదన్నట్టు బెంగాల్‌లో మార్క్సిస్టు దుర్గాన్ని కుప్పకూల్చి కొత్త శకానికి నాంది పలికిన మమతా బెనర్జీ తన ధోరణివల్లనే అయినవారినీ, నమ్ముకున్న వారిని దూరం చేసుకుంటున్నారన్న విమర్శలు వొస్తున్నాయి. ఈ పరిస్థితులను కేంద్రంలో కమలనాథులు సహజంగానే వినియోగించుకుంటున్నారు. కమలనాథుల వలలో పడకుండా మమత ఇప్పటికైనా తన ధోరణిని మార్చుకోవాలని తృణమూల్‌ ‌సీనియర్‌ ‌నాయకులు కోరుతున్నారు.

Leave a Reply