Take a fresh look at your lifestyle.

ఉద్యోగాల ప్రకటన ముందస్తు ఎన్నికలకు సంకేతమా ..?

రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా చేసిన ఉద్యోగాల ప్రక•న వెనుక రాజకీయం దాగి ఉందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ళుగా మౌనం వహించిన ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంకన్నా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటనే ఇది అన్న వాదన వినిపిస్తున్నది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న మాట చాలా కాలంగా వినిపిస్తున్నది. దేశంలో తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలను పరిశీలించినప్పుడు కేంద్రంలోని బిజెపికి అనుకూలంగా అంచనాలు వొస్తున్న నేపథ్యంలో కెసిఆర్‌ ‌ముందస్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌ ‌లైన్‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. మన రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకే అన్న నినాదాలు ఆనాడు మిన్ను ముట్టాయి. అయితే తెలంగాణ వొచ్చినప్పటి నుండి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏయేటికి ఆయేడు చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ కూర్చున్నారు.

ఈ ఎనిమిదేళ్ళలో ఏవో ఎన్నికలు రావడం, ఆ సందర్భంగా పాలకులు ఉద్యోగాలపై ఏదో ఒక ప్రకటన చేయడం, దాంతో నిజంగానే నియామకాలు జరిగిపోతాయని ఆశ పడిన నిరుద్యోగులు సంబందిత పోటీ పరీక్షలకోసం ఇల్లు, వళ్ళు గుల్ల చేసుకుని కోచింగ్‌ ‌సెంటర్ల వెంట తిరగడమన్నది పరిపాటైపోయింది. ఎంత ఎదురు చూసినా నోటిఫికేషన్‌ ‌రాకపోవడం, నిరుత్సాహం, నిరాశకు గురైన కొంతమంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు లేకపోలేదు. చాలామంది వయోపరిమితి కూడా దాటిపోవడంతో తీవ్ర నిరుత్సాహ పడ్డారు. ఈ పరిస్థితిలో ప్రతిపక్షాలు కూడా నిరుద్యోగుల పక్షాన అనేక పోరాటాలు చేశాయి. అసలు ఎన్ని ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయన్న విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చలు జరిగిన సంఘటనలు కూడా లేకపోలేదు. రాష్ట్రంలోని నిరుద్యోగాలపై బిశ్వాల్‌ ‌కమిటి ఇచ్చిన రిపోర్టులో లక్షా 92వేల ఖాలీలను పేర్కొనడం జరిగింది. ఈ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రతిపక్షాలు పట్టుపడుతూ వొచ్చాయి. ఇటీవల భారతీయ జనతాపార్టీ దీనిపైన నిరుద్యోగులతో మిలియన్‌మార్చ్ ‌చేపడుతామని ప్రకటన కూడా చేసింది. అలాగే ప్రోఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌నిరుద్యోగులతో హైదారాబాద్‌ను దిగ్భంధం చేస్తామని ప్రకటించారు.

ఏదిఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 80 వేల 39 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభ సాక్షిగా బుధవారం చేసిన ప్రకటన వీటన్నిటికీ చెక్‌ ‌పెట్టినట్లు అయింది. ఎనిమిదేళ్ళుగా అటు నిరుద్యోగులు, ఇటు ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు ఒక్కసారే ఫుల్‌ ‌స్టాప్‌ •ట్టినట్లు అయింది. అయితే లక్షా 92 వేలకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలను ప్రకటించడాన్ని స్వాగతిస్తూనే వాటి భర్తీ విషయంలో గతంలోలాగా జాప్యం చేయకుండా ఉండాలని వారు కోరుకుంటున్నారు. అయితే వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య నలభై లక్షల వరకు ఉంటుందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ఎం‌పి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటున్నారు. కాగా ఉపాధి అవకాశాలు లభించని వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ ‌చేస్తున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌నిరుద్యోగులకు కనీసం మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉద్యోగాలకోసం ప్రభుత్వంపై అదనంగా ఏడు వేల కోట్లకు పైగా భారం పడనుంది. అయితే ముందుగానే చెప్పుకున్నట్లు తెలంగాణ ఏర్పడిందే నిధులు, నీళ్లు, నియామకాల నినాదం పైన. నిధులు, నీళ్ళు మనం సమకూర్చుకోగలిగాం. ఇప్పుడు నియామకాలపైన దృష్టిపెట్టినట్లు ముఖ్యమంత్రి చెప్పడాన్ని బట్టి ఇక ముందు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండదనే భావించాల్సి ఉంటుంది. దానికి తగినట్లుగా ఇక ముందు ప్రతీ సంవత్సరం ఉద్యోగుల భర్తీ విషయంలో క్యాలెండర్‌ను ప్రకటిస్తామని ఆయన చేసిన ప్రకటనకూడా రాబోయే తరాలకు కొంత ఊరటను ఇచ్చేదిగా ఉంది. ప్రతీ శాఖలో వచ్చే ఖాలీలను ముందుగానే ప్రకటించే నిర్ణయం కూడా తీసుకున్నట్లు ఆయన పేర్కొనడం కూడా ఒక కొత్త ఒరవడిగానే ఉంది.

అయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో సిఎం చేసిన ప్రకటన నిజంగానే నిజమైతే రాష్ట్రంలోని దాదాపు పదకొండు వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల పంట పండినట్లే. ఉద్యమకాలంలో, ఆ తర్వాత ఈ విషయాన్ని చాలా సార్లు కెసిఆర్‌ ‌నోటివెంట కాంట్రాక్ట ఉద్యోగులు విన్నారు. ఇకముందు కాంట్రాక్టు ఉద్యోగాలన్నవి ఉండవని, ఉన్నవారిని రెగ్యులరైజ్‌ ‌చేస్తామని చెబుతూ రావడమేగాని ఇంతవరకు వారిని రెగ్యులరైజ్‌ ‌చేసిందిలేదు. ఇకపోతే ఉద్యోగార్థుల వయోపరిమితిని మరో పది సంవత్సరాలపాటు పెంచడమన్నది, తమ వయోపరిమితి దాటిపోతున్నదని విచారం వ్యక్తం చేస్తున్న వారికి ఊరటనిచ్చేదిగా ఉంది. శాసనసభలో కెసిఆర్‌ ‌ప్రకటన చేసినవెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు, కెసిఆర్‌ ‌చిత్రపటానికి పాలభిషేకం చేశారు. కాగా ఈ ప్రకటన ఇప్పుడు ఏపి పాలకులను కుదిపేస్తున్నది కూడా.

Leave a Reply