ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో మార్పన్నదిలేదని స్పష్టంచేసి, యావత్ రాష్ట్ర ప్రజలను మరోసారి ఆలోచనలో పడేశారు. గత కొద్ది నెలలుగా ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది. ఎవరో ఆలాటప్పావాళ్ళు మాట్లాడితే ఎవరూ అంతగా పట్టించుకునేవారుకాదు. కాని, సాక్షాత్తు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎంఎల్ఏలు, పార్టీలోని ముఖ్యులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలోనే, ప్రజా వేదిక సాక్షిగానే మంత్రులు ఈ విషయమై ప్రకటన చేస్తున్నప్పుడు, ఏమాత్రం వారించకుండా ముసిముసిగా కెటిఆర్ నవ్వుకుంటున్న దృశ్యాలు చూసిన వారికెవరికైనా ఏదో మార్పు జరుగుతుందన్నది అర్థంకాకుండా ఉండదు. కెటిఆర్‌ను బాగా అభిమానించే మంత్రి ఎవరైనా ఒక్కరు అలా మాట్లాడి ఉంటారిని తేలిగ్గా తీసుకోవచ్చు, కాని, ఒక మంత్రి ఆయనకు సిఎంగా ఉండే అన్ని అర్హతలున్నాయంటే, మరో మంత్రి.. అయితే తప్పేంటి అని, మరోమంత్రి అయితే ఏకంగా కెటిఆర్‌కే కంగ్రాట్స్ చెప్పడం ఇందుకు ముహూర్తమేదో దగ్గరలోనే ఉందనుకునేట్లుగా కనిపించింది. ఈ మేరకు ముహూర్తాల ప్రకటనలుకూడా ఆచెవి ఈ చెవి పాకాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత దీనికి ముహూర్తం ఖరారైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో విజయం సాధించినా అనుకున్న ఫలితం దక్కకపోవడంతో అదికాస్తా పక్కకు పోయింది. ఆ తర్వాత కెసిఆర్ పుట్టిన రోజున ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అలాగే ఎంఎల్‌సి ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల తర్వాతంటూ వదంతులు వచ్చాయి.
కాని, ఆదివారంనాటి కెసిఆర్ ప్రకటన ఈ ప్రచారాలన్నిటికీ తెరదించినట్లు అయింది. గడచిన రెండు, మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా, అందులోనే కెటిఆర్ స్వయంగా పాల్గొన్న సభల్లో కూడా ఈ విషయం బహిరంగ చర్చ జరుగుతున్నా మౌనం వహించిన కెసిఆర్ ఒక్కసారే ఈ విషయంపై విరుచుకు పడడం ఒకింత ఆశ్చర్యంతోపాటు, ఆలోచింపజేసేదిగా మారింది. దీన్ని ఖండించడానికి కెసిఆర్‌కు ఇంత సమయం ఎందుకుపట్టిందన్నది ఇందులో ప్రధానాంశం. పూర్వం ఇందిరాగాంధీ తన ఆలోచనలో ఉన్న అంశాన్ని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఇతరులద్వారా ఆ అంశసారాంశాన్ని ప్రజల్లోకి వదిలేదట. దాన్ని ప్రతిపక్షాలు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్న దానిపై అంచనా వేసుకున్న తర్వాతే ఆ అంశాన్ని ప్రవేశపెట్టాలవద్దా అని నిర్ణయించుకునేదంటారు. అందులో ఎంతవరకు నిజముందో తెలియదుకాని, కెసిఆర్ కూడా అలాంటి జిమ్మిక్కు ఎదో చేసిఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయన్నది తెలుసుకునేందుకే ఇంతవరకు మౌనం పాటించి ఉండవచ్చన్నది ఒక ఆలోచన.
ఇప్పటికే దూకుడుగా వస్తున్న బిజెపి సిఎం మారితే పార్టీ రెండుగా చీలుతుందని, రానున్న ఎన్నికల్లో ఎలాగూ గెలువలేము కాబట్టి ఈ మూడు సంవత్సరాలైనా కొడుకును ముఖ్యమంత్రిగా కెసిఆర్ చూసుకోవాలనుకుంటున్నాడన్న విమర్శలు చేస్తోంది. కొన్ని సమాచార పత్రికలు, మరికొన్ని సోషల్ మీడియాల్లో అప్పుడే కెటిఆర్ మంత్రివర్గంపై ఊహాగానాలను మొదలుపెట్టాయి. మంత్రివర్గంలో ఉండేదెవరూ, ఊడేదెవరంటూ చర్చలు జరుగుతూ వచ్చాయి. విచిత్రకర విషయమేమంటే గతంలో కూడా ఇదే అంశం వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపించడంవల్లే ఇది విస్తృతమైంది. గతంలో కూడా కెసిఆర్ ఆరోగ్యంపై అనేక వార్తలు వెలువడ్డాయి. అప్పుడుకూడా కాబోయే సిఎం కెటిఆర్ అన్న ప్రచారం జరిగినప్పుడు, ఆ విషయాన్ని కెటిఆర్ నిర్ద్వందంగా కొట్టిపారేశారు. కెసిఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, రాబోయే పది సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, మరెప్పుడూ ఎవరూ ఈ అంశాన్ని ప్రస్తావించవద్దని బహిరం సభల్లో కూడా చెప్పాడు. కాని, ఈసారి ఆయన వేదికమీద ఉండగానే మంత్రులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, శుభాకాంక్షలు చెప్పినా కెటిఆర్ వారిని వారించకోవడం ఈ ప్రచారానికి మరింత తోడైంది.
అలాగే ఆనాడు కెసిఆర్ కూడా నవ్వుతూ, ఛలోక్తలు విసురుతూ అసెంబ్లీలో, బయట దాన్ని సున్నితంగా కొట్టిపారేశారు. కాని, ఈసారి ఆయన దాదాపు రెండు నెలల సమయం తీసుకున్న తర్వాత ఖండించడాన్ని చూస్తే, గతంలో ఇందిరాగాందీ పాలసీని అవలంభించారా అన్న అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రచారంతో తాను సేకరించుకోవాల్సినంత సమాచారాన్ని పొంది ఉంటాడనుకుంటు న్నారు. అయితే త్వరలో ఎంఎల్‌సి, కార్పోరేషన్ల ఎన్నికలు ఉండడం, భారతీయ జనతాపార్టీ ముందుకు దూసుకువస్తున్న తరుణంలో ప్రస్తుతానికి దీనికి పులిస్టాప్ పెట్టాలన్న ఆలోచనమేరకే పార్టీ కార్యవర్గ సమావేశాన్ని వేదికగా తీసుకున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కెసిఆర్ కుటుంబానికే పదవులన్న విమర్శ ఒకటి విస్తృతంగా ప్రచారంలో ఉండగా, ఇప్పుడు కొడుకుకు ఇంత ముఖ్యమైన పదవి కట్టబెట్టడం పార్టీ భవిష్యత్కే ఇబ్బందిగా మారుతుందని కెసిఆర్ ప్రస్తుతానికి దీనికి పులిస్టాఫ్ కాకుండా, కామా పెట్టి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
